Telugu Global
NEWS

భూమ‌న‌కు కితాబు.. టీటీడీ బోర్డుకు అక్షింత‌లు

వైసీపీ ప్రభుత్వంలో విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి దక్కుతున్న గౌరవం మరెవరికీ దక్కడం లేదు. జగన్‌కు అత్యంత ఇష్టమైన స్వామిజీగా ఆయన్ను భావిస్తారు. మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధులు, మంచి పోస్టులు కోరుకునే అధికారులు అంతా స్వామి ఆశీస్సుల కోసం క్యూ కట్టేవారే. అలాంటి స్వరూపానందేంద్ర టీటీడీ పాలక మండలిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత టీటీడీ పాలకమండలికి బుద్ధి మాంద్యం వచ్చిందేమో అంటూ వ్యాఖ్యానించారు. గతంలో టీటీడీ పాలక మండలి చైర్మన్‌గా చేసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన […]

భూమ‌న‌కు కితాబు.. టీటీడీ బోర్డుకు అక్షింత‌లు
X

వైసీపీ ప్రభుత్వంలో విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి దక్కుతున్న గౌరవం మరెవరికీ దక్కడం లేదు. జగన్‌కు అత్యంత ఇష్టమైన స్వామిజీగా ఆయన్ను భావిస్తారు. మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధులు, మంచి పోస్టులు కోరుకునే అధికారులు అంతా స్వామి ఆశీస్సుల కోసం క్యూ కట్టేవారే.

అలాంటి స్వరూపానందేంద్ర టీటీడీ పాలక మండలిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత టీటీడీ పాలకమండలికి బుద్ధి మాంద్యం వచ్చిందేమో అంటూ వ్యాఖ్యానించారు. గతంలో టీటీడీ పాలక మండలి చైర్మన్‌గా చేసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డిని ఒకవైపు ప్రశంసిస్తూ.. ఇప్పుడున్న పాలక మండలిపై వ్యాఖ్యలు చేయడంతో వైవీ సుబ్బారెడ్డి తీరుపై స్వరూపానందేంద్ర అసంతృప్తిగా ఉన్నారా అన్న చర్చకు అవకాశం ఇచ్చారు.

తిరుపతి గంగమ్మ జాతర సందర్బంగా భక్తులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. గతంలో టీటీడీ పాలక మండళ్లు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేవని.. ఇప్పుడున్న పాలక మండలి పెద్దగా అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కనిపించడం లేదన్నారు. పాలక మండలికి బుద్ధిమాంధ్యం ఉందో లేక కరోనా వల్ల ఇలా జరుగుతోందో గానీ.. ప్రస్తుత బోర్డు నిస్తేజంగా ఉందని విమర్శించారు.

తన పక్కనే ఉన్న భూమన కరుణాకర్ రెడ్డిని ఉద్దేశించి.. భూమన టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు అనేక గొప్ప కార్యక్రమాలు నిర్వహించారని, అలాంటి చైర్మన్ టీటీడీకి మరొకరు రాబోరన్నారు. ఆ సమయంలో కరుణాకర్ రెడ్డికి శారదాపీఠం ఆశీస్సులు అందిస్తూ అండగా ఉండేదని గుర్తు చేశారు.

అనంతరం తిరుమలకు వెళ్లిన స్వరూపానందేంద్ర సరస్వతిని జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.

నిజానికి టీటీడీ చైర్మ‌న్‌గా వైవీ సుబ్బారెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టి నుంచి విప‌రీతంగా ధార్మిక కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టారు. సుబ్బారెడ్డి హ‌యాంలో జ‌రిగిన‌న్ని భ‌క్తి కార్య‌క్ర‌మాలు గ‌తంలో ఎన్న‌డూ జ‌ర‌గ‌లేదు. అయినా స్వ‌రూపానందేంద్ర ఇలా వ్యాఖ్య‌లు చేశాడంటే.. బ‌హుశా ఆయ‌న‌కు కోపం వ‌చ్చి ఉంటుంది. తాను తిరుప‌తికి వ‌చ్చిన‌ప్పుడు సుబ్బారెడ్డి ఇక్క‌డ ఉండి స్వాగ‌తం ప‌ల‌క‌కుండా.. స్వామివారి కార్య‌క్ర‌మాల కోసం భువ‌నేశ్వ‌ర్ వెళ్తాడా..? అనే కోపం అయ్యి ఉండ‌వ‌చ్చ‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఈ ప్ర‌భుత్వంలో స్వ‌రూపానందేంద్ర‌కు ఇంత గౌర‌వం జ‌రుగుతున్నా.. విమ‌ర్శ‌ల‌కు పూనుకున్నాడంటే ఆయ‌న‌కు కూడా అహంకారం త‌ల‌కెక్కింద‌ని భావిస్తున్నారు.

First Published:  15 May 2022 3:04 AM IST
Next Story