Telugu Global
NEWS

బండికి ఈటెల పోటు

తెలంగాణ బీజేపీలో వర్గ పోరు తీవ్రమయ్యింది. బండి సంజయ్ అధ్యక్షుడయ్యాక మొదలైన వర్గ పోరు ఆయన ఒంటెద్దు పోకడలతో మరింత తీవ్రమైంది. సీనియర్లను పట్టించుకోకుండా బండి సంజయ్ చేస్తున్న కార్యకలాపాలు చాలా మంది సీనియర్లకు మొదటి నుండి గిట్టడం లేదు. మొదటి నుండీ హైదరాబాద్ లో బలంగా పాతుకపోయిన నాయకులతో బండి సంజయ్ కి పొసగడం లేదు. ఈ నేపథ్యంలో టీఆరెస్ నుండి బీజేపీలోకి వచ్చిన ఈటల రాజేందర్ కూడా బండి సంజయ్ తో ఢీ అంటే […]

బండికి ఈటెల పోటు
X

తెలంగాణ బీజేపీలో వర్గ పోరు తీవ్రమయ్యింది. బండి సంజయ్ అధ్యక్షుడయ్యాక మొదలైన వర్గ పోరు ఆయన ఒంటెద్దు పోకడలతో మరింత తీవ్రమైంది. సీనియర్లను పట్టించుకోకుండా బండి సంజయ్ చేస్తున్న కార్యకలాపాలు చాలా మంది సీనియర్లకు మొదటి నుండి గిట్టడం లేదు. మొదటి నుండీ హైదరాబాద్ లో బలంగా పాతుకపోయిన నాయకులతో బండి సంజయ్ కి పొసగడం లేదు. ఈ నేపథ్యంలో టీఆరెస్ నుండి బీజేపీలోకి వచ్చిన ఈటల రాజేందర్ కూడా బండి సంజయ్ తో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో ప్రవర్తిస్తుండటం సంజయ్ కి మింగుడుపడటం లేదని ఆయన అనుచరులు వాపోతున్నారు.

హుజూరాబాద్ ఎన్నికల నాటి నుండే ఈ ఇద్దరి మధ్య విబేధాలు మొదలయ్యాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ నాయకులను కాదని ఈటల మొత్తం వ్యవహారం తానే నడపడం.. ఎన్నికల ప్రచారానికి బండి సంజయ్ ని కూడా ఎక్కువగా పిలవకపోవడం.. బీజేపీ పార్టీ కన్నా ఈటల రాజేందర్ పేరుతోనే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం.. ఇటువంటి కారణాలు ఇద్దరి మధ్య విబేధాలకు భీజాలు వేశాయి. ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిచాక ఇక కాబోయే ముఖ్యమంత్రి ఈటలనే అంటూ ఆయన అనుచరులు సోషల్ మీడియాలో ప్రచారానికి దిగడం బండి సంజయ్ కి ఆగ్రహం తెప్పించింది. కొన్ని సార్లు ఆయన తన ఆగ్రహాన్ని బహిరంగంగానే వ్యక్తపరిచారు. కొందరు నాయకులు తన‌కు తెలియకుండా ఎమ్మెల్యే సీట్లకు కొందరికి హామీలిస్తున్నారని, దీన్ని తాను సహించబోనంటూ బహిరంగానే పార్టీ సమావేశాల్లో హెచ్చరించారు సంజయ్. ఆయన ఎవరి పేరూ తీయకపోయినప్పటికీ టార్గెట్ ఈటలనే అనేది ఆ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.

బండి సంజయ్ ఇప్పటికే ఈటల రాజేందర్ ను పట్టించుకోకపోవడం, కార్యక్రమాలకు పిలవకుండా అవమానించడం.. హుజూరాబాద్ తప్ప మరే నియోజకవర్గంలోనూ పర్యటించకుండా ఈటలను కట్టడి చేయంతో మంట మీద ఉన్న ఈటల ఇప్పుడిక సంజయ్ తో యుద్దానికి సిద్దమైనట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సంజయ్ మొదలు పెట్టిన ప్రజాసంగ్రామ యాత్ర మరింత‌ వర్గపోరుకు తెరలేపింది. ఎవరు ఎన్ని వాదనలు చేసినా వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే తానే ముఖ్యమంత్రి అభ్యర్థిననే విషయాన్ని ప్రజల్లోకి, పార్టీ క్యాడర్ లోకి బలంగా తీసుకెళ్ళడమే బండి సంజయ్ యాత్ర లక్ష్యం. సీనియర్లను ఎవ్వరినీ పట్టించుకోకుండా కనీసం సంప్రదించకుండా ఆయన చేస్తున్న ఈ యాత్ర పట్ల చాలా మంది ఆ పార్టీ సీనియర్లు కుతకుతలాడుతున్నారు. ఈటల అయితే అసలు బండి సంజయ్ యాత్ర ఒకటి జరుగుతున్నదన్న విషయమే తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. ఒక వైపు సంజయ్ యాత్ర సాగుతుండగానే ఈటల పలు నియోజకవర్గాల పర్యటన‌ మొదలు పెట్టారు. సంజయ్ కి తెలియకుండానే భారతీయ మజ్దూర్ సంఘ్ సమావేశంలో మాట్లాడారు. సింగరేణి కార్మిలను బీఎమ్ ఎస్ లోకి తీసుక రావడానికి పూర్తి సమయం కేటాయిస్తానని ప్రకటించారు. ప్రకటించడంతోనే ఆగకుండా అనేక మంది సింగరేణి కార్మిక నాయకులతో మాట్లాడుతున్నారు. దీంతో అసలే ఈటల అంటే మండి పోతున్న సంజయ్ అగ్గిమీద గుగ్గిలమైనట్టు తెలుస్తోంది.

ఒకవైపు కిషన్ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, రఘునందన్ రావు లాంటి నేతలతో సంజయ్ కి మంచి సంబంధాలు లేకపోగా ఆయన ఒంటెత్తు పోకడలతో దగ్గరి వారిని కూడా దూరం చేసుకుంటున్నట్టు ఆయన అనుచరులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ కి వ్యతిరేకంగా దాదాపు 10 మంది నాయకులు రహస్య సమావేశం జరపడం , దానిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగిపోయింది. అయినప్పటికీ ఆ పార్టీలో అసమ్మతి అణిచివేయడం సాధ్యం కావడంలేదన్నది బీజేపీ నాయకులే చెబుతున్నారు. ఇక ఇప్పుడు ఈటల ఎపిసోడ్ రసవత్తరంగా మారింది. బండి సంజయ్ తో తాడోపేడో తేల్చుకోవాలని ఈటల రెడీ అయిపోయినట్టు తెలుస్తోంది. అందుకే సంజయ్ యాత్రను పట్టించుకోకపోగా యాత్ర చివరి రోజైన ఈ రోజు(శనివారం) జరిగే బహిరంగ సభకు కూడా ఈటల హాజరు కాబోవడం లేదని సమాచారం. జాతీయ స్థాయిలో ఆ పార్టీలో నెంబర్ టూ గా ఉన్న హోం మంత్రి అమిత్ షా హాజరవుతున్న ఈ సభకు డుమ్మా కొట్టి ఈటల ఢిల్లీకి వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది. పైగా ఢిల్లీలో బీజేపీ జాయింట్‌ సెక్రటరీ శివప్రకాశ్‌, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌తో సమావేశమయ్యి సంజయ్ మీద పిర్యాదులు చేసినట్టు తెలుస్తోంది. తనతో పాటు అనేక మంది సీనియర్ నాయకులను బండి సంజయ్ అవమానిస్తున్నారని, ఒంటెద్దుపోకడలు పోతున్నారని ఈటల వాళ్ళిద్దరికీ పిర్యాదు చేసినట్టు విశ్వసనీయ సమాచారం.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని అప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశం మీదే ఈ వర్గపోరంతా నడుస్తోందని బీజేపీ క్యాడర్ బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 80 స్థానాల్లో ఇప్పటికీ డిపాజిట్లు తెచ్చుకోగల అభ్యర్థులే కరువైన పార్టీ ముఖ్యమంత్రి సీటు కోసం సిగపట్లకు దిగడం పట్ల విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆలూ లేదూ చూలూ లేదు కొడుకు పేరు.. ఏదో అన్నట్టు ఉంది తెలంగాణ బీజేపీ నాయకుల తీరు అని జనాలు అనుకుంటే తప్పేముంది ?

First Published:  13 May 2022 11:33 PM GMT
Next Story