ఈ సారి కుప్పంలో మనం గెలవలేమా? 175కి 175 సీట్లు రావా? : సీఎం వైఎస్ జగన్
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మనం కుప్పం సీటును గెలవలేమా? అక్కడ మున్సిపాలిటీతో సహా స్థానిక సంస్థల ఎన్నికలను కూడా గెలిచాం కదా.. ఇక అసెంబ్లీ సీటు కూడా గెలుద్దాం అని ఏపీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఆయన బుధవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే మనం మూడేళ్లలో […]
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మనం కుప్పం సీటును గెలవలేమా? అక్కడ మున్సిపాలిటీతో సహా స్థానిక సంస్థల ఎన్నికలను కూడా గెలిచాం కదా.. ఇక అసెంబ్లీ సీటు కూడా గెలుద్దాం అని ఏపీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఆయన బుధవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే మనం మూడేళ్లలో రూ. 1.37 లక్షల కోట్లను ప్రజల ఖాతాల్లో వేశాము. రాబోయే రెండేళ్లలో మరో రూ. 1.10 లక్ష కోట్లు వేయబోతున్నాము.. అలాంటప్పుడు గతంలో వచ్చిన 151 సీట్లు తగ్గకూడదు. అసలు 151 కాదు మనకు 175కి 175 ఎందుకు రాకూడదు అని ఆయన అన్నారు.
”వచ్చే నెల నుంచి మనం గేర్ మార్చి మరింత ఉత్సాహంగా పని చేయాలి. ఎన్నికలకు మరో రెండేళ్లు ఉందని అలసత్వం వద్దు. కళ్లు మూసుకొని తెరిచే సరికి రెండేళ్లు పూర్తయిపోతుంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం నెరవేర్చాం. మిగిలినవి కూడా పూర్తి చేసుకొని మనం ఎన్నికలకు వెళ్తాం. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ప్రత్యక్ష నగదు బదిలీ చేశాం. మనం చేసిన పనులను ప్రజల్లోకి వెళ్లి చెప్పుకోవాలి. అందుకే మే 10 నుంచి ‘గడప గడపకు’ కార్యక్రమాన్ని చేపట్టాలి. ఇది అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమమే కాబట్టి అందరూ ఉత్సాహంగా పని చేయాలి” అని ఆయన చెప్పారు.
ఇప్పటి వరకు చూస్తే కొంత మంది ఎమ్మెల్యేలే ముందంజలో ఉన్నారు. చాలా మంది మధ్యస్థాయిలో.. కొంత మంది తక్కువ స్థాయిలో పని చేస్తున్నారు. ‘గడప గడపకు’ ప్రోగ్రామ్ ను ఉపయోగించుకొని గ్రాఫ్ తక్కువగా ఉన్న ఎమ్మెల్యేలు ప్రజల్లో తమ గ్రాఫ్ పెంచుకోవాలని జగన్ సూచించారు. మనకు పార్టీనే బాస్.. అదే సుప్రీమ్.. జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల మాటే ఫైనల్. వాళ్ల మాటే వినాలి. మంత్రులైనా, పార్టీ రీజినల్ సమన్వయకర్తలైనా జిల్లా అధ్యక్షుల మాట పాటించాలిందే అని జగన్ ఆదేశించారు.
పార్టీ ప్రచారానికి, ప్రభుత్వ కార్యక్రమాల గురించి తెలియజెప్పడానికి సాక్షి టీవీ, పత్రికను వాడుకోవాలని జగన్ చెప్పారు. జూలై 8న పార్టీ ప్లీనరీ నిర్వహించనున్నామని.. అప్పటిలోగా జిల్లా అధ్యక్షులు జిల్లా కమిటీల నుంచి గ్రామస్థాయి కమిటీల నియామకాలను సమన్వయం చేసుకోవాలని చెప్పారు. సామాజిక మాద్యమ కార్యకర్తలను భారీ ఎత్తున అందుబాటులోకి తీసుకొని రావాలని ఆయన చెప్పారు. ఇక పథకాల అమలులో ప్రాతినిధ్య లేదని, క్షేత్రస్థాయిలో చేసిన పనులకు బిల్లులు రాలేదని పార్టీ శ్రేణులంతా నిరుత్సాహంగా ఉన్నట్లు పలువురు నేతలు జగన్ దృష్టికి తీసుకొని వెళ్లారు. అయితే ఎమ్మెల్యేలకు రూ. 2 కోట్ల చొప్పున ఇచ్చిన నిధులనువాడుకోవాలని, మే 10లోగా నిధుల పంచాయితీలను సెటిల్ చేస్తామని అన్నారు. ఉపాధి హామీ బిల్లులు కూడా క్లియర్ చేస్తామని జగన్ చెప్పారు.