Telugu Global
National

ప్రైవేటు కంపెనీల్లో స్థానిక రిజర్వేషన్లు.. ప్రాంతీయ పార్టీల అవకాశాలు.. 

స్థానికంగా ఎక్కడికక్కడ ప్రజలను ఆకర్షించే ఎన్నికల హామీలివ్వాలంటే జాతీయ పార్టీలకు కొన్ని పరిమితులుంటాయి. కానీ ప్రాంతీయ పార్టీలు తమకి అనుకూలంగా ఎలాంటి హామీలైనా ఇవ్వొచ్చు, వాటిని ఉపయోగించుకుని గద్దెనెక్కొచ్చు. విచిత్రంగా హర్యానాలో జాతీయ పార్టీ బీజేపీ ప్రైవేటు కంపెనీల్లో స్థానిక రిజర్వేషన్ల పెంపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. ప్రైవేటు ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకే ఇవ్వాలంటూ ఇటీవల హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన చట్టాన్ని పంజాబ్ హైకోర్టు తోసిపుచ్చినా, సుప్రీంకోర్టు మాత్రం అనుకూలంగా తీర్పునిచ్చింది. పంజాబ్ […]

ప్రైవేటు కంపెనీల్లో స్థానిక రిజర్వేషన్లు.. ప్రాంతీయ పార్టీల అవకాశాలు.. 
X
స్థానికంగా ఎక్కడికక్కడ ప్రజలను ఆకర్షించే ఎన్నికల హామీలివ్వాలంటే జాతీయ పార్టీలకు కొన్ని పరిమితులుంటాయి. కానీ ప్రాంతీయ పార్టీలు తమకి అనుకూలంగా ఎలాంటి హామీలైనా ఇవ్వొచ్చు, వాటిని ఉపయోగించుకుని గద్దెనెక్కొచ్చు. విచిత్రంగా హర్యానాలో జాతీయ పార్టీ బీజేపీ ప్రైవేటు కంపెనీల్లో స్థానిక రిజర్వేషన్ల పెంపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. ప్రైవేటు ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకే ఇవ్వాలంటూ ఇటీవల హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన చట్టాన్ని పంజాబ్ హైకోర్టు తోసిపుచ్చినా, సుప్రీంకోర్టు మాత్రం అనుకూలంగా తీర్పునిచ్చింది. పంజాబ్ కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించి, హర్యానా ప్రభుత్వానికి ఊరటనిచ్చింది. నాలుగు వారాల్లోగా దీనిపై తిరిగి విచారణ జరపాలని పంజాబ్ హైకోర్టుకి సూచించింది. పంజాబ్ హైకోర్టు ఈ కేసు విచారణలో కేవలం 90 సెకన్లలోనే నిర్ణయం తీసేసుకుందంటూ.. హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది.
హర్యానాలో స్థానికులను ప్రసన్నం చేసుకోడానికి, అధికారాన్ని సుస్థిరం చేసుకోడానికి బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థల్లో కూడా 75శాతం రిజర్వేషన్ల చట్టాన్ని తెరపైకి తెచ్చింది. వాస్తవానికి ప్రభుత్వరంగ సంస్థల్లో కూడా రిజర్వేషన్లు 50శాతం మించకూడదని చట్టాలు చెబుతున్నా.. ప్రైవేటు రంగంపై అజమాయిషీ చేస్తూ హర్యానా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ నేతల్లో కూడా దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. తమ ప్రాంతంలో కూడా ఒత్తిడి పెరిగితే తట్టుకోలేమని వారు ఆందోళనలో ఉన్నారు. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలకు ఇది ఓ అవకాశంగా మారుతుంది. సుప్రీం సూచనలతో పంజాబ్ హైకోర్టు ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించి, రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం దేశవ్యాప్తంగా ఇలాంటి డిమాండ్లు పెరుగుతాయనడంలో ఆశ్చర్యం లేదు. అదే సమయంలో కంపెనీలు మాత్రం లబోదిబోమంటాయి.
సహజంగా ప్రైవేటు కంపెనీలు ప్రతిభకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. కంపెనీల ఏర్పాటు సమయంలో ఇచ్చిన హామీల మేరకు స్థానికులకు నాన్ టెక్నికల్ ఉద్యోగాలు ఇస్తుంటాయి. అలాంటిది మొత్తం ఉద్యోగాల్లో 75శాతం స్థానికత పేరుతో పక్కనపెడితే ఎలా.. అనేది ఆయా కంపెనీల ప్రశ్న. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 ద్వారా లభించే సమాన అవకాశాలకు అది విఘాతం కలిగిస్తోందని కంపెనీలు ఆరోపిస్తున్నాయి. హర్యానా ప్రభుత్వ నిర్ణయాన్ని హై కోర్టు ఆపేయడంతో సంబరపడ్డ సదరు కంపెనీల యాజమాన్యాలు, సుప్రీం కోర్టు సూచనతో డీలా పడ్డాయి. అయితే కేసులో తుది తీర్పు వచ్చే వరకు ప్రైవేటు యాజమాన్యాలపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకు రాకూడదనే మినహాయింపే కాస్త ఊరటనిస్తోంది. హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సంచలన చట్టం పూర్తి స్థాయిలో అమలులోకి వస్తే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి డిమాండ్లు పెరుగుతాయనడంలో ఆశ్చర్యం లేదు.
First Published:  17 Feb 2022 8:11 PM GMT
Next Story