Telugu Global
Cinema & Entertainment

మిషన్ ఇంపాజిబుల్ మూవీ రివ్యూ

తారాగణం : తాప్సీ, హర్ష్ రోషన్, భాను ప్రకాశన్, జయతీర్థ, రవీందర్ విజయ్, హరీష్ పేరడి, రిషబ్ శెట్టి తదితరులు సినిమాటోగ్రఫీ : దీపక్ యెరగరా సంగీతం : మార్క్ కె రాబిన్ ఎడిటర్ : రవితేజ గిరిజాల ఆర్ట్ డైరెక్టర్ : నాగేంద్ర బ్యానర్ : మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి రచన, దర్శకత్వం : స్వరూప్ RSJ రేటింగ్ : 2/5 నటీనటులకే కాదు, దర్శకులకు కూడా సెకెండ్ […]

మిషన్ ఇంపాజిబుల్ మూవీ రివ్యూ
X

తారాగణం : తాప్సీ, హర్ష్ రోషన్, భాను ప్రకాశన్, జయతీర్థ, రవీందర్ విజయ్, హరీష్ పేరడి, రిషబ్ శెట్టి తదితరులు
సినిమాటోగ్రఫీ : దీపక్ యెరగరా
సంగీతం : మార్క్ కె రాబిన్
ఎడిటర్ : రవితేజ గిరిజాల
ఆర్ట్ డైరెక్టర్ : నాగేంద్ర
బ్యానర్ : మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
రచన, దర్శకత్వం : స్వరూప్ RSJ
రేటింగ్ : 2/5

నటీనటులకే కాదు, దర్శకులకు కూడా సెకెండ్ మూవీ సిండ్రోమ్ ఉన్నట్టుంది. ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హిట్ కొట్టిన స్వరూప్, ఇప్పుడు తన రెండో సినిమాతో నిరాశపరిచాడు. ఈరోజు రిలీజైన మిషన్ ఇంపాజిబుల్ మూవీ, స్వరూప్ లో మైనస్ పాయింట్స్ ను బయటపెట్టింది. బాధాకరమైన విషయం ఏంటంటే.. మొదటి సినిమా చూసిన తర్వాత అతడికి ఏది బలమని ప్రేక్షకులు భావించారో, రెండో సినిమాలో అదే అతడి బలహీనతగా మారింది. ఆ ఎలిమెంట్ పేరు ‘లాజిక్’.

తెరపై మేజిక్ జరుగుతున్నప్పుడు లాజిక్ తో పనిలేదంటుంటారు సినిమా జనాలు. కానీ అలా మేజిక్ జరిగే సందర్భాలు చాలా అరుదు. లాజిక్ చూపించాల్సిందే. ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ విషయంలో ఇదే కోణంలో సక్సెస్ అయ్యాడు స్వరూప్. మంచి సన్నివేశాలు, ట్విస్టులు, వాటికి లింకులు, థ్రిల్ ఎలిమెంట్స్ అన్నీ సెట్ చేసుకున్నాడు. ఎక్కడా లాజిక్ మిస్సవ్వలేదు. స్క్రిప్ట్ అంత పకడ్బందీగా ఉన్నప్పుడు మేజిక్ తో పనిలేదు. సినిమా సక్సెస్ అయింది. అదే మిషన్ ఇంపాజిబుల్ సినిమా విషయానికొచ్చేసరికి మాత్రం లాజిక్ పూర్తిగా మిస్సయింది. మేజిక్ అనేది అస్సలు వర్కవుట్ కాలేదు.

తాప్సిని ప్రచారంలో బాగా ఉపయోగించుకున్నారు కానీ, ఇది తాప్సి సినిమా కాదు. ముగ్గురు చిన్న పిల్లల స్టోరీ. వడమాలపల్లి అనే చిన్న గ్రామంలో ఉండే ముగ్గురు పిల్లలు రఘుపతి , రాఘవ , రాజారాం ఎలాగైనా డబ్బు సంపాదించాలని, ఊరిలో పేరు తెచ్చుకోవాలని అనుకుంటారు. అలా డబ్బు , పేరు రెండింటిని సాధించడం కోసం వేట మొదలుపెట్టి, టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీంని పట్టుకుంటే ప్రైజ్ మనీ ఇస్తారని తెలుసుకొని ఎన్నో తిప్పలు పడి కొంత డబ్బు కూడబెట్టుకొని ముంబై బయలుదేరుతారు.

అలా ముంబై బయలుదేరిన ఈ చిచ్చర పిడుగులు అనుకోకుండా బెంగుళూరు చేరుకుంటారు. అక్కడ జర్నలిస్ట్ శైలజ(తాప్సీ) సహాయంతో ఎవరూ చేయలేని ఓ సాహసం చేసి చైల్డ్ ట్రాఫికింగ్ చేసే రామ్ శెట్టిని పోలీసులకు పట్టించే ప్రయత్నం చేస్తారు. మరి ఫైనల్ గా రామ్ శెట్టి ని పోలీసులకు అప్పగించి రఘుపతి-రాఘవ-రాజారామ్ తమ ఊరికి గొప్ప పేరు తీసుకొచ్చారా లేదా అనేది మిగతా కథ.

ఈ సినిమా కథ మొత్తం ముగ్గురు పిల్లల చుట్టూ తిరుగుతుంది. తాప్సి సెకండాఫ్ లోనే ఎక్కువగా కనిపిస్తుంది. అలా అని ఆమెది పవర్ ఫుల్ పాత్ర కూడా కాదు. ఇంకా చెప్పాలంటే వెనక ఉంటూ కథ మొత్తం నడిపించే పాత్ర మాత్రమే. ఇందులో ఆమెది మెయిన్ లీడ్ అనే కంటే, సహాయ పాత్ర అంటే కరెక్ట్. అలా ఉంది తాప్సి రోల్.

ఇక కథ విషయానికొస్తే, తను అనుకున్న పాయింట్ ను అత్యంత సహజంగా బాగా ల్యాండ్ చేశాడు దర్శకుడు. పిల్లలు తమ అమాయకత్వంలో తప్పులు చేయడం, వాళ్లను తాప్సి నడిపించడం లాంటివి బాగానే ఉన్నాయి. అయితే సెకండాఫ్ కు వచ్చేసరికి స్క్రీన్ ప్లే తేలిపోయింది. పవర్ ఫుల్ విలనిజం చూపించడంలో దర్శకుడు తేలిపోయాడు. పైగా పిల్లలకు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ, భయాన్ని ప్రేక్షకుడిలో రేకెత్తించలేకపోయాడు. ఇక్కడే సినిమా ఫలితం డిసైడ్ అయిపోయింది.

ఇవన్నీ ఒకెత్తయితే, సినిమాలో లాజిక్కులు మరో ఎత్తు. అడుగడుగునా సినిమాలో లాజిక్కులు మిస్సయ్యాడు దర్శకుడు. ఈ విషయంలో చాలామంది సినిమాటిక్ ఫ్రీడమ్ తీసుకుంటారు. లాజిక్కులు పట్టించుకుంటే కథ ముందుకెళ్లదు కూడా. కానీ మిషన్ ఇంపాజిబుల్ విషయంలో దర్శకుడు మినిమం లాజిక్కుల్ని కూడా పట్టించుకోకుండా గాలికొదిలేశాడు. సినిమాకు అదొక పెద్ద మైనస్.

పిల్లలు ముగ్గురూ (హర్ష్ రోషన్, భాను ప్రకాశన్, జయతీర్థ) బాగా నటించారు. అమాయకంగా కనిపిస్తూనే వాళ్లు చేసే పనులు ఆకట్టుకునేలా ఉన్నాయి. తాప్సి పాత్ర అండర్ డాగ్ లా కనిపిస్తుంది తప్ప, అంత పవర్ ఫుల్ అనిపించదు. అయితే ఉన్నంతలో తన అనుభవాన్ని రంగరించి పాత్రను రక్తికట్టించింది. విలన్ గా హరీష్ పేరడీ జస్ట్ ఓకే అనిపించాడు. సుహాస్, సత్యం రాజేశ్, శరణ్య, హర్షవర్థన్ లాంటి వాళ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు. వాళ్ల స్క్రీన్ పరిథి కూడా చాలా తక్కువ.

టెక్నికల్ గా కూడా సినిమాలో ఏమంత మెరుపులు కనిపించవు. రాబిన్ సంగీతం ఓకే. దీపక కెమెరావర్క్ బాగుంది. సినిమాను తక్కువ రన్ టైమ్ లో ముగించిన ఎడిటర్ రవితేజను మెచ్చుకోవాలి. ఇక దర్శకుడు స్వరూప్ తన రెండో సినిమాకు కూడా తనకు ఎంతో ఇష్టమైన అలవాటైన జానర్ నే ఎంచుకున్నప్పటికీ, అతడి రైటింగ్ మరింత పదునుగా ఉంటే బాగుండేది. నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రొడక్షన్ వాల్యూస్ బాగాలేవు. ఈ కథకు ఎంత ఖర్చుపెట్టాలో, అంతకంటే తక్కువ పెట్టడంతో ప్రొడక్షన్ వాల్యూస్ పూర్ గా ఉన్నాయి.

ఓవరాల్ గా మిషన్ ఇంపాజిబుల్ సినిమాను కొన్ని కామెడీ సీన్లు, రెండు ట్విస్టుల కోసం మాత్రమే చూడొచ్చు. లాజిక్కులు పట్టించుకోకపోతే మాత్రం, చిన్న పిల్లలతో చేసిన ఈ సినిమాను ఓసారి చూడొచ్చు.

First Published:  1 April 2022 3:12 PM IST
Next Story