Telugu Global
National

అధికారం దక్కకపోయినా పెత్తనం కోసం ఆరాటం..

ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో నాలుగు చోట్ల బీజేపీ గెలిచినా.. పంజాబ్ లో మాత్రం చిత్తు చిత్తుగా ఓడిపోయింది. అక్కడ ఆ పార్టీ నాయకులకు గెలుపుపై ఆశలు లేకపోయినా, కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన మాజీ సీఎం అమరీందర్ సింగ్ తో ఎంతో కొంత మేలు జరుగుతుందని ఆశించారు, అదీ కుదర్లేదు. దీంతో పంజాబ్ విషయంలో కేంద్రం ఇప్పుడో కొత్త వివాదానికి తెరతీసింది. పంజాబ్ రాజధానిగా ఉన్న చండీఘడ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ […]

అధికారం దక్కకపోయినా పెత్తనం కోసం ఆరాటం..
X

ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో నాలుగు చోట్ల బీజేపీ గెలిచినా.. పంజాబ్ లో మాత్రం చిత్తు చిత్తుగా ఓడిపోయింది. అక్కడ ఆ పార్టీ నాయకులకు గెలుపుపై ఆశలు లేకపోయినా, కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన మాజీ సీఎం అమరీందర్ సింగ్ తో ఎంతో కొంత మేలు జరుగుతుందని ఆశించారు, అదీ కుదర్లేదు. దీంతో పంజాబ్ విషయంలో కేంద్రం ఇప్పుడో కొత్త వివాదానికి తెరతీసింది. పంజాబ్ రాజధానిగా ఉన్న చండీఘడ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సర్వీసు నిబంధనలు వర్తిస్తాయంటూ అమిత్ షా ప్రకటించడం కలకలం రేపింది. ఉద్యోగులు రాష్ట్ర సర్వీసులోకే వస్తారంటూ సీఎం భగవంత్ మన్ చెబుతున్నారు. రాష్ట్రాలపై పెత్తనం కోసం కేంద్రం ఉబలాటపడుతోందని, దీనిపై దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.

ఎందుకీ గొడవ..?
పంజాబ్, హర్యానాకు ఉమ్మడి రాజధాని చండీఘడ్. అంతే కాదు, అది కేంద్రపాలిత ప్రాంతం కూడా. అయితే చండీఘడ్ లోని పంజాబ్ ఉద్యోగులకు ఆ రాష్ట్ర సర్వీసు నిబంధనలు వర్తిస్తాయి. కానీ ఇప్పుడు దీన్ని మార్చేందుకు కేంద్రం ముందడుగు వేసింది. కేవలం ఎన్నికల్లో ఓడిపోవడం వల్లే, ఇలా తమ పెత్తనం నిరూపించుకోడానికి కేంద్రం వేసిన ఎత్తుగడ ఇదని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శిస్తోంది. కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తే ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెరుగుతుందని, జీతాలు పెరుగుతాయని, ఉద్యోగుల పిల్లలకు ఎడ్యుకేషన్ అలవెన్స్ లభిస్తుందని.. అందుకే వారికి కేంద్ర సర్వీస్ రూల్స్ అప్లై చేస్తున్నామని అమిత్ షా చెబుతున్నారు. అయితే పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం ఏర్పడిన కొన్నిరోజులకే ఇలా నిబంధనలు మార్చడాన్ని ఆ పార్టీ తీవ్రంగా తప్పుబడుతోంది. ఉద్యోగులపై ఇప్పుడే ప్రేమ పుట్టుకొచ్చిందా అంటూ విమర్శిస్తోంది. పంజాబ్ లో ఆప్ పాగా వేయడాన్ని జీర్ణించుకోలేకే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడుతున్నారు సీఎం భగవంత్ మన్.

ఢిల్లీ తరహాలో యుద్ధం..
ఢిల్లీలో కూడా ఇలాంటి సమస్యే ఉంది. ఢిల్లీ రాష్ట్రం అయినా, రాజధాని ప్రాంతంపై కేంద్రానికి విశేష అధికారాలుంటాయి. ఢిల్లీలోని పోలీస్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వానికి జవాబుదారీ ఎంతమాత్రం కాదు. పోలీసు వ్యవస్థ అంతా కేంద్ర ప్రభుత్వం నియమించిన లెఫ్ట్ నెంట్ గవర్నరు చేతుల్లో ఉంటుంది. ఈ నిబంధన మార్చాలంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం ఏళ్లతరబడి పోరాటం చేస్తోంది. కానీ కేంద్రం తన పెత్తనాన్ని మాత్రం వదులుకోలేదు. తాజాగా చండీఘడ్ లో కూడా ఉద్యోగులపై ఇదే తరహా పెత్తనాన్ని కోరుకుంటోంది బీజేపీ.

First Published:  29 March 2022 2:52 AM IST
Next Story