అది పేపర్ లీక్ కాదు.. కుట్ర మాత్రమే -విద్యాశాఖ మంత్రి బొత్స..
ఏపీలో టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల పేపర్లు లీకయ్యాయని వస్తున్న వార్తలపై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పరీక్ష పేపర్ లీక్ అనే వార్తలు అవాస్తవం అని అన్నారాయన. పరీక్ష జరగడానికి ముందే పేపర్ బయటకు వస్తే దాన్ని లీక్ గా భావిస్తారని, ప్రస్తుతం ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షల విషయంలో అలాంటి ఘటన జరగలేదని, పరీక్ష ప్రారంభమైన తర్వాత కొంతమంది ఉద్దేశ పూర్వకంగా ఈ కుట్రకు తెరతీశారని మండిపడ్డారు. ఏపీలో పదో తరగతి […]
ఏపీలో టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల పేపర్లు లీకయ్యాయని వస్తున్న వార్తలపై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పరీక్ష పేపర్ లీక్ అనే వార్తలు అవాస్తవం అని అన్నారాయన. పరీక్ష జరగడానికి ముందే పేపర్ బయటకు వస్తే దాన్ని లీక్ గా భావిస్తారని, ప్రస్తుతం ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షల విషయంలో అలాంటి ఘటన జరగలేదని, పరీక్ష ప్రారంభమైన తర్వాత కొంతమంది ఉద్దేశ పూర్వకంగా ఈ కుట్రకు తెరతీశారని మండిపడ్డారు.
ఏపీలో పదో తరగతి పరీక్షల తొలిరోజే పేపర్లు లీకయ్యాయనే ప్రచారం జరిగింది. రెండో రోజు జరిగిన హిందీ పేపర్ కూడా వాట్సప్ లో చక్కర్లు కొట్టడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. కరోనా వల్ల రెండేళ్లుగా ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షలు నిర్వహించలేదు. ఇప్పుడు పరిస్థితులు శాంతించడంతో పబ్లిక్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ దశలో పేపర్ లీక్ అనే వార్తలతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
తెలుగు పరీక్ష పేపర్ లీక్ కి సంబంధించి ఇప్పటికే 12మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాల జిల్లా అంకిరెడ్డి పల్లి హైస్కూల్ నుంచి పేపర్ బయటకు వచ్చినట్టు గుర్తించారు. బుధవారం తెలుగు పరీక్ష ప్రారంభమైన తర్వాత రాజేశ్ అనే వ్యక్తి తన మొబైల్ తో పేపర్ ని ఫొటోలు తీసి బయట ఉన్న ఉపాధ్యాయులకు పంపించారు. అయితే ఇదంతా పరీక్ష ప్రారంభమైన తర్వాత జరిగింది కాబట్టి.. పేపర్ లీకేజీ అంటూ వార్తలు రాయొద్దని చెబుతున్నారు మంత్రి బొత్స.
పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యే సమయం ఉదయం 9.30 గంటలు అని, దానికంటే ముందుగా పేపర్ బయటకు వస్తేనే అది లీక్ గా భావించాలని చెప్పారు బొత్స. నంద్యాల జిల్లాలో పేపర్ లీక్ అంటూ కొంతమంది కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు. కుట్రకు కారకులైనవారిపై, టీచర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించేందుకు కుట్రలు పన్ని ఉంటారని మంత్రి ఆరోపించారు. ఈ దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదని అన్నారు. విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేయడం మంచిది కాదని, దీని వెనక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు వస్తున్న పుకార్లను ప్రజలెవరూ నమ్మొద్దని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురి కావొద్దని, మిగతా పరీక్షలన్నీ యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు.