అకాల వర్షం.. తెలంగాణకు అపార నష్టం..
అకాల వర్షం రైతన్నలను నిండా ముంచేసింది. కోతకు వచ్చిన వరి నీట మునిగింది. కళ్లాల్లోని ధాన్యం తడిచిపోయింది. ఈదురు గాలులతో ఇతర పంటలు సైతం దెబ్బతిన్నాయి. ఇక హైదరాబాద్ నగరం మరోసారి జలమయం అయింది. తెల్లవారు ఝామునుంచి భారీగా కురుస్తున్న వర్షానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలాలు పొంగి పొర్లుతున్నాయి, రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలబడిపోయింది. భారీ గాలులకు హోర్డింగ్ లు విరిగిపడ్డాయి. ఎండవేడికి ఉపశమనం.. అయినా..? ఎండలు మండిపోతున్న వేళ.. ఒక్కసారిగా వర్షంతో […]
అకాల వర్షం రైతన్నలను నిండా ముంచేసింది. కోతకు వచ్చిన వరి నీట మునిగింది. కళ్లాల్లోని ధాన్యం తడిచిపోయింది. ఈదురు గాలులతో ఇతర పంటలు సైతం దెబ్బతిన్నాయి. ఇక హైదరాబాద్ నగరం మరోసారి జలమయం అయింది. తెల్లవారు ఝామునుంచి భారీగా కురుస్తున్న వర్షానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలాలు పొంగి పొర్లుతున్నాయి, రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలబడిపోయింది. భారీ గాలులకు హోర్డింగ్ లు విరిగిపడ్డాయి.
ఎండవేడికి ఉపశమనం.. అయినా..?
ఎండలు మండిపోతున్న వేళ.. ఒక్కసారిగా వర్షంతో నగరవాసులు ఊరటపొందినా ఇబ్బందులు మాత్రం తప్పలేదు. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈరోజు తెల్లవారు ఝామునుంచి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తెలంగాణలో వర్షం పడింది. హైదరాబాద్ నగర పరిధిలో సీతాఫల్ మండి ప్రాంతంలో అత్యథికంగా 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బన్సీలాల్ పేట లో 6.7, వెస్ట్ మారేడు పల్లిలో 6.1, ఆల్వాల్ లో 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో ఎల్బీనగర్, కొత్త పేట, చైతన్యపురి, మలక్ పేట్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్ ప్రాంతాలు జలమయం అయ్యాయి.
యాదాద్రి క్యూ కాంప్లెక్స్ లోకి నీరు..
నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ మొదలు పెట్టగా.. ఐకేపీ సెంటర్లకు భారీగా రైతులు ధాన్యం తరలిస్తున్నారు. అయితే అకాల వర్షంతో కేంద్రాల వద్ద కొనుగోలుకి సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసిపోయింది. యాదాద్రిలో భారీ వర్షం కురిసింది. ఆలయం క్యూ కాంప్లెక్స్ లోకి కూడా వర్షపు నీరు చేరింది. భువనగిరి పట్టణం మొత్తం జలమయంగా మారింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాన బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలులతో పలుప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కోతకు సిద్ధంగా ఉన్న మామిడి కాయలు నేల రాలాయి. జగిత్యాలలో పిడుగుపాటుకు ఇద్దరు గాయపడగా, 43 మేకలు మృతిచెందాయి. పెద్దపల్లి, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు.