శ్రీలంక రణరంగం.. ఘర్షణల్లో హత్యకు గురైన అధికార పార్టీ ఎంపీ
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోజు రోజుకూ ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు శాంతియుతంగానే కొనసాగిన నిరసనలు, ర్యాలీలు ఇప్పుడు హింసాత్మకంగా మారడంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తం అయ్యాయి. తాజాగా కొలంబోలో ఆందోళన కారులకు, ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. గొడవలు జరుగుతున్న సమయంలో అటువైపు కారులో వెళ్తున్న అధికార పార్టీ ఎంపీ అమరకీర్తి అతుకొరాలా హత్యకు గురయ్యారు. మొదట నిరసనకారులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో […]
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోజు రోజుకూ ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు శాంతియుతంగానే కొనసాగిన నిరసనలు, ర్యాలీలు ఇప్పుడు హింసాత్మకంగా మారడంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తం అయ్యాయి. తాజాగా కొలంబోలో ఆందోళన కారులకు, ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. గొడవలు జరుగుతున్న సమయంలో అటువైపు కారులో వెళ్తున్న అధికార పార్టీ ఎంపీ అమరకీర్తి అతుకొరాలా హత్యకు గురయ్యారు.
మొదట నిరసనకారులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఎంపీ తన తుపాకీతో కాల్పులు జరుపగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత ఆయన అక్కడికి దగ్గర్లో ఉన్న భవనంలో దాక్కునేందుకు ప్రయత్నించిన సమయంలో హత్యకు గురైనట్లు పోలీసులు చెప్పారు. సోమవారం జరిగిన హింసాత్మక ఘటనల్లో దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రభుత్వం తక్షణమే కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
శ్రీలంకలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా ఆహార, ఇంధన, ఔషధాల కొరత నెలకొన్నది. దీంతో దాదాపు రెండు నెలల నుంచి ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. రాజపక్స కుటుంబం అధికార పదవులకు రాజీనామా చేయాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మహీంద రాజపక్స రాజీనామా చేశారు. మరోవైపు సోమవారం నాటి హింసలో పలువురు ప్రజా ప్రతినిధుల ఇండ్లకు నిప్పు పెట్టారు. మాజీ మంత్రి జాన్ స్టన్ ఫెర్నాండో కార్యాలయాన్ని నిరసన కారులు తగులబెట్టారు.