Telugu Global
NEWS

సేఫ్ జోన్ లో కోడి.. బలహీనంగా గుడ్డు..

కోడి, కోడి గుడ్డు.. డిమాండ్ పెరిగితే.. ఈ రెండిటి రేట్లు ఒకేసారి భారీగా పెరుగుతాయి. ఒకవేళ డిమాండ్ తగ్గితే కోళ్ల ఫారంల యజమానులంతా ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో కాస్త మార్పు కనిపిస్తోంది. కేవలం మాంసం కోసం కోళ్లను పెంచే బ్రాయిలర్ ఫారంల యజమానులు, రేటు స్థిరంగా ఉండటంతో సేఫ్ జోన్ లోనే ఉన్నారు. క్రమక్రమంగా ఇటీవల పెరిగిన రేటు ఎండాకాలం మొదలవుతున్నా ఏమాత్రం తగ్గలేదు. స్కిన్ లెస్ చికెన్ ధర ఏపీలో రూ.270 […]

సేఫ్ జోన్ లో కోడి.. బలహీనంగా గుడ్డు..
X

కోడి, కోడి గుడ్డు.. డిమాండ్ పెరిగితే.. ఈ రెండిటి రేట్లు ఒకేసారి భారీగా పెరుగుతాయి. ఒకవేళ డిమాండ్ తగ్గితే కోళ్ల ఫారంల యజమానులంతా ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో కాస్త మార్పు కనిపిస్తోంది. కేవలం మాంసం కోసం కోళ్లను పెంచే బ్రాయిలర్ ఫారంల యజమానులు, రేటు స్థిరంగా ఉండటంతో సేఫ్ జోన్ లోనే ఉన్నారు. క్రమక్రమంగా ఇటీవల పెరిగిన రేటు ఎండాకాలం మొదలవుతున్నా ఏమాత్రం తగ్గలేదు. స్కిన్ లెస్ చికెన్ ధర ఏపీలో రూ.270 నుంచి రూ.300 మధ్యలో ఉంది. అదే సమయంలో గుడ్లకోసం కోళ్లను పెంచే లేయర్ కోళ్ల ఫారంల యజమానులు మాత్రం ఇబ్బందుల్లో పడ్డారు. గతంలో ఎప్పుడూ లేనంతగా కోడి గుడ్డు రేటు పడిపోతోంది. ప్రస్తుతం 100 కోడిగుడ్ల ధర హోల్ సేల్ మార్కెట్ లో 327 రూపాయలుగా ఉంది. ఈనెల 10వతేదీన రేటు 423 రూపాయలుగా ఉండగా.. తాజాగా అది 327కు పడిపోవడంతో వ్యాపారులు డీలా పడ్డారు. అదే సమయంలో కోళ్ల ఫారంల యజమానులు కూడా నష్టాల్లో మునిగిపోతున్నారు.

కారణం ఏంటి..?
ఏపీలో రోజుకి 5కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. వీటిలో 2కోట్లు స్థానిక మార్కెట్లో అమ్ముడుపోతాయి. మిగిలిన 3కోట్ల గుడ్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ సహా ఈశాన్య రాష్ట్రాలకు ఏపీలోని కోళ్ల ఫారంల నుంచి గుడ్లు ఎగుమతి అవుతుంటాయి. ఇప్పుడా ఎగుమతులు ఆగిపోయాయి. ఇటీవల కాలంలో ఆయా రాష్ట్రాల్లో కూడా స్థానికంగా పౌల్ట్రీ ఫారంల ఏర్పాటు పెరిగింది. దీంతో గుడ్ల దిగుమతులను స్థానిక పౌల్ట్రీ ఫారంల యజమానులు అడ్డుకుంటున్నారు. ఇటీవల 180 కోడిగుడ్ల లారీలు ఇలా రాష్ట్రాల సరిహద్దుల్లో నిలిచిపోయాయి. చర్చలతో సమస్య పరిష్కారం అయినా.. రానురాను ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో ఏపీలో డిమాండ్ కి మించి సప్లై పెరిగింది. రేటు అమాంతం పడిపోయింది.

మూతబడుతున్న పౌల్ట్రీ ఫారంలు..
కోడిగుడ్డు రేటు హోల్ సేల్ మార్కెట్ లో రూ.5 రూపాయలు అయితేనే పౌల్ట్రీ ఫారంల యజమానులకు గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు మూడున్నర రూపాయికంటే తక్కువగా ఉండటంతో రేటు గిట్టుబాటు అయ్యే అవకాశం లేదు. దీంతో ఏపీలో రెండు వారాల వ్యవధిలోనే 50వరకు కోళ్ల ఫారాలు మూతపడ్డాయి. మరోవైపు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో.. ఉత్పత్తి తగ్గిపోతోంది, గుడ్ల వినియోగం కూడా తక్కువ అవుతోంది. దీంతో రేట్లు భారీగా పతనం అవుతున్నాయి.

First Published:  27 April 2022 4:42 AM IST
Next Story