Telugu Global
National

కరోనా కాలంలోనూ కేంద్రం వసూళ్లు తగ్గేదేలే..

కరోనా కష్టకాలంలో సహజంగా వాణిజ్య కార్యకలాపాలు తగ్గిపోతాయి, వ్యాపారాలు కళ తప్పుతాయి. వస్తువులకు, వస్తు సేవలకు డిమాండ్ తగ్గిపోతుంది. కానీ భారత్ లో మాత్రం థర్డ్ వేవ్ ప్రభావం ఉన్న సమయంలో కూడా కేంద్రం జీఎస్టీ వసూళ్లు బ్రహ్మాండంగా సాగాయి. ఏకంగా కొత్త రికార్డుల దిశగా జీఎస్టీ వసూళ్లు పరుగులెత్తడం విశేషం. ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు లక్షా 33వేల 26 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. కరోనా కాలానికంటే ముందున్న వసూళ్లతో పోల్చి చూస్తే ఇది ఏకంగా […]

కరోనా కాలంలోనూ కేంద్రం వసూళ్లు తగ్గేదేలే..
X

కరోనా కష్టకాలంలో సహజంగా వాణిజ్య కార్యకలాపాలు తగ్గిపోతాయి, వ్యాపారాలు కళ తప్పుతాయి. వస్తువులకు, వస్తు సేవలకు డిమాండ్ తగ్గిపోతుంది. కానీ భారత్ లో మాత్రం థర్డ్ వేవ్ ప్రభావం ఉన్న సమయంలో కూడా కేంద్రం జీఎస్టీ వసూళ్లు బ్రహ్మాండంగా సాగాయి. ఏకంగా కొత్త రికార్డుల దిశగా జీఎస్టీ వసూళ్లు పరుగులెత్తడం విశేషం. ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు లక్షా 33వేల 26 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. కరోనా కాలానికంటే ముందున్న వసూళ్లతో పోల్చి చూస్తే ఇది ఏకంగా 26శాతం అధికం. అంటే థర్డ్ వేవ్ భయాలున్నా కూడా కేంద్రానికి పన్ను వసూళ్లలో ఫిబ్రవరి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.

2017 జులైలో జీఎస్టీ వసూళ్లు మొదలు పెట్టిన తర్వాత ఇప్పటి వరకూ కేవలం ఐదుసార్లు మాత్రమే 1.3 లక్షల కోట్ల రూపాయల టార్గెట్ రీచ్ అయ్యారు అధికారులు. అందులో 2022-ఫిబ్రవరి కూడా ఒకటి. ఆటో మొబైల్ రంగం నుంచి అత్యథిక పన్ను వసూలైనట్టు కేంద్రం తెలిపింది. జీఎస్టీ రికవరీ సెస్ రూపంలో ఏకంగా 10వేల కోట్ల రూపాయలు వసూలయ్యాయి. ఇప్పటి వరకూ ఇదే గరిష్టం.

సహజంగా రోజులు తక్కువగా ఉండే ఫిబ్రవరి నెలలో పన్ను వసూళ్లు గరిష్టంగా ఉంటాయని కేంద్రం కూడా అంచనా వేయలేదు. కానీ ఈ ఏడాది మాత్రం ఫిబ్రవరిలో అత్యథిక వసూళ్లు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. కొన్ని రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షిక కర్ఫ్యూ ఉన్న సమయంలో కూడా ఈ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు ఉండటం విశేషం. గతేడాది ఫిబ్రవరితో పోల్చి చూస్తే ఈ ఏడాది పన్ను వసూళ్లు 18శాతం ఎగబాకాయి.

First Published:  2 March 2022 2:19 AM IST
Next Story