Telugu Global
NEWS

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్.. అసలు కథ ఏంటి..?

మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్ లో ఈరోజు ఉదయం ఐదు గంటలకు ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం ఆయన్ను ఏపీకి తీసుకొస్తున్నారు. ఇటీవల టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నారాయణ స్కూల్స్ ప్రమేయం ఉందని, నారాయణ స్కూల్స్ కి చెందిన వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ అప్రూవర్ గా మారి నేరుగా తమ అధినేత పేరు చెప్పారని, అందుకే నారాయణను అరెస్ట్ చేశారనే ప్రచారం జరిగింది. అయితే ఏపీ సీఐడీ పోలీసులు.. మాజీ […]

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్.. అసలు కథ ఏంటి..?
X

మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్ లో ఈరోజు ఉదయం ఐదు గంటలకు ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం ఆయన్ను ఏపీకి తీసుకొస్తున్నారు. ఇటీవల టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నారాయణ స్కూల్స్ ప్రమేయం ఉందని, నారాయణ స్కూల్స్ కి చెందిన వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ అప్రూవర్ గా మారి నేరుగా తమ అధినేత పేరు చెప్పారని, అందుకే నారాయణను అరెస్ట్ చేశారనే ప్రచారం జరిగింది. అయితే ఏపీ సీఐడీ పోలీసులు.. మాజీ మంత్రిని అమరావతి మాస్టర్ ప్లాన్ డిజైన్ అక్రమాల కేసులో అరెస్ట్ చేశారనే వాదన కూడా వినిపిస్తోంది.

గతంలో రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్ విషయంలో హైకోర్టులో పలు కేసులు దాఖలు అయ్యాయి. ఆ కేసుల్లో ప్రభుత్వం రుజువులు చూపలేకపోయింది. తాజాగా.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు డిజైన్‌లో అక్రమాలపై మరోసారి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు స్వీకరించిన సీఐడీ పోలీసులు మంత్రి నారాయణ సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో అవకతవకలు జరిగాయంటూ ఏప్రిల్ 27న ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు చేయగా.. ఈనెల 6న విచారణ చేపట్టిన పోలీసులు.. అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించి ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు.

ఈ వ్యవహారంలో ఆదివారం కేసు ఫైల్ చేశారు సీఐడీ పోలీసులు. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్‌, ఎల్‌ఈపీఎల్‌ ప్రాజెక్ట్స్‌ అధినేతలు, రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ అంజనీకుమార్‌ పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈమేరకు ఎఫ్ఐఆర్ సిద్ధం చేశారురు.

సెక్షన్లు ఏంటంటే..
ఐపీసీ సెక్షన్‌ 120బి నేరపూరిత కుట్ర సెక్షన్ 420 మోసం, నమ్మకద్రోహం.. ఇంకా 34, 35, 36, 37, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీటితోపాటు.. అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 13(2) రెడ్‌ విత్‌ 13 (1ఏ) కింద కూడా కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

రాజధాని విషయంలో ఇటీవల ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య పెద్దగా మాటల యుద్ధం జరగలేదు. అంతా స్తబ్దుగా ఉంది అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నారాయణ అరెస్ట్ తో కలకలం రేగింది. అయితే ప్రస్తుతానికి నారాయణ ఒక్కరినే అరెస్ట్ చేయడంతో.. అసలు కేసు రాజధాని వ్యవహారమా, లేక టెన్త్ పేపర్ లీకేజీయా అనేది సస్పెన్స్ గా ఉంది.

First Published:  10 May 2022 9:22 AM IST
Next Story