ఫోర్త్ వేవ్ పై తెలంగాణ ఆరోగ్య శాఖ కీలక ప్రకటన..
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో కూడా కేసుల పెరుగుదల స్వల్పంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని పేర్కొన్న వైద్య శాఖ అధికారులు, కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటివరకు వ్యాక్సిన్ లు వేయించుకోనివారు వెంటనే టీకాలు తీసుకోవాలని తెలిపారు. జూన్ రెండోవారంలో కేసుల […]
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో కూడా కేసుల పెరుగుదల స్వల్పంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని పేర్కొన్న వైద్య శాఖ అధికారులు, కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటివరకు వ్యాక్సిన్ లు వేయించుకోనివారు వెంటనే టీకాలు తీసుకోవాలని తెలిపారు.
జూన్ రెండోవారంలో కేసుల ఉధృతి..
తెలంగాణలో జూన్ రెండో వారం నాటికి కరోనా కేసుల ఉధృతి పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకు దాదాపు 40 కేసులు నమోదవుతున్నాయి. వీటి సంఖ్య జూన్ రెండో వారం నాటికి రోజుకు 2,500 నుంచి 3వేల వరకు పెరుగుతుందని అంచనా. ఈ దశను ఫోర్త్ వేవ్ అని కూడా భావించవచ్చని చెబుతున్నారు. అయితే వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు తక్కువేనని భరోసా ఇస్తున్నారు అధికారులు.
దేశవ్యాప్తంగా 17వేలు దాటిన యాక్టివ్ కేసులు..
మరోవైపు దేశంలో మళ్లీ కరోనా వ్యాప్తి పెరుగుతోంది. వరుసగా రెండో రోజు కొత్త కేసులు 3వేల పైనే నమోదయ్యాయి. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య ఇటీవల కాలంలో తొలిసారిగా 17వేలు దాటింది. గడచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 4,73,635 మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా అందులో 3,377 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.71శాతానికి చేరింది. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది.
టీకాల పంపిణీపై దృష్టి..
కొవిడ్ కేసుల పెరుగుదలతో టీకా పంపిణీపై మరోసారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టిసారించింది. గురువారం ఒక్కరోజే 22.8 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు భారత్ లో 188.65కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు.