Telugu Global
NEWS

వైసీపీ కేడర్‌ పరిస్థితిపై మాగుంట ఆవేదన

పథకాల పరంగా వైసీపీ ప్రభుత్వం బాగానే పనిచేస్తున్నా.. కేడర్‌ పరంగా ఆ పార్టీ బాగా బలహీనపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి జెండా మోసిన తమకు కొత్తగా ప్రయోజనం లేకపోగా.. చేసిన పనులకు ఏళ్ల తరబడి బిల్లులు ఇవ్వకుండా అప్పులు, వడ్డీలు చెల్లించలేని పరిస్థితికి తీసుకొచ్చారన్నది చాలా మంది వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయం. బిల్లులు చెల్లించకపోవడంతో ఆ ప్రభావం కొన్ని చోట్ల ”గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంపైనా పడుతోంది. పార్టీ కార్యక్రమాలకు, సభలకు రావాల్సిందిగా […]

వైసీపీ కేడర్‌ పరిస్థితిపై మాగుంట ఆవేదన
X

పథకాల పరంగా వైసీపీ ప్రభుత్వం బాగానే పనిచేస్తున్నా.. కేడర్‌ పరంగా ఆ పార్టీ బాగా బలహీనపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి జెండా మోసిన తమకు కొత్తగా ప్రయోజనం లేకపోగా.. చేసిన పనులకు ఏళ్ల తరబడి బిల్లులు ఇవ్వకుండా అప్పులు, వడ్డీలు చెల్లించలేని పరిస్థితికి తీసుకొచ్చారన్నది చాలా మంది వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయం.

బిల్లులు చెల్లించకపోవడంతో ఆ ప్రభావం కొన్ని చోట్ల ”గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంపైనా పడుతోంది. పార్టీ కార్యక్రమాలకు, సభలకు రావాల్సిందిగా కార్యకర్తలను, స్థానిక నాయకులను ఆహ్వానిస్తుంటే.. ముందు పెండింగ్‌ బిల్లులు ఇప్పించండి అని అడుగుతున్నారని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌ రెడ్డి చెప్పారు.

ఒంగోలులో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బుర్రా మధుసూదన్‌ యాదవ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రసంగించిన మాగుంట.. తాను గతంలో కాంగ్రెస్‌, టీడీపీలోనూ పనిచేశానని.. పార్టీ ఏదైనా కార్యకర్తల బలమే ముఖ్యమన్నారు. కాబట్టి కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వంపై ఉందన్నారు. పార్టీ కోసం కార్యకర్తలు ఆస్తులు అమ్ముకుని పనిచేశారన్నారు. అటువంటివారు ఇప్పుడు ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి అని అడుగుతున్నారని ఎంపీ ఆవేదన చెందారు. బిల్లులు తక్షణం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకత్వాన్ని కోరారు.

కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ కూడా ఇదే తరహాలో మాట్లాడారు. తన నియోజకవర్గంలోనే 200 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. కొందరు వైసీపీ నేతలు ఆస్తులు, తోటలను అమ్ముకోవాల్సి రావడం బాధగా ఉందన్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ బకాయిలు కలుపుకుంటే.. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మీద లక్ష 40వేల కోట్ల రూపాయల వరకు పెండింగ్‌ బిల్లులు ఉన్నాయి.

First Published:  12 May 2022 4:59 AM IST
Next Story