Telugu Global
NEWS

వైఎస్‌ కొండారెడ్డి బహిష్కరణ వెనుక ఫ్యామిలీ గొడవుందా?

వైఎస్‌ కుటుంబంలో కీలక వ్యక్తి వైఎస్ కొండారెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించేందుకు రంగం సిద్ధమవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ కఠిన చర్యలకు, వైఎస్‌ కుటుంబంలో ఏర్పడిన విభేదాలకు ఏమైనా సంబంధం ఉందా అన్న చర్చ నడుస్తోంది. చాలా కాలంగా కడప జిల్లా చక్రాయపేట మండల వైసీపీ ఇన్‌చార్జ్‌గా కొండారెడ్డి ఉన్నారు. ఇటీవల తన మండలం మీదుగా వెళ్లే జాతీయ రహదారి నిర్మాణం విషయంలో కాంట్రాక్టర్‌ను బెదిరించి ఐదు కోట్ల రూపాయాలు డిమాండ్‌ చేశారన్నది అభియోగం. అలా బెదిరింపులకు […]

వైఎస్‌ కొండారెడ్డి బహిష్కరణ వెనుక ఫ్యామిలీ గొడవుందా?
X

వైఎస్‌ కుటుంబంలో కీలక వ్యక్తి వైఎస్ కొండారెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించేందుకు రంగం సిద్ధమవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ కఠిన చర్యలకు, వైఎస్‌ కుటుంబంలో ఏర్పడిన విభేదాలకు ఏమైనా సంబంధం ఉందా అన్న చర్చ నడుస్తోంది.

చాలా కాలంగా కడప జిల్లా చక్రాయపేట మండల వైసీపీ ఇన్‌చార్జ్‌గా కొండారెడ్డి ఉన్నారు. ఇటీవల తన మండలం మీదుగా వెళ్లే జాతీయ రహదారి నిర్మాణం విషయంలో కాంట్రాక్టర్‌ను బెదిరించి ఐదు కోట్ల రూపాయాలు డిమాండ్‌ చేశారన్నది అభియోగం. అలా బెదిరింపులకు గురైన ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ యజమాని రవికుమార్ రెడ్డి.. ఈ విషయాన్ని తన వియ్యంకుడైన, కర్నాటక మంత్రి శ్రీరాములు దృష్టికి తీసుకెళ్లారు.

ఆ విషయం ఢిల్లీలో బీజేపీ నేతల వరకు వెళ్లింది. దాంతో కడప జిల్లా పోలీసులు సీఎంకు దగ్గరి బంధువు అయినప్పటికీ కొండారెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌కు స్వయంగా ముఖ్యమంత్రే ఆదేశించారంటూ వైసీపీ పత్రికలోనూ ప్రముఖంగా ప్రచురించడం విశేషం. బెదిరింపులకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించవద్దని సీఎం ఆదేశించారంటూ సొంత పత్రికలోనే రాసుకున్నారు.

ఇంతకంటే తీవ్రమైన కేసుల్లో కొందరు కుటుంబసభ్యులను మొండిగా వెనుకేసుకొస్తున్న జగన్‌మోహన్ రెడ్డి.. కొండా రెడ్డి విషయంలో ఆయన్ను అరెస్ట్ చేయించడం, ఇప్పుడు ఏకంగా జిల్లా నుంచి బహిష్కరించేలా జిల్లా ఎస్పీ ద్వారా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించడం వైసీపీలోనూ దుమారం రేపుతోంది. కొండా రెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించే ప్రతిపాదనను కలెక్టర్‌కు పంపిన మాట వాస్తవమేనని కడప జిల్లా ఎస్పీ కూడా ధృవీకరించారు.

అరెస్ట్‌ వరకు పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు గానీ.. ఏకంగా జిల్లా నుంచి బహిష్కరించేలా నిర్ణయం తీసుకున్నారంటే అందుకు సీఎం అనుమతి కూడా తప్పనిసరిగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివేకానందరెడ్డి హత్య తర్వాత వైఎస్ కుటుంబం రెండుగా చీలిందన్న ప్రచారం నేపథ్యంలో.. విజయమ్మ తరపు వ్యక్తిగా ముద్రపడడమే కొండారెడ్డి అరెస్ట్‌కు, జిల్లా బహిష్కరణకు ప్రధాన కారణమన్న చర్చ జిల్లాలో నడుస్తోందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. తెలంగాణలో వైఎస్‌ షర్మిల పాదయాత్రకు ఏర్పాట్లు చేయడంలోనూ కొండా రెడ్డి కీలక పాత్ర పోషించారన్న ప్రచారమూ ఉంది.

First Published:  12 May 2022 2:40 AM IST
Next Story