సైనికుడి పెళ్లి.. అతడి కోసం ఏకంగా హెలికాప్టర్ పంపిన ఆర్మీ
బార్డర్లో పని చేసే సైనికులకు సెలవులు ఇవ్వడమే చాలా కష్టం. అలాంటిది ఒక జవాను కోసం ఆర్మీ హెలికాప్టర్ పంపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒడిషాకు రెందిన నారాయణ బెహర్ అనే వ్యక్తి ఆర్మీలో పని చేస్తున్నాడు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాను అయిన నారాయణ ప్రస్తుతం హిమాలయ మంచుపర్వతాల్లోని మచిల్ సెక్టర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇది ఇండియన్ ఆర్మీ పోస్టుల్లోనే అత్యధిక ఎత్తులో, చుట్టూ దట్టమైన మంచుతో కప్పబడిన పోస్టు. అక్కడకు వెళ్లిన సైనికులు […]
బార్డర్లో పని చేసే సైనికులకు సెలవులు ఇవ్వడమే చాలా కష్టం. అలాంటిది ఒక జవాను కోసం ఆర్మీ హెలికాప్టర్ పంపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒడిషాకు రెందిన నారాయణ బెహర్ అనే వ్యక్తి ఆర్మీలో పని చేస్తున్నాడు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాను అయిన నారాయణ ప్రస్తుతం హిమాలయ మంచుపర్వతాల్లోని మచిల్ సెక్టర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇది ఇండియన్ ఆర్మీ పోస్టుల్లోనే అత్యధిక ఎత్తులో, చుట్టూ దట్టమైన మంచుతో కప్పబడిన పోస్టు. అక్కడకు వెళ్లిన సైనికులు నెలల తరబడి విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. ఎప్పుడైనా మైదాన ప్రాంతానికి రావాలంటే ఒక లింక్ రోడ్ ఉంటుంది. కానీ, ఇటీవల ఆ రోడ్డు మంచు కారణంగా బ్లాక్ అయ్యింది.
నారాయణకు మే 2న తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయించారు. డేట్ దగ్గర పడుతున్నా అతడి నుంచి ఎలాంటి రిప్లై లేదు. ఎందుకంటే పర్వతాల పైన పని చేసే వాళ్లకు డైరెక్ట్‌గా కమ్యునికేషన్ ఉండదు. రోజు రోజుకూ అతను వస్తాడో రాడో అనే కంగారు ఎక్కువయ్యింది. దీంతో అతని తల్లిదండ్రులు యూనిట్ కమాండర్లకు కాల్ చేశారు. నారాయణకు పెళ్లి కుదిరిందని, అతడిని వెంటనే ఇంటికి పంపాలని రిక్వెస్ట్ చేశారు. అయితే, నారాయణ ప్రస్తుతం చాలా దూరంగా, హై ఆల్టిట్యూడ్ పోస్టులో ఉన్నాడని.. అతడు రావడానికి ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. అయితే పై అధికారులకు నివేదిస్తామని వాళ్లకు భరోసా ఇచ్చారు.
నారాయణ పెళ్లి విషయాన్ని యూనిట్ కమాండర్లు బీఎస్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (కాశ్మీర్ ఫ్రంటియర్) రాజా బాబు సింగ్‌కు చేరవేశారు. ఆయన వెంటనే హెలీకాప్టర్ పంపి నారాయణను తీసుకొని రావాలని ఆదేశించారు. వెంటనే ఆర్మీకి చెందిన చీతా హెలీకాఫ్టర్ మంచు కొండల మీదుగా ప్రయాణించి నారాయణను క్షేమంగా శ్రీనగర్‌కు తీసుకొని వచ్చింది. అక్కడి నుంచి రైళ్లో 2500 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామానికి పయనమయ్యాడు. ఆర్మీ అధికారులు చేసిన పనికి ఇప్పుడు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై రాజా బాబూ సింగ్ మాట్లాడుతూ.. సైనికుల సంక్షేమం, వాళ్ల ప్రాధాన్యతలే మాకు ముఖ్యమని అన్నారు.