ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ రివ్యూ
నటీనటులు: శర్వానంద్, రష్మిక, వెన్నెల కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్ రావత్, ఝాన్సీ తదితరులు మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్ బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మాత: సుధాకర్ చెరుకూరి రచన-దర్శకత్వం: తిరుమల కిషోర్ నిడివి: 141 నిమిషాలు రేటింగ్: 2.5/5 సాధారణంగా టీవీల్లో వచ్చే సీరియల్స్ లో ఓ కామన్ పాయింట్ ఉంటుంది. కథతో సంబంధం లేకుండా స్క్రీన్ నిండుగా మహిళలు కనిపిస్తారు. వాళ్లు వేసుకునే చీరలు, ధరించే నగలు, […]
నటీనటులు: శర్వానంద్, రష్మిక, వెన్నెల కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్ రావత్, ఝాన్సీ తదితరులు
మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
రచన-దర్శకత్వం: తిరుమల కిషోర్
నిడివి: 141 నిమిషాలు
రేటింగ్: 2.5/5
సాధారణంగా టీవీల్లో వచ్చే సీరియల్స్ లో ఓ కామన్ పాయింట్ ఉంటుంది. కథతో సంబంధం లేకుండా స్క్రీన్ నిండుగా మహిళలు కనిపిస్తారు. వాళ్లు వేసుకునే చీరలు, ధరించే నగలు, ఫాలో అయ్యే ఫ్యాషన్స్ ను మహిళా ప్రేక్షకులు గమనిస్తుంటారు. సీరియల్స్ వైపు మహిళల్ని ఎట్రాక్ట్ చేయడానికి వేసే ఎత్తుగడ ఇది. మరి సినిమాలో కూడా ఇవే కనిపిస్తే ఎలా ఉంటుంది? బహుశా దర్శకుడు కిషోర్ తిరుమలకు ఇదే ఐడియా వచ్చి ఉంటుంది. వెంటనే ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ కథ అల్లేశాడు. రాధిక, ఖుష్బూ, ఊర్వశి, ఝాన్సీ లాంటి సీనియర్ మహిళల్ని పెట్టేశాడు. వాళ్లందరి మధ్యలో శర్వానంద్ ను నిలబెట్టాడు. ఇలా చేయడం తప్పు లేదు. కథకు తగ్గట్టు దర్శకుడు ఏదైనా చేయొచ్చు. కానీ టేకింగ్ లో కూడా సీరియల్ ను తలపించాడు. సరిగ్గా ఇక్కడే బెడిసికొట్టింది వ్యవహారం. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నవ్వులు తక్కువ, సాగదీతలు ఎక్కువ అయిపోయాయి.
ముందుగా కథ గురించి క్లుప్తంగా చెప్పుకుందాం.. ఆ తర్వాత విశ్లేషణలోకి వెళ్దాం. చిన్నతనం నుండి ఉమ్మడి కుటుంబంలో ఆడవాళ్ళ మధ్య పెరిగిన చిరంజీవి (శర్వానంద్) కి ఆడవాళ్లంటే ఎంతో గౌరవం. కానీ చిరుకి పెళ్లి చేయడంలో మాత్రం ఆ ఇంటి ఆడవాళ్ళు ఎన్నో అడ్డంకులు పెడుతూ వచ్చిన సంబంధాలన్నీ రిజెక్ట్ చేస్తుంటారు. ఇక లాభం లేదని భావించిన చిరు, తనే ఎలాగోలా ఫ్యామిలీ నుంచి తప్పించుకొని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా పెళ్లి పీటలెక్కే రోజు కోసం ఎదురుచూస్తున్న చిరు, అనుకోకుండా ఆద్య(రష్మిక) ప్రేమలో పడతాడు. చిరు క్యారెక్టర్ కి ఇంప్రెస్ అయిన ఆద్య కూడా అతడ్ని ప్రేమిస్తుంది. కానీ ఇక్కడో సమస్య. ఆద్య అమ్మ చాటు బిడ్డ. ఆద్య తల్లి వకుళ (ఖుష్బు) ఒప్పుకుంటేనే ఈ పెళ్లి అవుతుంది. వకుళకు పెళ్లంటేనే నచ్చదు. దీంతో రంగంలోకి దిగిన చిరు.. వకుళను ఎలా ఒప్పించాడు.. ఆద్యను ఎలా భార్యగా చేసుకున్నాడు అనేది మిగతా కథ.
ఇలా పూర్తిగా ఆడవాళ్ల మధ్య తీసిన ఈ కథలో తొలి 10 నిమిషాల్ని పాత్రల పరిచయానికి వాడేసుకున్నాడు దర్శకుడు. అయితే ఆ తర్వాత కూడా కథలో వేగం పెరగదు. నెమ్మదిగా నెరేషన్ సాగుతుంది. సినిమా ఆరంభంలోనే సుకుమార్ వాయిస్ ఓవర్ తో ఇంతమంది ఆడవాళ్ళ మధ్య ఒక్క మగాడు అంటూ చెప్పించి ఫన్నీగా సినిమాను స్టార్ట్ చేసిన దర్శకుడు.. ఆ తర్వాత మెలోడ్రామాతో అక్కడక్కడా బ్రేకులు వేస్తూ కథని ముందుకు నడిపించాడు. దాంతో చాలా చోట్ల సినిమా సీరియల్ లా అనిపిస్తుంది. మధ్యలో వెన్నెల కిషోర్ కామెడీ, సత్య డైలాగ్ కామెడీ రిలీఫ్ ఇచ్చినప్పటికీ.. వాళ్లను కూడా పూర్తి స్థాయిలో వాడుకోలేదు. ఇక ఇంటర్వెల్ లో వచ్చే సీన్ బాగుంది. అక్కడ ఊర్వశి డబ్బా కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. ఆ సన్నివేశం ఆడవాళ్ళ మనస్తత్వానికి అద్దం పట్టేలా ఉంది.
ఇంటర్వెల్ తర్వాత కూడా సినిమా సీరియల్ నే తలపిస్తుంది. నెమ్మదిగా సాగే సన్నివేశాలు, ఎలాంటి కొత్తదనం లేని నెరేషన్ సహనానికి పరీక్ష పెడుతుంది. హీరో-హీరోయిన్ ప్రేమించుకోవడం, హీరోయిన్ ఫ్యామిలీని ఒప్పించడానికి హీరో వాళ్ళ దగ్గరికి వెళ్లి డ్రామాలు ఆడడం, మధ్యలో ఓ ప్రేమ జంటను హీరో కలపడం, క్లైమాక్స్ లో హీరోయిన్ ఫ్యామిలీ అంగీకరించడం.. ఇలా పాతికేళ్ల నుంచి చూస్తున్న కుటుంబ కథా చిత్రాల ఫార్మాట్ ను పక్కాగా ఫాలో అయిపోయింది ఈ సినిమా.
సినిమాలో ఎలాంటి మెరుపులు ఉండవు, ఎలాంటి ట్విస్టులు, టర్నులు కనిపించవు. ఫ్లాట్ గా అలా వెళ్లిపోతుందంటే. మధ్యలో వచ్చే 2-3 కామెడీ సీన్లు మాత్రం రిలీఫ్ అనిపిస్తాయి. ఇలాంటి కథలో పెర్ఫార్మెన్సులు గురించి కూడా మాట్లాడుకోవడం అనవసరం అనిపిస్తుంది. శర్వానంద్ ఎందుకో చాలా డల్ గా నటించాడు. అతడి బాడీ లాంగ్వేజ్ కూడా బాగాలేదు. ఇక ఆడవాళ్లంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. రాధికకు మంచి సీన్లు పడలేదు. ఖుష్బూకు 2-3 మాత్రమే పడ్డాయి. ఝాన్సీ మెరిసింది. రష్మిక రొటీన్ అనిపించుకుంది.
టెక్నికల్ గా సినిమా బాగుంది. దేవిశ్రీప్రసాద్ ఉన్నంతలో సినిమాను లేపడానికి విశ్వప్రయత్నం చేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. డైరక్టర్ కిషోక్ తిరుమల దర్శకుడిగా ఓకే కానీ స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు.
ఓవరాల్ గా.. శర్వానంద్-రష్మిక ఆన్ స్క్రీన్ లుక్, ఖుష్బూ నటన, వెన్నెల కిషోర్, సత్య డైలాగ్ కామెడీ, కొన్ని ఫ్యామిలీ సెంటిమెంట్ సన్నివేశాల కోసం ఈ సినిమాను చూడొచ్చు.