Telugu Global
International

యుద్ధం మొదలైంది.. ఉక్రెయిన్ లో బాంబుల మోత..

ఉక్రెయిన్ లో బాంబుల మోత మొదలైంది. రష్యా సైనిక బలగాలు రంగంలోకి దిగాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ పై పేలుళ్లు జరిపాయి. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రష్యా బలగాలు ఆక్రమించాయి. మరో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌ ని కూడా రష్యా బలగాలు టార్గెట్ చేశాయి. మరియ పోల్, దినిప్రో, క్రమటోర్ప్క్, ఒడెస్సా, జపోర్గియా, బోరిస్పిల్ నగరాలు బాంబల దాడికి గురయ్యాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఉక్రెయిన్‌ లోని కీలక నగరాలపై […]

యుద్ధం మొదలైంది.. ఉక్రెయిన్ లో బాంబుల మోత..
X

ఉక్రెయిన్ లో బాంబుల మోత మొదలైంది. రష్యా సైనిక బలగాలు రంగంలోకి దిగాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ పై పేలుళ్లు జరిపాయి. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రష్యా బలగాలు ఆక్రమించాయి. మరో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌ ని కూడా రష్యా బలగాలు టార్గెట్ చేశాయి. మరియ పోల్, దినిప్రో, క్రమటోర్ప్క్, ఒడెస్సా, జపోర్గియా, బోరిస్పిల్ నగరాలు బాంబల దాడికి గురయ్యాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఉక్రెయిన్‌ లోని కీలక నగరాలపై దాడులు చేస్తున్నట్లు వచ్చిన వార్తలను రష్యా ఖండించింది. ప్రజలు, జనావాసాలు తమ లక్ష్యం కాదని, కేవలం సైనిక స్థావరాలు, ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్‌ ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నామని తెలిపింది.

ఉక్రెయిన్ విషయంలో సంయమనం పాటించాలన్న ప్రపంచ దేశాల విజ్ఞప్తిని రష్యా పట్టించుకోలేదని నాటో ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వతంత్ర దేశమైన ఉక్రెయిన్ పై యుద్ధం చేయడం అంటే, ఆ దేశ సార్వభౌమాధికారంపై దాడి చేయడమేనని పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా పుతిన్ వ్యవహరిస్తున్నారని ఆక్షేపించింది. యుద్ధంతో సాధారణ పౌరుల జీవితాలు ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేసింది. రష్యాపై చర్యకు నాటో సభ్య దేశాల నిర్ణయం ప్రకారం స్పందిస్తామని తెలిపింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య పరిణామాలపై ఐక్యరాజ్యసమితి అత్యవసరంగా సమావేశమైంది. జీ7 దేశాల భేటీ కూడా జరగాల్సి ఉంది.

రష్యా బాధ్యత వహించాల్సిందే..
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలు కావడంపై అమెరికా తీవ్రంగా స్పందించింది. ఉక్రెయిన్‌ నుంచి ఎటువంటి కవ్వింపు చర్యలు లేకపోయినా.. అకారణంగా రష్యా సైనికులు దాడులు చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆరోపించారు. ప్రపంచ మొత్తం ఉక్రెయిన్‌ ప్రజల కోసం ప్రార్థిస్తోందని పేర్కొన్నారు. ఓ వ్యూహం ప్రకారమే అధ్యక్షుడు పుతిన్‌ యద్ధాన్ని ప్రారంభించారని, ఇది తీవ్ర ప్రాణ నష్టానికి దారితీస్తుందని అన్నారు.

ఉక్రెయిన్ లో 350మంది తెలుగు విద్యార్థులు..
ఉక్రెయిన్ లో ఉన్నత చదువులకోసం వెళ్లిన తెలుగు విద్యార్థులు 350మంది చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. ఇటీవల భారతీయులను తీసుకొచ్చేందుకు ఎయిరిండియా విమానం వెళ్లగా.. ఉక్రెయిన్ ఎయిర్‌ స్పేస్ మూసేయడంతో విమానం ఖాళీగా తిరిగొచ్చేసింది. తమ వారి సమాచారం తెలియకపోవడంతో ఢిల్లీలోని ఉక్రెయిన్ ఎంబసీ దగ్గర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. తమ పిల్లలను ఎలాగైనా స్వదేశానికి ర‌ప్పించాల‌ని వారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరుతున్నారు.

First Published:  24 Feb 2022 9:00 AM IST
Next Story