Telugu Global
National

అమ్మాయిలు చదువుతున్నారు కానీ, ఉద్యోగాలు చేయట్లేదు..

భారత్ లో మహిళా అక్షరాస్యత శాతం పురుషులకు దీటుగా ఉంది. పురుషుల అక్షరాస్యత 84.7శాతం కాగా, మహిళల అక్షరాస్యత 70.3 శాతం. అంటే చదువు విషయంలో పురుషులు, స్త్రీలకు మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం 14.4 శాతం. చదువులో పురుషులతో పోటీ పడుతున్న మహిళలు.. ఉపాధి విషయంలో మాత్రం ఎందుకో వెనకడుగు వేస్తున్నారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, వివాహం తర్వాత అత్తవారింటి ఆంక్షల నేపథ్యంలో ఉద్యోగాలకు వెళ్లలేకపోతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఈ విషయాలను బహిర్గతం […]

అమ్మాయిలు చదువుతున్నారు కానీ, ఉద్యోగాలు చేయట్లేదు..
X

భారత్ లో మహిళా అక్షరాస్యత శాతం పురుషులకు దీటుగా ఉంది. పురుషుల అక్షరాస్యత 84.7శాతం కాగా, మహిళల అక్షరాస్యత 70.3 శాతం. అంటే చదువు విషయంలో పురుషులు, స్త్రీలకు మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం 14.4 శాతం. చదువులో పురుషులతో పోటీ పడుతున్న మహిళలు.. ఉపాధి విషయంలో మాత్రం ఎందుకో వెనకడుగు వేస్తున్నారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, వివాహం తర్వాత అత్తవారింటి ఆంక్షల నేపథ్యంలో ఉద్యోగాలకు వెళ్లలేకపోతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఈ విషయాలను బహిర్గతం చేసింది. భారత్ లో 15-49 ఏళ్ల వయసు వారిలో 75శాతం మంది అబ్బాయిలు, 25 శాతం మంది అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నట్లు సర్వే వెల్లడించింది. అంటే ఉద్యోగం చేసే పురుషులకు, మహిళలకు మధ్య ఉన్న వ్యత్యాసం 50శాతం.

ఐదేళ్లలో ఒక్కశాతం పెరుగుదల..
“మహిళా సాధికారతలో భారత్ దూసుకుపోతోంది, పలు కార్పొరేట్ కంపెనీలకు సీఈవోలుగా మహిళలే ఉంటున్నారు, ఉద్యోగాల్లో కూడా మహిళలు రాణిస్తున్నారు. రాజకీయాల్లో రాణిస్తున్నారు. చివరకు సైన్యంలో కూడా పురుషులకు దీటుగా మహిళలకు అవకాశాలున్నాయి.” ఇవన్నీ పైకి మనం వింటున్న వార్తలు. కానీ వాస్తవాలు వేరు. ఐదేళ్ల కాలంలో భారత్ లో ఉద్యోగం చేసే మహిళల సంఖ్య కేవలం ఒక్క శాతం మాత్రమే పెరిగింది.

పెళ్లయిన వారి సంగతేంటంటే..?
15-49 ఏళ్ల మధ్య ఉన్న వివాహిత మహిళల్లో 32 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారు. అదే సమయంలో 15-49 ఏళ్ల మధ్య ఉన్న వివాహిత పురుషుల్లో మాత్రం 98 శాతం మంది ఉద్యోగాలు చేస్తున్నారు. భర్తలతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ జీతం పొందే మహిళల సంఖ్య గతంలో 42 శాతంగా ఉండగా.. తాజా సర్వేలో 40 శాతానికి తగ్గడం గమనార్హం. ఉద్యోగం చేసే వివాహిత మహిళల సంఖ్య మిజోరంలో 15.1శాతం, జార్ఖండ్‌లో 6.1శాతం, మధ్యప్రదేశ్‌లో 4.2శాతం తగ్గినట్లు కుటుంబ ఆరోగ్య సర్వే ఫలితాలు చెబుతున్నాయి. మహిళలు ఇంటి పనులకే పరిమితం కావడంతో ఉద్యోగాలకు వెళ్లే అవకాశం లేకుండా పోతోంది. ఒకవేళ అర్హతలున్నా కూడా కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో మహిళలు ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది. ఏళ్లు గడుస్తున్నా ఈ పరిస్థితుల్లో మార్పు లేదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

First Published:  7 May 2022 4:51 PM IST
Next Story