కోర్టులో విచారణ.. విద్యాసంస్థల్లో ఆందోళన..
కర్నాటకలో హిజాబ్ వివాదం రోజు రోజుకీ పెరిగి పెద్దదైపోతోంది. ఓవైపు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చి దీనిపై విచారణ వేగవంతం చేసినా.. మరోవైపు విద్యాసంస్థల్లో ఆందోళనలు తగ్గడంలేదు. మతపరమైన దుస్తులు, గుర్తులు ధరించి విద్యాసంస్థల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించొద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చినా దీనిపై స్పష్టత రాలేదు. హిజాబ్ తో రావొద్దన్నందుకు ఏకంగా కొంతమంది ఉద్యోగాలకు రాజీనామాలు చేసిన ఉదాహరణలున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు రానివ్వకపోవడంతో స్టూడెంట్స్ ఇంటికి తిరిగి వెళ్లిపోతున్నారు. తాజాగా కర్నాటకలోని శివమొగ్గ జిల్లా శిరాల్కొప్పలో హిజాబ్ కు […]
కర్నాటకలో హిజాబ్ వివాదం రోజు రోజుకీ పెరిగి పెద్దదైపోతోంది. ఓవైపు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చి దీనిపై విచారణ వేగవంతం చేసినా.. మరోవైపు విద్యాసంస్థల్లో ఆందోళనలు తగ్గడంలేదు. మతపరమైన దుస్తులు, గుర్తులు ధరించి విద్యాసంస్థల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించొద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చినా దీనిపై స్పష్టత రాలేదు. హిజాబ్ తో రావొద్దన్నందుకు ఏకంగా కొంతమంది ఉద్యోగాలకు రాజీనామాలు చేసిన ఉదాహరణలున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు రానివ్వకపోవడంతో స్టూడెంట్స్ ఇంటికి తిరిగి వెళ్లిపోతున్నారు.
తాజాగా కర్నాటకలోని శివమొగ్గ జిల్లా శిరాల్కొప్పలో హిజాబ్ కు మద్దతుగా ఆందోళన నిర్వహించిన 58 మంది విద్యార్థినులను ప్రిన్సిపల్ సస్పెండ్ చేయడం కలకలం రేపింది. ఈ విషయం సంచలనంగా మారడంతో కలెక్టర్ రంగంలోగి దిగాల్సి వచ్చింది. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థినులను ప్రిన్సిపల్ కేవలం హెచ్చరించారని, సస్పెండ్ చేయలేదని వివరణ ఇచ్చుకున్నారు. రాష్ట్ర మంత్రులు కూడా ఈ విషయంలో ఇబ్బంది పడ్డారు. సస్పెన్షన్ వేటు వేయలేదని, నిరసనకారుల్ని కేవలం హెచ్చరించారని మాత్రమే చెప్పుకొచ్చారు.
దావణగెరె, బెళగావి, బళ్లారి, కొప్పళ, రామనగర జిల్లాల్లోనూ విద్యార్థినులు హిజాబ్ ధరించి కాలేజీలకు రావడంతో సిబ్బంది అడ్డుకున్నారు. బెళగావిలోని ఓ పారా మెడికల్ కాలేజీకి ఏకంగా సెలవులు ప్రకటించారు. హసన్ లోని ఓ కాలేజీలో యూనిఫాం తోపాటు ఇతర మతపరమైన దుస్తులతో వస్తే రూ.200 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ నోటీసు అంటించారు. కర్నాటకలో అన్ని మతాల పెద్దలు సమావేశమై మతసామరస్యం పాటించాలని పిలుపునిచ్చారు. అయితే ఇలాంటి శాంతి సందేశాలేవీ అక్కడ పనిచేయడంలేదు. హిజాబ్ కి మద్దతుగా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. హిజాబ్ తో పాటే తమను విద్యాసంస్థల్లోకి అనుమతించాలని కోరుతున్నారు. సిబ్బంది సానుకూలంగా ఉంటే సరి, లేకపోతే గొడవలు మొదలవుతున్నాయి. కర్నాటక వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. రాజకీయ పార్టీలు కూడా హిజాబ్ మంటల్లో చలికాచుకోవాలని చూస్తున్నాయి.