టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో.. మాజీ మంత్రి నారాయణ అరెస్ట్..
ఏపీలో టెన్త్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఈ తెల్లవారు ఝామున 5 గంటలకు ఆయనను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఏపీకి తరలించారు. టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో.. ఇటీవల ఏపీలో టెన్త్ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం సంచలనంగా మారింది. దాదాపు ప్రతిరోజూ పరీక్ష మొదలవగానే పేపర్ వాట్సప్ లలో ప్రత్యక్షం […]
ఏపీలో టెన్త్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఈ తెల్లవారు ఝామున 5 గంటలకు ఆయనను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఏపీకి తరలించారు.
టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో..
ఇటీవల ఏపీలో టెన్త్ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం సంచలనంగా మారింది. దాదాపు ప్రతిరోజూ పరీక్ష మొదలవగానే పేపర్ వాట్సప్ లలో ప్రత్యక్షం అయ్యేది. ఈ లీకేజీలకు సంబంధించి దాదాపు 40మంది ఉపాధ్యాయులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో 26మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఉండటం గమనార్హం. అయితే ప్రైవేట్ విద్యా సంస్థల ప్రోత్సాహంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా వారితో చేతులు కలిపి పేపర్ ని బయటకు తెప్పించగలిగారని పోలీసుల విచారణలో తేలింది. మొత్తం మూడు ప్రైవేటు విద్యాసంస్థలపై ఆరోపణలు వచ్చాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఈ లీకేజీలపై తీవ్రంగా స్పందించారు. పరీక్షల వేళ విద్యార్థులు ఆందోళన చెందొద్దని ఆయన సూచించారు. పరీక్షలయ్యాక రాజకీయాలు మాట్లాడతామని, అప్పటి వరకూ తప్పుడు ప్రచారాలు మానాలని ఆయన ప్రతిపక్షాలకు హితవు పలికారు. పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల ప్రమేయం కూడా ఉందని ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. ఇటీవల తిరుపతి సభలో సీఎం జగన్ కూడా టెన్త్ పరీక్షల లీకేజీ వ్యవహారంపై స్పందించారు. జగన్ కూడా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల ప్రమేయం ఉందని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ ఏపీలో కలకలం రేపింది. నారాయణను అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు ఆయనను ఏపీకి తరలించారు. గుంటూరు, లేదా విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో ఆయనను విచారించే అవకాశముంది. లీకేజీ వ్యవహారంలో అరెస్ట్ అయిన ఉపాధ్యాయులు ఇచ్చిన సమాచారం మేరకు సీఐడీ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.