Telugu Global
National

నిన్న జహంగీర్ పురి.. నేడు షాహీన్ బాగ్.. వెనక్కి తగ్గిన బుల్డోజర్లు..

ఢిల్లీలోని జహంగీర్ పురి ప్రాంతంలో ఆక్రమణల తొలగింపు ఇటీవల వివాదంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా షాహీన్ బాగ్ ప్రాంతంలో కూడా ఢిల్లీ మున్సిపాల్టీ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాల తొలగింపుకి అధికారులు సిద్ధమయ్యారు. అయితే స్థానికుల ఆందోళనలతో వారు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. గతంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలతో షాహీన్ బాగ్ ప్రాంతం వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఆ ప్రాంతంపై బుల్డోజర్లతో అధికారులు వెళ్లడాన్ని వామపక్షాలు, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ నేతలు […]

నిన్న జహంగీర్ పురి.. నేడు షాహీన్ బాగ్.. వెనక్కి తగ్గిన బుల్డోజర్లు..
X

ఢిల్లీలోని జహంగీర్ పురి ప్రాంతంలో ఆక్రమణల తొలగింపు ఇటీవల వివాదంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా షాహీన్ బాగ్ ప్రాంతంలో కూడా ఢిల్లీ మున్సిపాల్టీ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాల తొలగింపుకి అధికారులు సిద్ధమయ్యారు. అయితే స్థానికుల ఆందోళనలతో వారు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. గతంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలతో షాహీన్ బాగ్ ప్రాంతం వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఆ ప్రాంతంపై బుల్డోజర్లతో అధికారులు వెళ్లడాన్ని వామపక్షాలు, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. మైనార్టీలపై దాడిగా దాన్ని అభివర్ణించారు.

షాహీన్ బాగ్ లో కూల్చివేతలకు దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(SDMC) చర్యలు ప్రారంభించింది. బుల్డోజర్లను తీసుకొచ్చి అక్రమ కట్టడాల కూల్చివేతలకు సిద్ధమయ్యారు అధికారులు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికులతో కలసి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు బుల్డోజర్లకు అడ్డుపడ్డారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో పారామిలిటరీ సిబ్బందిని రంగంలోకి దించారు. అప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. జహంగీర్ పురి ఘటనను దృష్టిలో ఉంచుకుని ముందుగానే భద్రతా సిబ్బందిని మోహరించినా ఫలితం లేదు. ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో చివరకు బుల్డోజర్లే వెనకడుగు వేశాయి. వాటిని అక్కడినుంచి వెనక్కి తీసుకెళ్లిపోయారు పోలీసులు.

మరోవైపు షాహీన్ బాగ్ ఆక్రమణల తొలగింపుపై జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీపీఎం పిటిషన్ దాఖలు చేయడంతో.. కోర్టు ఘాటుగా స్పందించింది. సుప్రీంకోర్టుని రాజకీయాలకు వేదిక చేయొద్దని, కోర్టుని ఆశ్రయించినవారిలో బాధితులు లేరని పేర్కొంది. ఈ ఘటనపై హైకోర్టును ఆశ్రయించాలని బాధితులకు, పిటిషనర్లకు సుప్రీం సూచించింది.

ఇటీవల జహంగీర్‌ పురిలో అక్రమ కట్టడాల కూల్చివేతకు ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ చర్యలు చేపట్టగా.. అక్కడ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో సుప్రీంకోర్టు ఆ ప్రాంతంలో నిర్మాణాల కూల్చివేత డ్రైవ్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. ఇప్పుడు షాహీన్ బాగ్ వ్యవహారం కూడా ఉద్రిక్తతలకు దారి తీసింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ చేతిలో ఉంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య అక్రమ కట్టడాల కూల్చివేత అనేది ఆధిపత్య పోరుగా మారింది.

First Published:  9 May 2022 9:32 AM GMT
Next Story