Telugu Global
NEWS

ఏపీ అప్పుకు ఓకే.. తెలంగాణకు నో..

కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలపై అప్పుల ద్వారా కూడా పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. రాజకీయ కోణంలోనే అప్పులకు అవకాశం ఇస్తోందా అన్న అభిప్రాయం తాజా పరిణామంతో మరింత బలపడుతోంది. ఈనెల 17న ఆర్బీఐ వేలంలో రెండు వేల కోట్ల రూపాయల రుణం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. కానీ అప్పు కోసం ఈ-వేలంలో పాల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఆర్‌బీఐ అనుమతి ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లేకపోవడాన్ని కారణంగా చూపింది. అదే సమయంలో […]

ఏపీ అప్పుకు ఓకే.. తెలంగాణకు నో..
X

కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలపై అప్పుల ద్వారా కూడా పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. రాజకీయ కోణంలోనే అప్పులకు అవకాశం ఇస్తోందా అన్న అభిప్రాయం తాజా పరిణామంతో మరింత బలపడుతోంది.

ఈనెల 17న ఆర్బీఐ వేలంలో రెండు వేల కోట్ల రూపాయల రుణం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. కానీ అప్పు కోసం ఈ-వేలంలో పాల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఆర్‌బీఐ అనుమతి ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లేకపోవడాన్ని కారణంగా చూపింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మాత్రం 2వేల కోట్ల రూపాయల అప్పు తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

ఈ పరిణామంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఆర్థిక వనరులను దెబ్బతీసి రాజకీయంగా లబ్ది పొందేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణకు అప్పులు తీర్చే సామర్థ్యం, వనరులు ఉన్నాయని తెలిసి కూడా ఇలా అప్పులకు అడ్డుపడడం రాజకీయ కక్షసాధింపేనని ఆరోపిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అప్పుల మోతాదు రాష్ట్ర జీఎస్‌డీపీలో 20 శాతానికి మించకూడదన్న నిబంధనను కేంద్రం ప్రస్తావిస్తోంది. ఈ లిమిట్‌ను దాటి తెలంగాణ అప్పు జీఎస్‌డీపీలో 38 శాతానికి వెళ్లింది. దీన్ని కారణంగా చూపి రుణాలపై ఆంక్షలు విధించడాన్ని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తప్పుపడుతున్నాయి. ఆ నిబంధన కారణంగానే రుణంపై కోతలు పెట్టాలనుకుంటే.. మరి ఏపీ అప్పు ఆ రాష్ట్ర జీఎస్‌డీపీలో ఏకంగా 70 శాతం దాటిపోయిందని.. తెలంగాణ అప్పు నాలుగున్నర లక్షల కోట్ల వరకు ఉంటే.. ఏపీ అప్పు ఎనిమిది లక్షల కోట్లకు చేరిందని.. అలాంటి ఏపీకి కొత్త అప్పులు తీసుకునేందుకు అవకాశం ఇచ్చి.. తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రం ఆర్‌బీఐ వేలంలో పాల్గొనకుండా అడ్డుకోవడం ఇది ముమ్మాటికి రాజకీయ కోణమేనని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అయితే ఏపీకి కొత్త అప్పుల మొత్తం విషయంలోనూ కేంద్రం కత్తెర వేసింది. ఈ ఏడాది 61వేల కోట్ల రూపాయలు అప్పుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని ఏపీ కోరగా.. మోతాదుకు మించి అప్పుల భారాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఈ ఏడాది కేవలం 28వేల కోట్ల రూపాయలు మాత్రమే కొత్తగా ఏపీ అప్పు తీసుకునేందుకు అవకాశం ఇచ్చింది.

First Published:  13 May 2022 10:31 PM GMT
Next Story