Telugu Global
Cinema & Entertainment

అశోకవనంలో అర్జునకల్యాణం మూవీ రివ్యూ

న‌టీన‌టులు: విశ్వక్ సేన్‌, రుక్స‌ార్ థిల్లాన్, రితిక నాయక్ , కేదార్ శంకర్, గోపరాజు , సత్య శ్రీనివాస్, కాదంబరి కిరణ్, రాజ్ కుమార్ త‌దిత‌రులు. సినిమాటోగ్ర‌ఫీ : ప‌వి కె.ప‌వ‌న్‌ సంగీతం : జై క్రిష్‌ ఎడిట‌ర్‌: విప్ల‌వ్‌ కథ, మాటలు, స్క్రీన్ ప్లే : ర‌వి కిర‌ణ్ కోలా స‌మ‌ర్ప‌ణ‌ : బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌ నిర్మాణం : ఎస్‌.వి.సి.సి.డిజిట‌ల్‌ నిర్మాత‌లు : బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ ద‌ర్శ‌క‌త్వం : విద్యాసాగ‌ర్ చింతా రేటింగ్: 2.5/5 ప్రమోషన్ […]

అశోకవనంలో అర్జునకల్యాణం మూవీ రివ్యూ
X

న‌టీన‌టులు: విశ్వక్ సేన్‌, రుక్స‌ార్ థిల్లాన్, రితిక నాయక్ , కేదార్ శంకర్, గోపరాజు , సత్య శ్రీనివాస్, కాదంబరి కిరణ్, రాజ్ కుమార్ త‌దిత‌రులు.
సినిమాటోగ్ర‌ఫీ : ప‌వి కె.ప‌వ‌న్‌
సంగీతం : జై క్రిష్‌
ఎడిట‌ర్‌: విప్ల‌వ్‌
కథ, మాటలు, స్క్రీన్ ప్లే : ర‌వి కిర‌ణ్ కోలా
స‌మ‌ర్ప‌ణ‌ : బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌
నిర్మాణం : ఎస్‌.వి.సి.సి.డిజిట‌ల్‌
నిర్మాత‌లు : బాపినీడు, సుధీర్ ఈద‌ర‌
ద‌ర్శ‌క‌త్వం : విద్యాసాగ‌ర్ చింతా
రేటింగ్: 2.5/5

ప్రమోషన్ కోసం ప్రాంక్ చేయడానికి ట్రై చేసి బయట ఓవరాక్షన్ చేశాడు విశ్వక్ సేన్. కానీ అశోకవనంలో అర్జునకల్యాణం సినిమాలో మాత్రం విశ్వక్ యాక్షన్ మాత్రమే చేశాడు. అదే ఈ సినిమాకు ప్లస్ అయింది. తన రెగ్యులర్ స్టయిల్ లో విశ్వక్ ఇందులో కనిపించినట్టయితే సినిమా ఫ్లాప్ అయి ఉండేది. కానీ విశ్వక్ తననుతాను మార్చుకున్నాడు. 33 ఏళ్ల వ్యక్తిగా కనిపించేందుకు ఫిజిక్ పరంగానే కాకుండా, ఆ పాత్రలో ఒదిగిపోవడం కోసం నటనపరంగా కూడా చాలా కసరత్తు చేశాడు.

అశోకవనంలో అర్జునకల్యాణం సినిమాలో విశ్వక్ వన్ మేన్ షో కనిపిస్తుంది. అతడి మేనరిజమ్స్, లుక్స్, డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. అందుకే ఈ సినిమా ఆకట్టుకుంటుంది. రొటీన్ కథ అయినప్పటికీ, డిఫరెంట్ సెటప్, మంచి స్క్రీన్ ప్లే పెట్టుకోవడం ఈ సినిమాకు ప్రధానంగా కలిసొచ్చిన అంశాలు.

తెలంగాణలో సూర్యాపేటకి చెందిన అర్జున కుమార్ అల్లం (విశ్వక్ సేన్)కి ఆంధ్రాలో ఉండే మాధవి (రుక్సర్ ధిల్లాన్) తో పెళ్లి కుదురుతుంది. కుటుంబ సమేతంగా నిశ్చితార్థం కోసమని పెళ్లి కూతురి ఊరికెళతాడు అర్జున్. ముప్పై ఏళ్ళు దాటినా ఇంకా పెళ్లి కాలేదనే భాద నుండి బయటపడి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాననే ఆనందంతో ఉన్న అర్జున్ కి కొన్ని రోజులకే ఆ ఆనందం దూరమవుతుంది. నిశ్చితార్థం కోసమని మాధవి ఇంటికి వెళ్లి లాక్ డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయిన అర్జున్ కి ఊహించని పరిణామం ఎదురై మాధవితో పెళ్లి కాన్సిల్ అవుతుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక ప్రేమించిన అబ్బాయితో మాధవి వెళ్ళిపోయిందని తెలుసుకున్న అర్జున్ తన పెళ్లి విషయం మళ్ళీ మొదటికి వచ్చిందని లోలోపల కుమిలిపోతుంటాడు. మరి అర్జున్ ఈ భాద నుండి ఎలా బయటపడ్డాడు? పెళ్లికూతురు ఇంట్లో ఎందుకు అతడు, అతడి కుటుంబం లాక్ అవ్వాల్సి వచ్చింది అనేది బ్యాలెన్స్ స్టోరీ.

కథగా చెప్పకుంటే ఈ సినిమాలో హీరో విశ్వక్, హీరోయిన్ రుక్సార్ అనుకుంటారు ఎవరైనా. ప్రచారం కూడా అలానే జరిగింది. కానీ ఈ సినిమాలో అసలు హీరోయిన్ రుక్సార్ కాదు. మరో అమ్మాయి ఉంది. ఆమె పేరు రితిక నాయక్. సినిమాలో విశ్వక్ తర్వాత ఎట్రాక్ట్ చేసిన క్యారెక్టర్ ఏమైనా ఉందంటే, అది రితికా నాయక్. ఆమె అందం, యాక్టింగ్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఈ సినిమాతో ఆమెకు ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. ప్రమోషన్స్ లో ఆమెను కావాలనే పక్కనపెట్టారు. ఎందుకో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్వక్ సేన్ గురించి ప్రారంభంలోనే చెప్పుకున్నాం కాబట్టి, మిగతా నటీనటుల గురించి చెప్పుకుందాం. పెళ్లికొడుకు తరఫు బంధువుగా గోపరాజు, పెళ్లికూతురు తరఫు బంధువుగా కాదంబరి కిరణ్ మెరిశారు. ఇక పెళ్లి ఫొటోలు, వీడియోలు తీయడానికొచ్చిన వ్యక్తిగా చౌదరి మరోసారి అందర్నీ ఆకట్టుకున్నాడు.

టెక్నికల్ గా చూసుకుంటే.. జై క్రిష్ మ్యూజిక్ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచింది. ఇలాంటి సాఫ్ట్ మూవీకి మ్యూజిక్ బాగా పండాలి. ఈ సినిమాలో అది వర్కవుట్ అయింది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. అయితే సినిమా రిలీజ్ కు ముందే సూపర్ హిట్టయిన సిన్నవాడా అనే సాంగ్ ను ఓపెనింగ్ టైటిల్స్ లోనే పెట్టి నిరాశపరిచారు. ఆ పాటను మాంటేజ్ గా వివిధ సందర్భాల్లో సినిమాలో వాడుకొని ఉంటే బాగుండేది. బ్రేకప్ సాంగ్ ను డిఫరెంట్ గా కంపోజ్ చేసినప్పటికీ, సినిమాలో దాన్ని ఇరికించినట్టయింది.

ఇక టెక్నీషియన్స్ లో ఎవరినైనా విమర్శించాల్సి వస్తే అది ఎడిటర్ విప్లవ్ మాత్రమే. ఇతడి ఎడిటింగ్ పూర్ గా ఉంది. సెకెండాఫ్ లో దాదాపు 15 నిమిషాలు సినిమాను కట్ చేసి అవతల పడేయొచ్చు. ఫస్టాఫ్ లో కూడా కొన్ని ల్యాగ్స్ ఉన్నాయి. 2 గంటల్లో ఈ సినిమాను ముగిస్తే చాలా బాగుండేది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఈ సినిమా స్టోరీలైన్ సింపుల్. ఇంకా చెప్పాలంటే ఇంటర్వెల్ కార్డు పడేసరికి, మనకు క్లయిమాక్స్ ఏంటనేది అర్థమైపోతుంది. ఇలా ఊహించుకునే విధంగా ఉన్న కథను మంచి సన్నివేశాలు, స్క్రీన్ ప్లే పెట్టి నడిపించిన తీరు బాగుంది. ఈ క్రమంలో కొన్ని సన్నివేశాల్ని సాగదీయడం మాత్రం బాగాలేదు. ఇక కరోనా/లాక్ డౌన్ కాన్సెప్ట్ ను వాడడం ఔట్ డేటెడ్ అనిపిస్తుంది. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ తో వివాహభోజనంబు అనే సినిమా వచ్చేసింది. అయినప్పటికీ ఈ కథను నడిపించడానికి అంతకుమించి లాజిక్/రీజన్ ఇంకొకటి లేదు కూడా.

ఓవరాల్ గా స్లో నెరేషన్, అక్కడక్కడా సాగినట్టుండే కొన్ని సీన్స్, వీక్ స్టోరీ లైన్ సినిమాకు మైనస్ కాగా, విశ్వక్ సేన్ నటన, రితిక క్యారెక్టర్, కామెడీ, ఫ్యామిలీ సీన్స్, లవ్ ట్రాక్, మ్యూజిక్, విజువల్స్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఓ ఫీల్ గుడ్ చిత్రంగా, ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రంగా నిలుస్తుంది అశోకవనంలో అర్జునకల్యాణం.

First Published:  6 May 2022 12:12 PM IST
Next Story