Telugu Global
NEWS

భాష కాదు.. భావం చూడు.. కిషన్ రెడ్డికి హరీష్ కౌంటర్..

తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ప్రధాని నరేంద్రమోదీని కేసీఆర్ టార్గెట్ చేసిన తర్వాత తెలంగాణ బీజేపీ.. కేంద్ర నాయకత్వానికి మద్దతుగా రంగంలోకి దిగింది. కేసీఆర్ దిగజారుడు భాష మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అబద్దాలు మాట్లాడటం, భయపెట్టడం, రాజ్యాంగానికి విరుద్ధంగా హింసను ప్రేరేపించడం కేసీఆర్ కి అలవాటైందని మండిపడ్డారు. కేసీఆర్ మాట్లాడినట్టు పాకిస్తాన్ లో కూడా ఎవరూ మాట్లాడలేదని విమర్శించారు కిషన్ రెడ్డి. కేసీఆర్ నిజాం లాగా పాలన కొనసాగించాలనుకుంటున్నారని… తన […]

భాష కాదు.. భావం చూడు.. కిషన్ రెడ్డికి హరీష్ కౌంటర్..
X

తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ప్రధాని నరేంద్రమోదీని కేసీఆర్ టార్గెట్ చేసిన తర్వాత తెలంగాణ బీజేపీ.. కేంద్ర నాయకత్వానికి మద్దతుగా రంగంలోకి దిగింది. కేసీఆర్ దిగజారుడు భాష మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అబద్దాలు మాట్లాడటం, భయపెట్టడం, రాజ్యాంగానికి విరుద్ధంగా హింసను ప్రేరేపించడం కేసీఆర్ కి అలవాటైందని మండిపడ్డారు. కేసీఆర్ మాట్లాడినట్టు పాకిస్తాన్ లో కూడా ఎవరూ మాట్లాడలేదని విమర్శించారు కిషన్ రెడ్డి. కేసీఆర్ నిజాం లాగా పాలన కొనసాగించాలనుకుంటున్నారని… తన తర్వాత కొడుకు, తర్వాత ఆయన కొడుకు అధికారంలో ఉండాలని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

హరీష్ రావు కౌంటర్..
మోదీకి మద్దతుగా కిషన్ రెడ్డి రంగంలోకి దిగడంతో, కేసీఆర్ కి మద్దతుగా అల్లుడు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ భాషనే కేసీఆర్ ఉపయోగించారని, భాష గురించి మాట్లాడటం ఆపేసి ముందు కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు హరీష్ రావు. అమరవీరుల గురించి మాట్లాడే నైతికత కిషన్‌ రెడ్డికి లేదన్నారు.

కేసీఆర్ భిక్ష నీకు మంత్రి పదవి..
కేసీఆర్ భిక్షతోనే కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి వచ్చిందని గుర్తుంచుకోవాలన్నారు హరీష్ రావు. తెలంగాణ వచ్చింది కాబట్టే తెలంగాణ కోటాలో కిషన్‌ రెడ్డి మంత్రి అయ్యారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర మంత్రి అమిత్‌ షా బ్లాక్‌ డే గా అభివర్ణిస్తే.. అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కిషన్‌ రెడ్డి చూస్తూ ఊరుకున్నారని విమర్శించారు. తెలంగాణ అమరుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రధాని మోదీ మాట్లాడితే.. సమర్థించిన కిషన్‌ రెడ్డికి కేసీఆర్‌ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. హైదరాబాద్‌ కు వరదలు వస్తే కేంద్రం నుంచి నిధులు ఇప్పించలేకపోయారని, కనీసం ఒక్క ట్రిపుల్ ఐటీ కూడా ఇవ్వలేదన్నారు. పేదలను కొట్టి గద్దలకు పెట్టే పార్టీ బీజేపీ అని ఎద్దేవా చేశారు హరీష్ రావు. పేదరికంలో ఉన్న మైనార్టీల రిజర్వేషన్లు పెంచాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తే వాటిని ఆమోదించలేదన్నారు. పని చేసే టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే తప్ప బీజేపీ నేతలు చేసిన మంచిపని ఒక్కటీ లేదన్నారు. భాష బాగాలేదని సాకులు చూపించి తప్పించుకోకుండా సీఎం కేసీఆర్‌ అడిగిన ప్రశ్నలకు కిషన్‌ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు.

First Published:  16 Feb 2022 6:07 AM IST
Next Story