Telugu Global
NEWS

పవన్ అలా.. వీర్రాజు ఇలా.. ఇంతకీ టీడీపీ సంగతేంటి..?

ఏపీలో పొత్తు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటూ పవన్ కల్యాణ్ పొత్తుల ఎత్తులు వేస్తున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా అందరూ కలసిరావాలి, అందుకోసం తాము ఎలాంటి త్యాగానికైనా సిద్ధం అంటూ చంద్రబాబు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్, వామపక్షాలను పక్కనపెడితే.. మిగిలిన ప్రతిపక్ష పార్టీలు మూడు. టీడీపీ, బీజేపీ, జనసేన. ఇందులో టీడీపీకి గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లు రాగా, జనసేనకు ఒకే ఒక్క సీటు వచ్చింది. సీట్ల లెక్కలు ప్రాతిపదికగా […]

పవన్ అలా.. వీర్రాజు ఇలా.. ఇంతకీ టీడీపీ సంగతేంటి..?
X

ఏపీలో పొత్తు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటూ పవన్ కల్యాణ్ పొత్తుల ఎత్తులు వేస్తున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా అందరూ కలసిరావాలి, అందుకోసం తాము ఎలాంటి త్యాగానికైనా సిద్ధం అంటూ చంద్రబాబు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్, వామపక్షాలను పక్కనపెడితే.. మిగిలిన ప్రతిపక్ష పార్టీలు మూడు. టీడీపీ, బీజేపీ, జనసేన. ఇందులో టీడీపీకి గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లు రాగా, జనసేనకు ఒకే ఒక్క సీటు వచ్చింది. సీట్ల లెక్కలు ప్రాతిపదికగా తీసుకుంటే కాంగ్రెస్, బీజేపీ రెండిటికీ ఏపీలో సున్నా చుట్టాల్సిందే. అయితే కాంగ్రెస్ రాష్ట్ర విభజన పాపాన్ని మూటగట్టుకుని, నాయకులు స్తబ్దుగా మారిపోవడంతో జవసత్వాలు లేని పార్టీలాగా ఉంది. బీజేపీకి నాయకులున్నా, ఓట్లు, సీట్లు లేవు. ఇక జనసేనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే గుడ్ బై చెప్పేశారు. టీడీపీ ఒక్కటే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది.

2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుంచే టీడీపీ పావులు కదుపుతోంది. పొత్తులకు తాము సిద్ధమంటూ చంద్రబాబు సంకేతాలు పంపుతున్నారు. అదే సమయంలో జనసేన, టీడీపీతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే బీజేపీ ఈ వ్యవహారంలో కాస్త మెలిక పెడుతోంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ, జనసేన అధికారికంగా మిత్రపక్షాలుగా ఉన్నాయి. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం జనసేనకు ఇష్టం, కానీ బీజేపీకి కష్టం. ఇటీవలే చంద్రబాబు ఆఫర్ పై పరోక్షంగా స్పందించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. త్యాగధనులారా మీ మోసాలిక చెల్లవంటూ సమాధానమిచ్చారు. కుటుంబ పార్టీలతో తామెప్పుడూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. కానీ పవన్ మాత్రం అద్భుతాలు జరిగే అవకాశముందని చెప్పుకొచ్చారు.

పవన్ మాటలపై తాజాగా వీర్రాజు మరోసారి స్పందించారు. టీడీపీతో పొత్తు విషయంలో తమది ఒకటే విధానమన్నారు. అదే సమయంలో జనసేనతో తమ బంధం ధృఢంగానే ఉందని చెప్పారు. పవన్ వ్యాఖ్యలకు ఆయనే అర్థం చెప్పాలన్నారు. టీడీపీ, జనసేన కలుస్తాయా లేదా అనే విషయాన్ని పవన్ కల్యాణ్ నే అడగాలని విలేకరులకు సూచించారు వీర్రాజు.

ఓవైపు పవన్ కల్యాణ్ టీడీపీతో కలిసేందుకు సై అంటున్నారు, అదే సమయంలో వీర్రాజు మాత్రం టీడీపీని దూరం పెట్టాల్సిందేనంటోంది. విచిత్రం ఏంటంటే.. ఈ ఇద్దరు నాయకులు జనసేన-బీజేపీ మధ్య బంధం మాత్రం అలాగే ఉందని చెబుతున్నారు. చివరికి ఏపీలో పొత్తు రాజకీయాలు ఎలా మారతాయో వేచి చూడాలి.

First Published:  9 May 2022 10:54 AM IST
Next Story