Telugu Global
National

దేశద్రోహం చట్టంపై స్టే విధించిన సుప్రీం కోర్టు

IPCలోని సెక్షన్ 124A (దేశద్రోహం) చట్టంపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని పునఃపరిశీలించే వ‌ర‌కు ఈ చట్టం కింద ఉన్న అన్ని కేసుల విచారణ జరగకుండా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ఐపీసీ 124A దేశ ద్రోహ చట్టం కింద కేసులు నమోదు చేయవద్దని కేంద్రం , రాష్ట్రాలకు తేల్చి చెప్పింది. ఇదివరకే ఆ చట్టం కింద కేసులు నమోదు అయిన వారు బెయిల్ పిటిషన్లు పెట్టుకోవచ్చని […]

దేశద్రోహం చట్టంపై స్టే విధించిన సుప్రీం కోర్టు
X

IPCలోని సెక్షన్ 124A (దేశద్రోహం) చట్టంపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని పునఃపరిశీలించే వ‌ర‌కు ఈ చట్టం కింద ఉన్న అన్ని కేసుల విచారణ జరగకుండా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ఐపీసీ 124A దేశ ద్రోహ చట్టం కింద కేసులు నమోదు చేయవద్దని కేంద్రం , రాష్ట్రాలకు తేల్చి చెప్పింది. ఇదివరకే ఆ చట్టం కింద కేసులు నమోదు అయిన వారు బెయిల్ పిటిషన్లు పెట్టుకోవచ్చని సుప్రీం సూచించింది.

IPCలోని సెక్షన్ 124A (దేశద్రోహం) రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, మాజీ మేజర్ జనరల్ SG వొంబట్కెరే దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో బుధ‌వారం విచారణ కొనసాగింది. కేంద్రం యూటర్న్ తీసుకొని సోమవారం నాటి తన అఫిడవిట్ లో ఈ చట్టాన్ని పునఃసమీక్షిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన విచారణలో పునఃసమీక్ష జరిగే వ‌ర‌కు ఆ చట్టం అమలును నిలిపివేయాలని సుప్రీం ఆదేశించింది.

తాజాగా ఏవైనా కేసులు నమోదైతే.. సంబంధిత పక్షాలు కోర్టును ఆశ్రయించవచ్చని, వాటిని త్వరగా పరిష్కరించాలని అభ్యర్థించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతకు ముందు తన వాదనలు వినిపించిన పిటిషనర్ల తరపు న్యాయవాది కపిల్ సిబల్.. దేశవ్యాప్తంగా 800 పైగా దేశద్రోహం కేసులు నమోదయ్యాయని, 13,000 మంది జైలులో ఉన్నారని తెలిపారు.

కేంద్రం తరఫున హాజరైన ఎస్‌జి తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ..పెండింగ్‌లో ఉన్న దేశద్రోహ కేసులకు సంబంధించినంత వరకు ప్రతి కేసు యొక్క పరిస్థితి మనకు తెలియదని, బహుశా టెర్రర్ కోణం లేదా మనీలాండరింగ్ కోణం ఉండవచ్చని సుప్రీం కోర్టుకు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ నిలిపివేయడం సరైంది కాదని, మనం కోర్టులను విశ్వసించాలన్నారు.

అలాగే ప్రమాదకరమైన‌ నేరాన్ని నమోదు చేయకుండా నిరోధించలేమని, దానిపై స్టే విధించడం సరైన విధానం కాదని, అందువల్ల బాధ్యతాయుతమైన అధికారి పరిశీలన చేసి, న్యాయవ్యవస్థకు లోబడి కేసులు పెట్టాల్సి ఉంటుందని సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే.. ప్రభుత్వ వాదనలను తిరస్కరించిన కోర్టు IPCలోని సెక్షన్ 124A (దేశద్రోహం) పై స్టే విధించింది.

First Published:  11 May 2022 2:16 AM GMT
Next Story