Telugu Global
NEWS

ఐపీఎల్ -15లో కొత్తగాలి!.. కొత్తజట్ల జోరు.. దిగ్గజ జట్ల బేజారు

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన టీ-20 ఐపీఎల్ అనగానే ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్, నాలుగుసార్లు విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్, మాజీ చాంపియన్లు కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మాత్రమే గుర్తుకు వస్తాయి. అయితే.. ప్రస్తుత 15వ సీజన్ 10 జట్ల లీగ్ లో మాత్రం పరిస్థితి ఒక్కసారిగా తారుమారయ్యింది. ప్రస్తుత సీజన్ ద్వారా అరంగేట్రం చేసిన అహ్మదాబాద్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల జోరుముందు గతమెంతో ఘనమైన జట్లు బేజారెత్తి […]

ఐపీఎల్ -15లో కొత్తగాలి!.. కొత్తజట్ల జోరు.. దిగ్గజ జట్ల బేజారు
X

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన టీ-20 ఐపీఎల్ అనగానే ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్, నాలుగుసార్లు విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్, మాజీ చాంపియన్లు కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మాత్రమే గుర్తుకు వస్తాయి. అయితే.. ప్రస్తుత 15వ సీజన్ 10 జట్ల లీగ్ లో మాత్రం పరిస్థితి ఒక్కసారిగా తారుమారయ్యింది. ప్రస్తుత సీజన్ ద్వారా అరంగేట్రం చేసిన అహ్మదాబాద్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల జోరుముందు గతమెంతో ఘనమైన జట్లు బేజారెత్తి పోతున్నాయి.

మెగా వేలంతో సీన్ రివర్స్..
10 జట్ల ఐపీఎల్ 15వ సీజన్ కోసం నిర్వహించిన మెగావేలంతో.. జట్ల కూర్పు సమూలంగా మారిపోయింది. రిటెన్షన్ ఆటగాళ్లు ముగ్గురు లేదా నలుగురు మినహా.. వివిధ జట్లలోకి కొత్త ఆటగాళ్లు వచ్చి చేరడంతో జట్ల సమతుల్యం సమూలంగా మారిపోయింది. వేలం ద్వారా అత్యుత్తమ ఆటగాళ్లను దక్కించుకొనే అవకాశం ఉండడంతో.. సరికొత్త ఫ్రాంచైజీలు ఆ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోగలిగాయి. దీనికితోడు.. ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్ కతా లాంటి జట్లను మితిమీరిన ఆత్మవిశ్వాసం సైతం దెబ్బతీసింది. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని 5వేల కోట్ల రూపాయల ధరకు దక్కించుకొన్న సీవీసీ క్యాపిటల్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా నాయకత్వంలో సమతూకంతో కూడిన జట్టును సమకూర్చుకోగలిగింది. ఓపెనర్ శుభ్ మన్ గిల్, కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, మిడిలార్డర్ఆటగాళ్లు రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్, స్పిన్ జాదూ రషీద్ ఖాన్, వెటరన్ పేసర్ మహ్మద్ షమీలతో అహ్మదాబాద్ జట్టు అత్యంత పటిష్టమైన, సమతూకంతో కూడిన జట్టుగా నిలిచింది.

టైటాన్స్ సరికొత్త రికార్డు..
ప్రస్తుత సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకూ ఆడిన మొదటి 9 రౌండ్లలో 8 విజయాలు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ టాపర్ గా..ప్లే ఆఫ్ రౌండ్ కు చేరువగా నిలిచింది. మొత్తం 14 రౌండ్లలో మొదటి 9 రౌండ్లలో 8 విజయాలు, ఒకే ఒక్క పరాజయంతో నిలిచిన గుజరాత్ టైటాన్స్.. హాట్ ఫేవరెట్ జట్టుగా నిలిచింది. చేజింగ్ విజయాల సాధనలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్ 15 సీజన్ల చరిత్రలో మొదటి 9 రౌండ్లలోనే 8 విజయాలు సాధించిన ఏకైక, తొలిజట్టుగా అహ్మదాబాద్ చరిత్ర సృష్టించింది.

అదేదారిలో లక్నో సూపర్ జెయింట్స్..
ఐపీఎల్ 15వ సీజన్లో రెండో నయా ఫ్రాంచైజీ.. లక్నో హక్కుల కోసం 7వేల కోట్ల‌ రూపాయల భారీమొత్తం చెల్లించింది. సంజీవ్ గోయెంకా నేతృత్వంలోని లక్నోజట్టుకు స్టార్ ఓపెనర్ కెఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తున్నాడు. లక్నోజట్టు ఆడిన మొదటి 10 రౌండ్లలో 7 విజయాలు, 3 పరాజయాల రికార్డుతో ..14 పాయింట్లతో అహ్మదాబాద్ తర్వాతి స్థానంలో నిలిచింది. మిగిలిన నాలుగు రౌండ్లలో లక్నో రెండు విజయాలు సాధించగలిగితే అలవోకగా ప్లేఆఫ్ రౌండ్ చేరుకోగలుగుతుంది. లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్ ఇప్పటికే మూడు శతకాలతో పరుగుల మోత మోగిస్తూ తనజట్టు బ్యాటింగ్ కే వెన్నెముకగా నిలిచాడు.

దిగ్గజ జట్ల గజగజ..
మరోవైపు.. ఐపీఎల్ ఆల్ టైమ్ గ్రేట్ జట్లుగా పేరున్న ఐదుసార్లు విన్నర్ ముంబై ఇండియన్స్ 9 రౌండ్లలో 8 వరుస పరాజయాలతో లీగ్ టేబుల్ అట్టడుగు స్థానానికి పడిపోయింది. తొలిగెలుపు కోసం తొమ్మిదిరౌండ్ల మ్యాచ్ లపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. ఇప్పటికే ప్లే-ఆఫ్ రౌండ్ కు దూరమైన ముంబై మిగిలిన 5 రౌండ్లలో.. ఐదుకు ఐదూ నెగ్గినా పరువు మాత్రమే దక్కించుకోగలుగుతుంది. నాలుగుసార్లు విజేత చెన్నైజట్టు పరిస్థితి సైతం ముంబైకి ఏమాత్రం భిన్నంగా లేదు. మొదటి 9 రౌండ్లలో 3 విజయాలు, 6 పరాజయాలతో 6 పాయింట్లు సాధించడం ద్వారా.. లీగ్ టేబుల్ 9వ స్థానంలో కొనసాగుతోంది. చెన్నైజట్టు ప్లేఆఫ్ రౌండ్ చేరాలంటే మిగిలిన 5 రౌండ్ల మ్యాచ్ లూ నెగ్గితీరాల్సి ఉంది. జైపూర్, కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్, పంజాబ్, ఢిల్లీ జట్లు ప్లే ఆఫ్ రౌండ్లోని మిగిలిన రెండుస్థానాల కోసం గొప్ప సమరమే చేస్తున్నాయి. లీగ్ దశ చివరి ఐదురౌండ్ల మ్యాచ్ లూ అహ్మదాబాద్, లక్నో జట్లు మినహా మిగిలిన జట్లకు డూ ఆర్ డై సమరమే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  3 May 2022 2:09 AM GMT
Next Story