ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్.. ఎందుకంటే..?
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించగానే.. అక్కడ చదువుకునే భారత విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. అయితే అంతలోనే విమాన ప్రయాణాలను నిలిపివేస్తున్నట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. దీంతో ఎక్కడివారక్కడ చిక్కుకుపోయారు. దాదాపు 20వేలమంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయినట్టు అంచనా. అసలు ఇంతమంది విద్యార్థులు ఉక్రెయిన్ కి ఎందుకెళ్లారు..? సహజంగా అమెరికా, లేదా లండన్ కి ఉన్నత చదువులకోసం వెళ్లే విద్యార్థులు ప్రత్యేకంగా ఎంబీబీఎస్ కోసం ఉక్రెయిన్ బాట […]
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించగానే.. అక్కడ చదువుకునే భారత విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. అయితే అంతలోనే విమాన ప్రయాణాలను నిలిపివేస్తున్నట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. దీంతో ఎక్కడివారక్కడ చిక్కుకుపోయారు. దాదాపు 20వేలమంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయినట్టు అంచనా. అసలు ఇంతమంది విద్యార్థులు ఉక్రెయిన్ కి ఎందుకెళ్లారు..? సహజంగా అమెరికా, లేదా లండన్ కి ఉన్నత చదువులకోసం వెళ్లే విద్యార్థులు ప్రత్యేకంగా ఎంబీబీఎస్ కోసం ఉక్రెయిన్ బాట ఎందుకు పట్టారు..?
భారత్ లో ప్రభుత్వ విభాగంలో ఉన్న మెడికల్ సీట్లు తక్కువ. అందులోనూ మెడికల్ ఎంట్రన్స్ కి భారీ కాంపిటీషన్ ఉంటుంది. ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీటు కావాలంటే ఫీజు, హాస్టల్ ఖర్చులు దాదాపు 75లక్షల రూపాయల వరకు అవుతాయి. సుమారుగా కోటి రూపాయలు పెట్టందే భారత్ లో ప్రైవేట్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తవదన్నమాట. అదే ఉక్రెయిన్ లో ఆరేళ్ల ఎంబీబీఎస్ చదవాలంటే కోర్సు ఫీజు కేవలం 16.5లక్షల రూపాయలు. అక్కడ వైద్య విద్య పూర్తి చేస్తే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. దీంతో ఇటీవల కాలంలో ఉక్రెయిన్ విద్యాసంస్థలకు చెందిన ఏజెన్సీలు భారత్ లో ఎక్కవయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 20వేలమంది ఎంబీబీఎస్ సహా ఇతర ఉన్నత చదువులకోసం భారత్ విడిచి ఉక్రెయిన్ వెళ్లినట్టు తెలుస్తోంది.
మార్గం అదేనా..?
భారత్ నుంచి నేరుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ కి ప్రయాణాలు ఆగిపోయాయి. విమానాలు లేకపోవడంతో భారత విద్యార్థులు అల్లాడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాలనుంచి కూడా ఎక్కువమంది అక్కడ చదువుకోడానికి వెళ్లారు. వారంతా తల్లిదండ్రులకు వీడియో కాల్స్ చేస్తూ ఎప్పటికప్పుడు తమ క్షేమ సమాచారాలు చెబుతున్నారు. కొంతమంది బంకర్లలో తలదాచుకున్నారన్న వార్తలు ఇక్కడ అయినవారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు, పౌరుల తరలింపుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతానికి హంగరీ, రొమేనియా మార్గాల ద్వారా వారిని స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మార్గాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఉక్రెయిన్ లో ఈ రెండు దేశాల సరిహద్దులకు దగ్గరగా ఉండేవారు చెక్ పాయింట్ల వద్దకు రావాలని సూచించింది.
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల చర్యలు..
ఉక్రెయిన్ లోని తెలుగు విద్యార్థుల తరలింపుపై ఏపీ సీఎం జగన్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ల పర్యవేక్షణలో జిల్లా కేంద్రాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరితో టచ్ లో ఉండాలన్నారు. వారి యోగక్షేమాలు తెలుసుకొని భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు సీఎం జగన్ ఫోన్ చేశారు. ఉక్రెయిన్ లో తెలుగు విద్యార్థులు చిక్కుకున్నట్టు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వారిని సురక్షితంగా రాష్ట్రానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థుల పరిస్థితిపై తెలంగాణ మంత్రి కేటీఆర్.. విదేశాంగ మంత్రి జైశంకర్ కు ట్వీట్ చేశారు. రాష్ట్ర విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరారు. విద్యార్థుల కోసం కేంద్రం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన ఖర్చులను భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.