Telugu Global
NEWS

చెస్ ఒలింపియాడ్‌లో తెలుగు వెలుగు.. భారతజట్టులో నలుగురు తెలుగు గ్రాండ్ మాస్టర్లు

మేధో క్రీడ చదరంగంలో తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు తమ సత్తా చాటుకుంటూ ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. భారత్ వేదికగా మరికొద్ది వారాలలో జరుగనున్న 44వ చెస్‌ ఒలింపియాడ్ లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లలో తెలుగు రాష్ట్రాల‌ నలుగురు గ్రాండ్ మాస్టర్లు చోటు సంపాదించి సరికొత్త చరిత్ర సృష్టించారు. రష్యా కాదు.. భారత్ లో.. ప్రపంచ చదరంగంలో ఒలింపియాడ్ పేరుతో పురుషుల, మహిళల విభాగాలలో అంతర్జాతీయ చదరంగ సమాఖ్య వేర్వేరుగా టీమ్ పోటీలు నిర్వహిస్తూ ఉంటుంది. రష్యా- […]

చెస్ ఒలింపియాడ్‌లో తెలుగు వెలుగు.. భారతజట్టులో నలుగురు తెలుగు గ్రాండ్ మాస్టర్లు
X

మేధో క్రీడ చదరంగంలో తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు తమ సత్తా చాటుకుంటూ ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. భారత్ వేదికగా మరికొద్ది వారాలలో జరుగనున్న 44వ చెస్‌ ఒలింపియాడ్ లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లలో తెలుగు రాష్ట్రాల‌ నలుగురు గ్రాండ్ మాస్టర్లు చోటు సంపాదించి సరికొత్త చరిత్ర సృష్టించారు.

రష్యా కాదు.. భారత్ లో..
ప్రపంచ చదరంగంలో ఒలింపియాడ్ పేరుతో పురుషుల, మహిళల విభాగాలలో అంతర్జాతీయ చదరంగ సమాఖ్య వేర్వేరుగా టీమ్ పోటీలు నిర్వహిస్తూ ఉంటుంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా.. రష్యా వేదికగా జరగాల్సిన 44వ ప్రపంచ చెస్‌ ఒలింపియాడ్ ను భారత్ వేదికగా నిర్వహించడానికి రంగం సిద్ధం చేశారు. చెన్నై వేదికగా జూలై 28 నుంచి 14 రోజులపాటు ఈ మెగా టోర్నీని నిర్వహించనున్నారు. విశ్వ చెస్ సమాఖ్యలో సభ్యత్వం ఉన్న 150 దేశాలకు చెందిన జట్లు పురుషుల, మహిళల విభాగాలలో పోటీపడనున్నాయి.

భారతజట్టు మెంటార్ గా ఆనంద్..
ప్రపంచ చెస్ ఒలింపియాడ్ లో పాల్గొనే భారత జట్లను అఖిలభారత చెస్ సమాఖ్య ఖరారు చేసింది. ఇండియా-ఏ, ఇండియా-బీ జట్లలో మొత్తం 20 మంది క్రీడాకారులకు ర్యాంకింగ్స్ ఆధారంగా చోటు కల్పించింది. భారత పురుషుల, మహిళల-ఏ జట్లలోనే తెలుగు రాష్ట్రాల గ్రాండ్ మాస్టర్లు పెంటేల హరికృష్ణ, ఇరగేసి అర్జున్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక చోటు దక్కించుకొన్నారు.

ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌కు తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరగేసి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇటీవల వరుస విజయాలతో జోరు మీదున్న వరంగల్‌ కుర్రాడు మెగాటోర్నీలో సత్తా చాటేందుకు తహతహలాడుతున్నాడు. చెన్నై వేదికగా జూలై 28 నుంచి జరుగనున్న 44వ ఒలింపియాడ్‌కు అఖిల భారత చెస్‌ ఫెడరేషన్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌) భారత జట్లను సోమవారం ప్రకటించింది. ఓపెన్‌, మహిళల విభాగంలో 20 మంది ప్లేయర్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు.

భారత్ కు ఘనమైన రికార్డు..
ఇతిహాస క్రీడ చదరంగంలో భారత్ కు ఘనమైన చరిత్రే ఉంది. అంతేకాదు..చెస్ ఒలింపియాడ్ లో సైతం భారత్ 2014లో కాంస్యం, 2020లో స్వర్ణం, 2021లో కాంస్యం పతకాలు గెలుచుకొంది. రష్యా, బ్రిటన్, నార్వే, చైనా లాంటి దేశాలకు గట్టిపోటీ ఇస్తూ ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా గుర్తింపు సంపాదించింది. గత చెస్ ఒలింపియాడ్ లో కాంస్య పతకంతోనే సరిపెట్టుకొన్న భారత్ ప్రస్తుత టోర్నీలో మాత్రం ఆతిథ్య హోదాలో మరింత మెరుగ్గా రాణించే అవకాశం ఉంది.

అర్జున్ కు తొలి ఒలింపియాడ్..
వరంగల్ కుర్రాడు, తెలంగాణా తొలి గ్రాండ్ మాస్టర్ ఇరగేసి అర్జున్ తన కెరియర్ లో తొలిసారిగా చెస్ ఒలింపియాడ్ కు ఎంపికయ్యాడు. ఇటీవలే ముగిసిన పలు అంతర్జాతీయ టోర్నీలతో పాటు జాతీయ చెస్ టోర్నీలోనూ విజేతగా నిలవడం ద్వారా భారతజట్టులో చోటు సంపాదించగలిగాడు. భారత చెస్ ఎవరెస్ట్ , సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మెంటార్ గా భారతజట్లు బంగారు వేట కోసం సన్నాహాలు మొదలు పెట్టాయి. చెస్ ఒలింపియాడ్ చరిత్రలో భారతజట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు గ్రాండ్ మాస్టర్లు చోటు సంపాదించడం ఇదే మొదటిసారి.

జట్లు
ఓపెన్‌: ఇండియా-ఏ: విదిత్‌ గుజరాతి, హరికృష్ణ, అర్జున్‌ ఇరిగేసి, నారాయణన్‌, శశికిరణ్‌.
ఇండియా-బీ: నిహాల్‌ సరిన్‌, గుకేశ్‌, అదిబన్‌, ప్రజ్ఞానంద, రౌనక్‌ సాధ్వని.
మహిళలు: ఇండియా- ఏ: కోనేరు హంపి, హారిక, వైశాలి, తానియా సచ్‌దేవ్‌, భక్తి కులకర్ణి.
ఇండియా -బీ: వాంతిక అగర్వాల్‌, సౌమ్య స్వామినాథన్‌, మేరి అన్‌గోమ్స్‌, పద్మినీ రౌత్‌, దివ్య దేశ్‌ముఖ్‌.

First Published:  4 May 2022 1:11 AM GMT
Next Story