టీడీపీ, జనసేన పొత్తుపై వైసీపీ ఘాటు వ్యాఖ్యలు..
టీడీపీ, జనసేన పొత్తుకి రెడీగా ఉన్న విషయం తెలిసిందే. ఆమధ్య జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేది లేదన్నారు, తాజాగా చంద్రబాబు.. ప్రతిపక్షాలన్నీ కలసి వైసీపీపై పోరాటం చేయాలని, ఎంతటి త్యాగానికైనా తాను సిద్ధమంటూ హింటిచ్చారు. దీంతో ఈ రెండు పార్టీలు కలసి పనిచేస్తాయనే విషయం రూఢీ అయింది. అయితే ఈ పొత్తులపై వైసీపీ నేతలు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సింగిల్ గా పోటే చేసే దమ్ము లేకే చంద్రబాబు […]
టీడీపీ, జనసేన పొత్తుకి రెడీగా ఉన్న విషయం తెలిసిందే. ఆమధ్య జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేది లేదన్నారు, తాజాగా చంద్రబాబు.. ప్రతిపక్షాలన్నీ కలసి వైసీపీపై పోరాటం చేయాలని, ఎంతటి త్యాగానికైనా తాను సిద్ధమంటూ హింటిచ్చారు. దీంతో ఈ రెండు పార్టీలు కలసి పనిచేస్తాయనే విషయం రూఢీ అయింది. అయితే ఈ పొత్తులపై వైసీపీ నేతలు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సింగిల్ గా పోటే చేసే దమ్ము లేకే చంద్రబాబు పొత్తుల ఎత్తులు వేస్తున్నారని విమర్శించారు మంత్రి అంబటి రాంబాబు. ఎంతమంది కట్ట కట్టుకుని వచ్చినా జగన్ ప్రభుత్వాన్ని దించలేరని అంబటి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుని క్విట్ ఏపీ అని ప్రజలు అంటున్నారని, ఇకపై ఆయన సీఎం అయ్యే అవకాశం లేదని చెప్పారు. ఐదేళ్ల చంద్రబాబు పరిపాలన కన్నా మూడేళ్ల జగన్ పరిపాలన వెయ్యి రెట్లు గొప్పగా ఉందని చెప్పారు అంబటి. జనసేనకు దశ, దిశ లేదని, అంగడిలో వస్తువులా ఎవరు కొంటారా! అని రెడీగా ఉంటుందని ఎద్దేవా చేశారు. జనసేన చంద్రబాబుకు మాత్రమే అమ్ముడుపోయే సరుకంటూ కౌంటర్ ఇచ్చారు.
అప్పుడంతా బ్రోకర్ల మయం..
చంద్రబాబుని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు. జనసేన, టీడీపీ పొత్తు వ్యవహారంపై ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాం అంతా బ్రోకర్ల మయం అని, జగన్ ప్రభుత్వం నయాపైసా లంచం లేకుండా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. బాబు హయాంలో ప్రభుత్వ పథకానికి అర్హుడు కావాలంటే, తాయాలాలు చెల్లించడంతో పాటు, ఇంటి మీద పసుపు జెండా ఉండాల్సిందేనని, కానీ ఇప్పుడలాంటి పరిస్థితి లేదని చెప్పారు.
శవం మాట్లాడుతున్నట్టు..
ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేవన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ, జనసేన నేతలు సమన్వయంతోనే పొత్తులపై ప్రకటనలు చేస్తున్నారని, బీజేపీలోని చంద్రబాబు ఏజెంట్లు సుజనా చౌదరి, సీఎం రమేష్ కూడా కొన్నిరోజుల తర్వాత ఇదే రకమైన ప్రకటనలు చేస్తారని తెలిపారు సజ్జల. జనసేన, టీడీపీ, ఇతర పక్షాలు విడిపోతేనే కదా.. మళ్లీ కలవడానికి అంటూ ఎద్దేవా చేశారు. ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటిస్తూనే.. కూటమికి తాను నాయకత్వం వహిస్తానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు మాట్లాడుతుంటే శవం మాట్లాడుతున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు సజ్జల. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పొత్తులు పెట్టుకోవడంలో చంద్రబాబు నేర్పరి అన్నారు.
ఓటమి భయంతోనే పొత్తులు..
ఓటమి భయంతో ప్రజల మద్దతు లేదనుకుంటున్నవారే పొత్తుల కోసం చూస్తారని చంద్రబాబుపై సెటైర్లు వేశారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని, ప్రజల్లో ఆయన పట్ల విశ్వసనీయత లేదన్నారు. దుర్మార్గపు ఆలోచనలు, ఇతరులపైనే ఆధారపడే తత్వం, వెన్నుపోటు పొడిచే మనస్తత్వం ఉన్న ఏకైక వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు విజయసాయి. టీడీపీ కార్యకర్తలు చేస్తున్న హత్యలు, అత్యాచారాలను.. ప్రభుత్వానికి అంటగడుతూ బురద జల్లుతున్నారంటూ మండిపడ్డారు. ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా 2024లో వైసీపీదే విజయం అన్నారు. తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.