ఆపరేషన్ సమంత.. దళితుల పెళ్లికి పోలీస్ రక్ష..
రాజస్థాన్ లోని మారుమూల ప్రాంతాల్లో కుల వివక్ష లాంటి సామాజిక రుగ్మతలు చాలానే ఉన్నాయి. తక్కువ కులంవారు ఫలానా పని చేయకూడదు, అవన్నీ అగ్రవర్ణాల హక్కులేనంటూ కొంతమంది బెదిరింపులకు దిగుతుంటారు. పెళ్లి సందర్భంగా జరిగే బారాత్ ఫంక్షన్లో పెళ్లి కొడుకు గుర్రం ఎక్కి పెళ్లి కూతురు ఇంటికి వెళ్లడం ఆనవాయితీ. ఇప్పటి వరకూ ఈ సంప్రదాయం అగ్రవర్ణాల పెళ్లిళ్లలోనే కనిపించేది. ఇటీవల కాలంలో ఇలాంటి సంప్రదాయాల్ని అందరూ సొంతం చేసుకుంటున్నారు. కానీ దళితులు గుర్రం ఎక్కడం రాజస్థాన్ […]
రాజస్థాన్ లోని మారుమూల ప్రాంతాల్లో కుల వివక్ష లాంటి సామాజిక రుగ్మతలు చాలానే ఉన్నాయి. తక్కువ కులంవారు ఫలానా పని చేయకూడదు, అవన్నీ అగ్రవర్ణాల హక్కులేనంటూ కొంతమంది బెదిరింపులకు దిగుతుంటారు. పెళ్లి సందర్భంగా జరిగే బారాత్ ఫంక్షన్లో పెళ్లి కొడుకు గుర్రం ఎక్కి పెళ్లి కూతురు ఇంటికి వెళ్లడం ఆనవాయితీ. ఇప్పటి వరకూ ఈ సంప్రదాయం అగ్రవర్ణాల పెళ్లిళ్లలోనే కనిపించేది. ఇటీవల కాలంలో ఇలాంటి సంప్రదాయాల్ని అందరూ సొంతం చేసుకుంటున్నారు. కానీ దళితులు గుర్రం ఎక్కడం రాజస్థాన్ లోని చాలా ప్రాంతాల్లో నిషేధం. అగ్రవర్ణాలకు అది కంటగింపుగా ఉంటుంది. కనీసం పెళ్లిలో కూడా వారు గుర్రం ఎక్కితే ఒప్పుకోరు. అలాంటి ఊరేగింపుల్ని అడ్డుకోవడం, ఆయా కుటుంబాలను గ్రామంనుంచి బహిష్కరించడం, వారికి జరిమానా విధించడం, ఇలాంటి కట్టుబాట్లు అక్కడ ఉన్నాయి. పదుల సంఖ్యలో ఇలాంటి కేసులు పోలీస్ స్టేషన్ కి వచ్చాయి. దీంతో పోలీసులు ఆపరేషన్ సమంత అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అందరూ సమానమే అని నిరూపించేందుకు దళితుల వివాహానికి పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు.
జనవరితో మొదలు..
ఆపరేషన్ సమంతలో భాగంగా బారాత్ లో గుర్రం ఎక్కి వరుడు ఊరేగింపుగా కదిలే కార్యక్రమానికి పోలీసులు రక్షణగా ఉంటున్నారు. అగ్రవర్ణాల వారెవరూ దళితుల వివాహ కార్యక్రమాలను అడ్డుకోకుండా చూస్తున్నారు. దీనికోసం స్థానిక ఎస్సై, సర్పంచ్, గ్రామ పెద్దలు కమిటీగా ఏర్పడి ఈ కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. తాజాగా జైపూర్ లో ఇలా పోలీస్ ప్రొటెక్షన్ తో జరిగే బారాత్ ల సంఖ్య పెరిగింది.
పెళ్లిలో గుర్రం ఎక్కాలనుకునే దళిత వరుడు ఇకపై ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. పెళ్లి తర్వాత తమ కుటుంబాన్ని వెలి వేస్తారేమోనని, లేదా పెళ్లిలోనే బారాత్ ను అడ్డుకుంటారేమోనని ఆందోళన పడక్కర్లేదు. ఈమేరకు పోలీసులు వారికి రక్షణగా ఉంటున్నారు. జైపూర్ జిల్లాలోని బుండి గ్రామంలో ఇలా పోలీసుల రక్షణలో ఈ ఏడాది 20వరకు పెళ్లిళ్లు జరిగాయి.