Telugu Global
NEWS

రసపట్టులో ఐపీఎల్.. హోరాహోరీగా నాలుగు స్తంభాలాట!

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను గత ఆరు వారాలుగా ఓలలాడిస్తూ వస్తున్న టాటా-ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ సమరం రసపట్టుగా మారింది. 4 జట్ల ప్లేఆఫ్ రౌండ్లో చోటు కోసం మొత్తం 10 జట్లు తలపడుతున్నాయి. 70 మ్యాచ్ లు, 14 రౌండ్ల లీగ్ లో ఇప్పటికే 12 రౌండ్ల పోటీలు ముగిసాయి. 13వ రౌండ్ పోరు సైతం ముగింపు దశకు చేరడంతో ఆఖరి రెండురౌండ్ల పోటీలు.. ఐదుజట్లకు చావోబతుకో సమరంలా మారాయి. ప్లే-ఆఫ్ రౌండ్లో గుజరాత్, […]

రసపట్టులో ఐపీఎల్.. హోరాహోరీగా నాలుగు స్తంభాలాట!
X

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను గత ఆరు వారాలుగా ఓలలాడిస్తూ వస్తున్న టాటా-ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ సమరం రసపట్టుగా మారింది. 4 జట్ల ప్లేఆఫ్ రౌండ్లో చోటు కోసం మొత్తం 10 జట్లు తలపడుతున్నాయి. 70 మ్యాచ్ లు, 14 రౌండ్ల లీగ్ లో ఇప్పటికే 12 రౌండ్ల పోటీలు ముగిసాయి. 13వ రౌండ్ పోరు సైతం ముగింపు దశకు చేరడంతో ఆఖరి రెండురౌండ్ల పోటీలు.. ఐదుజట్లకు చావోబతుకో సమరంలా మారాయి.

ప్లే-ఆఫ్ రౌండ్లో గుజరాత్, రాజస్థాన్..
మొదటి 13 రౌండ్ల మ్యాచ్ లు ముగిసే సమయానికే ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ 10 విజయాలు, 20 పాయింట్లతో ప్లేఆఫ్ రౌండ్ కు అర్హత సాధించిన తొలిజట్టుగా రికార్డుల్లో చేరింది. సంజు శాంసన్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ 13 రౌండ్లలో 8 విజయాలు, 16 పాయింట్లు, కెఎల్ రాహుల్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ సైతం 13 రౌండ్లలో 8 విజయాలు, 16 పాయింట్లతో ప్లేఆఫ్ రౌండ్ ముంగిట నిలిచాయి. గుజరాత్, రాజస్థాన్, లక్నో జట్లు ప్లేఆఫ్ రౌండ్లో తమతమ బెర్త్ లు ఖాయం చేసుకోడంతో.. మిగిలిన ఒక్క స్థానం కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, కింగ్స్ పంజాబ్ తలపడుతున్నాయి.

మూడుజట్లు అవుట్..
ప్లే-ఆఫ్ రౌండ్ రేస్ నుంచి డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ వైదొలిగాయి. మొదటి 12 రౌండ్లలో దారుణంగా విఫలమైన ఈ జట్లు ప్లే-ఆఫ్ బెర్త్ కు నీళ్లు వదులుకున్నాయి. ఇప్పటి వరకూ ఆడిన 12 రౌండ్లలో 5 విజయాలు, 7 పరాజయాలతో నిలిచిన సన్ రైజర్స్.. ఆఖరి రెండురౌండ్లలో నెగ్గినా..14 పాయింట్లు మాత్రమే సాధించగలుగుతుంది. దీంతో.. లీగ్ దశ నుంచే నిష్క్ర‌మించక తప్పని పరిస్థితి నెలకొంది. మొదటి 12 రౌండ్లు ముగిసే సమయానికి 10 జట్ల లీగ్ టేబుల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ 8వస్థానంలో కొనసాగుతోంది.

చెన్నై, ముంబై.. దొందూ దొందే!
ఇక.. ఐపీఎల్ దిగ్గజ జట్లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల ప్రదర్శన గురించే ప్రస్తుత సీజన్ లీగ్ లో ఎంత తక్కువ చెప్పుకొంటే అంతమంచిది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. 13 రౌండ్లలో 4 విజయాలు, 9 పరాజయాలతో లీగ్ టేబుల్ ఆఖరి నుంచి రెండోస్థానంలో కొనసాగుతోంది. ఐదుసార్లు చాంపియన్, రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ పరిస్థితి మరింత దయనీయంగా తయారయ్యింది. మొదటి 12 రౌండ్లలో 3 విజయాలు, 9 పరాజయాలతో లీగ్ టేబుల్ ఆఖరిస్థానానికి పడిపోయింది. ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా 8 పరాజయాల మూటగట్టుకొన్న తొలి దిగ్గజ జట్టుగా ముంబై రికార్డుల్లో చేరింది.

బెంగళూరుకు టెన్షన్ టెన్షన్..
డూప్లెసీ నాయకత్వంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 13 రౌండ్లలో 7 విజయాలు, 6 పరాజయాలతో.. 14 పాయింట్లు సాధించడం ద్వారా.. ప్లేఆఫ్ బెర్త్ ఆవకాశాలను సజీవంగా నిలుపుకోగలిగింది. ఆరునూరైనా ఆఖరి ( 14 వ ) రౌండ్ మ్యాచ్ లో బెంగళూరు నెగ్గితీరాల్సి ఉంది. ప్రస్తుతం లీగ్ టేబుల్ 4వ స్థానంలో కొనసాగుతున్న బెంగళూరు 14వ రౌండ్ పోరులో అసలు సిసలు పోటీని ఎదుర్కోనుంది. మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ 12 రౌండ్లలో 6 విజయాల చొప్పున సాధించి ప్లేఆఫ్ ఆశలు పెంచుకొంటే.. మాజీ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ మాత్రం 13 రౌండ్లలో 6 విజయాలు, 12 పాయింట్లతో లీగ్ టేబుల్ ఆరవ స్థానంలో కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీ, పంజాబ్, హైదరాబాద్ జట్లు ఆడనున్న ఆఖరి రెండురౌండ్ల పోటీల ఫలితాలు..ఏ జట్లను ముంచుతాయో.. ఏ జట్లను తేల్చుతాయో ? తెలుసుకోవాలంటే మరికొద్దిరోజులపాటు వేచిచూడక తప్పదు.

First Published:  16 May 2022 2:08 AM
Next Story