భారత్ లో ఫోర్త్ వేవ్ పై కీలక అప్ డేట్..
ఇటీవల భారత్ లో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగించింది. ఓ దశలో రోజువారీ కేసుల్లో పెరుగుదల కొనసాగింది, యాక్టివ్ కేసుల సంఖ్య కూడా రోజు రోజుకీ పెరిగింది. ఢిల్లీలో ఆర్ వేల్యూ 2 కంటే పెరగడంతో ఫోర్త్ వేవ్ వచ్చేసిందనే ప్రచారం జరిగింది. ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో మాస్క్ ల నిబంధనను అందుకే తిరిగి తీసుకొచ్చారు. అయితే ఈ దశలో కేసుల సంఖ్య మళ్లీ తగ్గుతుండటం గమనార్హం. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 20వేల […]
ఇటీవల భారత్ లో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగించింది. ఓ దశలో రోజువారీ కేసుల్లో పెరుగుదల కొనసాగింది, యాక్టివ్ కేసుల సంఖ్య కూడా రోజు రోజుకీ పెరిగింది. ఢిల్లీలో ఆర్ వేల్యూ 2 కంటే పెరగడంతో ఫోర్త్ వేవ్ వచ్చేసిందనే ప్రచారం జరిగింది. ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో మాస్క్ ల నిబంధనను అందుకే తిరిగి తీసుకొచ్చారు. అయితే ఈ దశలో కేసుల సంఖ్య మళ్లీ తగ్గుతుండటం గమనార్హం. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 20వేల లోపుకి చేరుకుంది. కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య 3వేలకంటే దిగువకు పడిపోయింది. రోజువారీ కొత్త కేసులకంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో.. యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గి.. పరిస్థితి కాస్త కుదుటపడ్డట్టే కనిపిస్తోంది.
ఫోర్త్ వేవ్ కి ఛాన్స్ లు తక్కువ..
ఐఐటీ కాన్పూర్ కు చెందిన మణింధర్ అగర్వాల్ చేసిన పరిశోధన ప్రకారం భారత్ లో కరోనా ఫోర్త్ వేవ్ కి ఛాన్స్ లు చాలా తక్కువ. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నట్టు ఆయన వెల్లడించారు. ఈ రెండేళ్ల కాలంలో కరోనా వైరస్ సోకడంతో పెద్ద సంఖ్యలో ప్రజలకు సహజ రోగనిరోధక శక్తి లభించిందని ఆయన అధ్యయనం తేల్చింది. మణింధర్ అభివృద్ధి చేసిన సూత్ర మోడల్ ప్రకారం.. 90 శాతం మంది భారతీయులు సహజ రోగ నిరోధకత పొందారు. దీంతో వీరికి వైరస్ ని ఎదుర్కొనే సామర్థ్యం లభించింది. ఇక వ్యాక్సినేషన్ కూడా భారత్ లో జోరుగా సాగడంతో రోగనిరోధకత ప్రజల్లో మరింత పెరిగింది.
రెండో కారణం మ్యుటేషన్లు..
కొవిడ్ మ్యుటేషన్ల కారణంగా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుందని వైద్య నిపుణులు అంచనా వేశారు. అయితే భారత్ లో ఉన్న వైరస్ లో మ్యుటేషన్ల స్థాయి తక్కువ. జీనోమ్ సీక్వెన్సింగ్ లో కూడా చెప్పుకోదగ్గ విధంగా వైరస్ ఉత్పరివర్తనాలు కనపడలేదు. చివరకు ఢిల్లీలోని కొవిడ్ పాజిటివ్ నమూనాల సీక్వెన్సింగ్ లోనూ ఎలాంటి కొత్త ఉత్పరివర్తనలు కనపడలేదు. అంటే థర్డ్ వేవ్ కి కారణం అయిన ఒమిక్రాన్ ని సమర్థంగా ఎదుర్కొన్న భారత్ లో కొత్త మ్యుటేషన్ల జాడ కనపడలేదన్నమాట. ఇప్పటికీ కొత్తగా నమోదయ్యే కేసుల్లో ఒమిక్రాన్ ఉత్పరివర్తనాలే కనపడుతున్నాయి. అంటే వీటిని ఎదుర్కొనే శక్తి భారతీయుల్లో పుష్కలంగా ఉంది.
ఇటీవల ఒక్కసారిగా అన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు ఎత్తివేయడం, పండగలు, ఫంక్షన్ల కారణంగా కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. అయితే ప్రస్తుత పరిస్థితి ఆందోళన కలిగించేదేమీ కాదని ఐఐటీ నిపుణుల అధ్యయనంలో వెల్లడించింది. ఈ సహజ రోగనిరోధక శక్తిని దాటుకొని వెళ్లి.. కొత్త వేరియంట్ వెలుగులోకి వస్తే, నాలుగో వేవ్ కు అవకాశం ఉంటుంది, కానీ ప్రస్తుతం భారత్ లో అలాంటి పరిస్థితి లేదని మణింధర్ అగర్వాల్ పరిశోధన తెలియజేస్తోంది.