Telugu Global
Others

ఇంటర్నెట్ వాడకంలో పట్టణాలను మించిపోతున్న పల్లెలు.. నీల్సన్ సర్వేలో వెల్లడి

ప్రస్తుతం ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించలేము. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరకే డేటా లభిస్తుండటంతో సగటు ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది. అయితే ‘భారత్ 2.0’ పేరుతో నీల్సన్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు పట్టణాల్లో కంటే ఊర్లల్లోనే నెట్ ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తున్నది. నగరాలు, పట్టణాల్లో 29.4 కోట్ల మంది నెట్ యూజర్లు ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 35.2 […]

ఇంటర్నెట్ వాడకంలో పట్టణాలను మించిపోతున్న పల్లెలు.. నీల్సన్ సర్వేలో వెల్లడి
X

ప్రస్తుతం ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించలేము. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరకే డేటా లభిస్తుండటంతో సగటు ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది. అయితే ‘భారత్ 2.0’ పేరుతో నీల్సన్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు పట్టణాల్లో కంటే ఊర్లల్లోనే నెట్ ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తున్నది. నగరాలు, పట్టణాల్లో 29.4 కోట్ల మంది నెట్ యూజర్లు ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 35.2 కోట్ల మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది.

గత ఏడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా 27,900 కుటుంబాల్లోని 1.10 లక్షల మందిని సర్వే చేశారు. 2019 నుంచి రూరల్ ఏరియాల్లో ఇంటర్నెట్ వాడే వాళ్ల సంఖ్య 45 శాతం మేర పెరిగింది. అయితే ఇంకా అక్కడ 60 శాతం మందికి ఇంటర్నెట్ వాడకంపై అవగాహన లేక, సేవలు అందుబాటులో లేక అటువైపు తొంగి చూడటం లేదని తెలుస్తున్నది. మరోవైపు నగరాల్లో 59 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. గత రెండేళ్లలో వీరి సంఖ్య 28 శాతం మేర వృద్ది చెందినట్లు తెలుస్తున్నది. దేశంలో ప్రస్తుతం ఇంటర్నెట్ వాడుతున్న వాళ్ల సంఖ్య 64.6 కోట్లుగా ఉన్నది.

12 ఏళ్లు నిండిన వాళ్లలో 59.2 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నట్లు సర్వే చెప్తున్నది. ఇక ఇంటర్నెట్ వాడకంలో 60 శాతం మంది మహిళలే ఉన్నారు. గత రెండేళ్లలో 61 శాతం మేర వీరి సంఖ్య పెరిగింది. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడుతున్న మహిళల్లో ముగ్గురిలో ఒకరు గ్రామీణ ప్రాంతానికి చెందిన వాళ్లే కావడం గమనార్హం. స్మార్ట్ ఫోన్లు, డేటా తక్కువ ధరకు లభిస్తుండటంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కవరేజి పెరగడం వల్లే ఇంటర్నెట్ యూసేజ్ పెరిగినట్లు నీల్సన్ సర్వే వెల్లడించింది.

కాగా, నెట్ వాడే వాళ్లలో ఎక్కువగా సోషల్ మీడియా, షాపింగ్ కోసమే దానిపై ఆధారపడుతున్నట్లు తెలుస్తున్నది. దాని తర్వాత డిజిటల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ పేమెంట్ల కొరకు కూడా నెట్ వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 46 శాతం మంది ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలకు ఇంటర్నెట్ వాడుతుండగా.. వారిలో మగవాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉన్నది.

First Published:  7 May 2022 3:46 AM IST
Next Story