ఉక్రెయిన్ టు ఢిల్లీ వయా రొమేనియా..
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత విద్యార్థులు తిరిగి ఇక్కడికి వచ్చేందుకు మార్గం సుగమం అయింది. వీరిని రెండు ప్రత్యేక విమానాల్లో తిరిగి భారత్ కు చేర్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అయితే ఉక్రెయిన్ గగనతలంపై నిషేధాజ్ఞలు ఉండటంతో.. దాని సరిహద్దు దేశమైన రొమేనియా నుంచి విద్యార్థులను తరలించే ప్రయత్నం చేస్తోంది భారత ప్రభుత్వం. రోడ్డు మార్గం ద్వారా ఉక్రెయిన్ లో ఉన్న వారంతా సరిహద్దు దేశాలకు చేరుకుంటే వారిని అక్కడినుంచి సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తామని హామీ ఇచ్చింది. […]
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత విద్యార్థులు తిరిగి ఇక్కడికి వచ్చేందుకు మార్గం సుగమం అయింది. వీరిని రెండు ప్రత్యేక విమానాల్లో తిరిగి భారత్ కు చేర్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అయితే ఉక్రెయిన్ గగనతలంపై నిషేధాజ్ఞలు ఉండటంతో.. దాని సరిహద్దు దేశమైన రొమేనియా నుంచి విద్యార్థులను తరలించే ప్రయత్నం చేస్తోంది భారత ప్రభుత్వం. రోడ్డు మార్గం ద్వారా ఉక్రెయిన్ లో ఉన్న వారంతా సరిహద్దు దేశాలకు చేరుకుంటే వారిని అక్కడినుంచి సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తామని హామీ ఇచ్చింది. ఈమేరకు తొలి దశలో 470మంది విద్యార్థులు రొమేనియా రాజధాని బుకారెస్ట్ కి పయనమయ్యారు. సుచేవా చెక్ పోస్ట్ దాటి వీరంతా రొమేనియాలోకి ప్రవేశించారు. బుకారెస్ట్ నుంచి ఢిల్లీకి రెండు విమానాల ద్వారా వీరిని తరలిస్తారు.
సరిహద్దులే కీలకం..
ఉక్రెయిన్ నుంచి భారత్ కు తిరిగి రావాలనుకుంటున్నవారు హంగరి, రొమేనియా సరిహద్దులకు చేరుకోవాలని ఉక్రెయిన్ లోని భారత ఎంబసీ సూచన ప్రకారం విద్యార్థులంతా బయలుదేరారు. ఇలా సరిహద్దులు దాటి వచ్చేటప్పుడు తమ వాహనాలపై భారతీయ జెండా చిత్రాలను ప్రముఖంగా కనిపించేలా అతికించుకొని రావాలని ఎంబసీ అధికారులు పేర్కొన్నారు. అత్యవసర ఖర్చుల కోసం అమెరికా డాలర్లు దగ్గర ఉంచుకోవాలని, వీలైతే కొవిడ్ టీకా సర్టిఫికెట్లు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ప్రస్తుతం తరలింపు బృందాలు హంగరీ సరిహద్దు చోప్-జహోనీ, రొమేనియన్ సరిహద్దు పొరుబ్నే-సిరెత్ వద్ద ఉన్నాయి. ఈ సరిహద్దు ప్రాంతాలకు దగ్గరగా ఉన్న భారత పౌరులు.. విదేశాంగశాఖతో సమన్వయం చేసుకొని బయలుదేరుతున్నారు.
రష్యా భరోసా ఇస్తున్నా..
ఉక్రెయిన్ లోని భారతీయులు భయపడాల్సిన అవసరం లేదని, ఎక్కడివారు అక్కడే ప్రశాంతంగా ఉండాలని రష్యా పేర్కొంది. ప్రస్తుత సైనిక దాడితో పౌరులకు ఎలాంటి ముప్పూ లేదని తెలిపింది. అయితే రష్యా మాటలు విని ఉక్రెయిన్ లో ఉండేందుకు భారత్ సహా ఇతర దేశాల పౌరులెవరూ సిద్ధంగా లేరు. ముఖ్యంగా భారత విద్యార్థులు బతుకు జీవుడా అంటూ తిరిగి వచ్చేస్తున్నారు. పరిస్థితులు దిగజారిపోతున్న సమయంలో సుమారు 4 వేల మంది భారతీయులు వెనక్కి వచ్చేశారు. మరో 16వేలమంది అక్కడే చిక్కుకుపోయినట్టు సమాచారం. వారందర్నీ వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఉక్రెయిన్ గగనతలాన్ని మూసేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం ఆమధ్య వెనక్కి వచ్చేసింది. దీంతో ప్రత్యామ్నాయంగా రొమేనియాకి విమానాలను నడుపుతోంది భారత్. సరిహద్దులు దాటినవారిని సురక్షితంగా స్వదేశానికి తరలిస్తోంది.