Telugu Global
NEWS

8 మ్యాచ్ ల్లో 4 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు.. ఢిల్లీ స్పిన్నర్ అసాధారణ రికార్డు

టాటా ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ లో ఢిల్లీ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మణికట్టు మాయాజాలంతో రికార్డుల మోత మోగిస్తున్నాడు. గత సీజన్ వరకూ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడుతూ వచ్చిన కుల్దీప్ యాదవ్.. ప్రస్తుత 2022 సీజన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతూ తనజట్టుకు అలవోక విజయాలు అందిస్తూ వారెవ్వా అనిపించుకొంటున్నాడు. గత ఎనిమిదిరౌండ్ల మ్యాచ్ ల్లో నాలుగుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడం ద్వారా మాస్టర్ […]

8 మ్యాచ్ ల్లో 4 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు.. ఢిల్లీ స్పిన్నర్ అసాధారణ రికార్డు
X

టాటా ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ లో ఢిల్లీ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మణికట్టు మాయాజాలంతో రికార్డుల మోత మోగిస్తున్నాడు. గత సీజన్ వరకూ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడుతూ వచ్చిన కుల్దీప్ యాదవ్.. ప్రస్తుత 2022 సీజన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతూ తనజట్టుకు అలవోక విజయాలు అందిస్తూ వారెవ్వా అనిపించుకొంటున్నాడు. గత ఎనిమిదిరౌండ్ల మ్యాచ్ ల్లో నాలుగుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడం ద్వారా మాస్టర్ సచిన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాల సరసన నిలిచాడు.

పడిలేచిన కెరటం కుల్దీప్..
గత రెండుసీజన్లుగా వైఫల్యాల ఊబిలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరైన కుల్దీప్ యాదవ్.. టీమిండియాలో మాత్రమే కాదు.. తన ఫ్రాంచైజీ కోల్ కతా తుదిజట్టులోనూ స్థానం కోల్పోయాడు. వికెట్లు రాకపోగా..భారీగా పరుగులు సమర్పించుకొంటూ తన అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసుకొన్నాడు. అయితే.. ప్రస్తుత సీజన్ మెగావేలంలో 2 కోట్ల రూపాయల ధరకు కుల్దీప్ ను సొంతం చేసుకోడం ద్వారా ఢిల్లీ ఫ్రాంచైజీ గొప్పసాహసమే చేసింది. మరోవైపు.. ఢిల్లీ యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా..ఇప్పటి వరకూ ఆడిన ఎనిమిదిరౌండ్ల మ్యాచ్ ల్లో కుల్దీప్ 17 వికెట్లు పడగొట్టి..తన స్పిన్ జాదూ ఏపాటిదో మరోసారి చాటిచెప్పాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో ముగిసిన 8వ రౌండ్ పోరులో కుల్దీప్ అత్యుత్తమస్థాయిలో రాణించాడు. కేవలం 15 పరుగులకే బాబా ఇంద్రజీత్, సునీల్ నరైన్, శ్రేయస్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్ ల వికెట్లు పడగొట్టి..ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు. ప్రస్తుత సీజన్ లీగ్ లో భాగంగా కోల్ కతా ప్రత్యర్థిగా ఆడిన రెండు అంచెల మ్యాచ్ ల్లోనూ కుల్దీప్ నాలుగేసి వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకోడం విశేషం. ప్రస్తుత సీజన్లో ఢిల్లీ ఇప్పటి వరకూ ఆడిన ఎనిమిదిరౌండ్లలో కుల్దీప్ నాలుగుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడం ద్వారా గతంలో ఇదే ఘనత సాధించిన దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల సరసన చోటు సంపాదించాడు.

విరాట్ కోహ్లీ టాప్..
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకొన్న ఘనత విరాట్ కోహ్లీకి మాత్రమే దక్కుతుంది. 2016 సీజన్ లీగ్ లో విరాట్ ఐదుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ప్రస్తుత సీజన్ 14 రౌండ్ల మ్యాచ్ ల్లో ఇప్పటి వరకూ ఆడిన 8 రౌండ్లలోనే నాలుగు అవార్డులు గెలుచుకొన్న కుల్దీప్ మిగిలిన ఆరురౌండ్లలో మరో రెండు అవార్డులు నెగ్గితే విరాట్ రికార్డును అధిగమించగలుగుతాడు. 2021 సీజన్లో చెన్నై ఓపెనర్ రుతురాజ్ గయక్వాడ్ 4, 2016 సీజన్లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగు, 2013 సీజన్లో లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా 4, 2010 సీజన్లో మాస్టర్ సచిన్ టెండూల్కర్ 4, 2008 ప్రారంభ సీజన్ లీగ్ లో యూసుఫ్ పఠాన్ 4 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచిన మొనగాళ్లుగా రికార్డుల్లో చేరారు. మిగిలిన ఆరురౌండ్లలో కుల్దీప్ యాదవ్ మరెన్ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించగలడన్నది తెలుసుకోవాలంటే.. మరికొద్దిరోజులపాటు వేచిచూడక తప్పదు.

First Published:  30 April 2022 5:49 AM IST
Next Story