Telugu Global
National

షారుఖ్ తనయుడి డ్రగ్స్ కేసులో సాక్షి మృతి..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబాయి క్రూజ్ షిప్ డ్రగ్స్‌ కేసులో కీలక సాక్షి ప్రభాకర్ సెయిల్‌ మృతి చెందారు. ప్రభాకర్ గుండెపోటుతో మృతి చెందినట్టు అతడి తరఫు న్యాయవాది తుషార్ ఖండారే వెల్లడించారు. ముంబైలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ప్రభాకర్ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలారని, ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఆయన మరణించారని చెప్పారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఎవరీ ప్రభాకర్ సెయిల్..? గతేడాది అక్టోబర్ లో […]

షారుఖ్ తనయుడి డ్రగ్స్ కేసులో సాక్షి మృతి..
X

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబాయి క్రూజ్ షిప్ డ్రగ్స్‌ కేసులో కీలక సాక్షి ప్రభాకర్ సెయిల్‌ మృతి చెందారు. ప్రభాకర్ గుండెపోటుతో మృతి చెందినట్టు అతడి తరఫు న్యాయవాది తుషార్ ఖండారే వెల్లడించారు. ముంబైలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ప్రభాకర్ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలారని, ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఆయన మరణించారని చెప్పారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని క్లారిటీ ఇచ్చారు.

ఎవరీ ప్రభాకర్ సెయిల్..?
గతేడాది అక్టోబర్ లో ముంబై శివారులో ఓ నౌకలో జరుగుతున్న రేవ్ పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ పట్టుబడటంతో ఈ కేసు సంచలనంగా మారింది. కేసు విచారణ కూడా అంతే సంచలనం అయింది. విచారణ అధికారి సమీర్ వాంఖడేపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆతర్వాత ఆర్యన్ ఖాన్ కి బెయిల్ రావడం, కేసు విచారణ కొనసాగడం తెలిసిందే. అయితే ఇప్పుడీ కేసుకి సంబంధించి కీలక సాక్షి సెయిల్ మరణంతో కలకలం రేగింది. రేవ్ పార్టీపై దాడి చేసిన సమయంలో ఎన్సీబీ అధికారులు, ఆర్యన్ సహా మరికొందరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసవి ని అప్పట్లో సాక్షిగా పరిగణించింది ఎన్సీబీ. ఆ డిటెక్టివ్ కి బాడీగార్డే ప్రభాకర్ సెయిల్. ప్రభాకర్ ని కూడా సాక్షిగా పేర్కొంది ఎన్సీబీ.

ప్రాణహాని ఉందన్నాడు.. అంతలోనే..
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సినిమా స్టైల్ లో అనేక మలుపులున్నాయి. సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ ఎన్సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసులో గోసవి-ఎన్సీబీ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని, ముడుపులు చేతులు మారాయని ఆరోపించారు సెయిల్. వాంఖడే నుంచి తనకు ప్రాణాపాయం ఉందని పేర్కొంటూ అందుకు సంబంధించిన ఆధారాలతో కోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ తర్వాత మరో సాక్షి శామ్ డిసౌజా.. సరికొత్త కథనాన్ని బయటపెట్టారు. గోసవితోపాటు, సెయిల్ కూడా డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు. ఈ ముడుపుల వ్యవహారం కూడా విచారణలో ఉంది. అయితే అంతలోనే ప్రభాకర్ సెయిల్ మృతి చెందడం సంచలనంగా మారింది.

First Published:  2 April 2022 7:37 AM GMT
Next Story