శ్రీలంక ప్రధానమంత్రి మహీందా రాజపక్స రాజీనామా
శ్రీలంకలో దేశవ్యాప్త నిరసనలు తీవ్రతరం అవుతుండగా, శ్రీలంక ప్రధాన మంత్రి మహీందా రాజపక్స సోమవారం రాజీనామా చేశారు. మహీందా నిర్ణయం కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది. దేశంలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి పరిష్కారంగా ప్రధాని పదవి నుంచి వైదొలగాలని అధ్యక్షుడు గోట్‌బయ రాజపక్స శుక్రవారం ప్రత్యేక సమావేశంలో ప్రధానిని అభ్యర్థించినట్లు శ్రీలంకకు చెందిన డైలీ మిర్రర్ నివేదించింది. ఇప్పుడు ప్రధానమంత్రి రాజీనామా చేయడంతో, అధ్యక్షుడు రాజపక్స అఖిలపక్ష మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి […]
శ్రీలంకలో దేశవ్యాప్త నిరసనలు తీవ్రతరం అవుతుండగా, శ్రీలంక ప్రధాన మంత్రి మహీందా రాజపక్స సోమవారం రాజీనామా చేశారు. మహీందా నిర్ణయం కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది.
దేశంలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి పరిష్కారంగా ప్రధాని పదవి నుంచి వైదొలగాలని అధ్యక్షుడు గోట్‌బయ రాజపక్స శుక్రవారం ప్రత్యేక సమావేశంలో ప్రధానిని అభ్యర్థించినట్లు శ్రీలంకకు చెందిన డైలీ మిర్రర్ నివేదించింది.
ఇప్పుడు ప్రధానమంత్రి రాజీనామా చేయడంతో, అధ్యక్షుడు రాజపక్స అఖిలపక్ష మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి పార్లమెంటులోని అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించాలని భావిస్తున్నారు. అయితే అంతకుముందు, ప్రతిపక్ష పార్టీ సమగి జన బలవేగయ (SJB) దాని నాయకుడు సజిత్ ప్రేమదాస మధ్యంతర ప్రభుత్వంలో తాము ప్రధానమంత్రి పదవిని అంగీకరించబోమని తేల్చి చెప్పారు.
మరో వైపు సోమవారం ఉదయం గోట్‌బయ రాజపక్స, మహీందా రాజపక్స మద్దతుదారులు పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించారు మహీందా రాజీనామా చేయడానికి వీలులేదని నినాదాలు చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై దాడులకు దిగారు. ఈ దాడుల్లో దాదాపు 70 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. వీరిని కొలంబో జాతీయ ఆసుపత్రిలో చేర్చారు.
ఈ సందర్భంగా మహింద రాజపక్స ఓ ట్వీట్ లో ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని కోరారు. ”భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నప్పుడు, సాధారణ ప్రజలను సంయమనం పాటించాలని నేను కోరుతున్నాను. హింస అశాంతికి దారితీస్తుందని గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నాను. మనం ఉన్న ఆర్థిక సంక్షోభానికి ఆర్థిక పరిష్కారం అవసరం, ఈ ప్రభుత్వం ఆ సమస్య పరిష్కరించడానికి కట్టుబడి ఉంది,” అని మహీందా అన్నారు. ఈ ట్వీట్ చేసిన కొద్ది సేపటికే ఆయన తన రాజీనామా లేఖను అధ్యక్షుడికి పంపించారు.
మహిందా ట్వీట్‌పై శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర స్పందిస్తూ, “శాంతియుతంగా నిరసన తెలిపే వారిపై దాడి చేసింది మీ మద్దతుదారులే. వాళ్ళే హింసకు పాల్పడ్డారు.”
కాగా విదేశీ మారకద్రవ్యం కొరత కారణంగా శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకపోయింది. ఇంధనం, ఆహారం, ఔషధాల వంటి అవసరమైన సామాగ్రి కొరతకు దారితీసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, చట్టసభ సభ్యులు తక్షణ పరిష్కారాలను కనుగొనాలని కోరుతూ చాలా రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి.