Telugu Global
National

దేశద్రోహ చట్టాన్ని పునఃపరిశీలించాలని కేంద్రం నిర్ణయం

దేశద్రోహ చట్టాన్ని పునఃపరిశీలించాలని నిర్ణయించినట్లు కేంద్ర‌ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. సెక్షన్ 124A, దేశద్రోహ చట్టం పై రేపు సుప్రీం కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో ఈ మేరకు కేంద్రం సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది. వలస భావజాలాన్ని, వలస చట్టాలని దేశంలో లేకుండా చేయడంలో భాగంగా మోడీ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోందని చెప్పిన కేంద్రం “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (75 సంవత్సరాల స్వాతంత్య్రం) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనికతతో, సెక్షన్ 124A, దేశద్రోహ […]

దేశద్రోహ చట్టాన్ని పునఃపరిశీలించాలని కేంద్రం నిర్ణయం
X

దేశద్రోహ చట్టాన్ని పునఃపరిశీలించాలని నిర్ణయించినట్లు కేంద్ర‌ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. సెక్షన్ 124A, దేశద్రోహ చట్టం పై రేపు సుప్రీం కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో ఈ మేరకు కేంద్రం సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది.

వలస భావజాలాన్ని, వలస చట్టాలని దేశంలో లేకుండా చేయడంలో భాగంగా మోడీ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోందని చెప్పిన కేంద్రం “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (75 సంవత్సరాల స్వాతంత్య్రం) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనికతతో, సెక్షన్ 124A, దేశద్రోహ చట్టాన్ని భారత ప్రభుత్వం పునఃపరిశీలించాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఈ చట్టాన్ని సమీక్షించే వరకు ఈ అంశంపై సుప్రీం విచారణ చేపట్టవద్దని కేంద్రం కోర్టును కోరింది.

కాగా, శనివారం నాడు జరిగిన వాదనల్లో కేంద్ర ప్రభుత్వం దేశద్రోహంపై శిక్షా చట్టాన్ని సమర్థించింది – IPC సెక్షన్ 124A – దేశద్రోహ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కోరింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి కేంద్రం లిఖితపూర్వకంగా తెలియజేసింది. కేదార్ నాథ్ సింగ్ వర్సెస్ బీహార్ కేసులో దేశద్రోహ చట్టాన్ని సమర్థించిన తీర్పుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది.

సెక్షన్ 124ఎ చెల్లుబాటును సమర్థిస్తూ కేదార్ నాథ్ సింగ్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆమోదించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పించారు.

అయితే రెండురోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నది అనేదే ప్రశ్న. శనివారం నుంచి ఈ రోజు (సోమవారం)కి మధ్య ఇంత గుణాత్మక మార్పు ప్రభుత్వంలో ఎలా వచ్చింది..? అనేది తెలియాల్సి ఉంది.

కాగా, దేశద్రోహం చట్టాన్ని అపారంగా దుర్వినియోగం చేయడంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణిచివేసేందుకు మహాత్మాగాంధీ వంటి వ్యక్తులను మౌనంగా ఉంచేందుకు బ్రిటిష్ వారు ఉపయోగించిన ఈ నిబంధనను ఎందుకు రద్దు చేయడం లేదని సుప్రీంకోర్టు గత ఏడాది జూలైలో కేంద్రాన్ని ప్రశ్నించింది.

IPCలోని సెక్షన్ 124A (దేశద్రోహం) రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, మాజీ మేజర్ జనరల్ SG వొంబట్కెరే దాఖలు చేసిన పిటిషన్లను పరిశీలించడానికి అంగీకరిస్తూ, సుప్రీం కోర్ట్ ఈ విచారణ చేపట్టింది.

First Published:  9 May 2022 11:50 AM IST
Next Story