డీజే టిల్లూ మూవీ రివ్యూ
నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, నేహా శర్మ, ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రాశ్రీనివాస్ తదితరులు.. రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ మాటలు: సిద్దు జొన్నలగడ్డ సంగీతం: శ్రీచరణ్ పాకాల ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడిసింగు నిర్మాత: సూర్యదేవర నాగవంశి దర్శకత్వం: విమల్ కృష్ణ రేటింగ్ : 2.75/5 ఓ సినిమా వచ్చిందంటే చాలు అందులో లాజిక్కులు తెగ వెదికేస్తాం. దర్శకుడు లాజిక్ మిస్సయ్యాడంటూ లాజిక్కులు తీస్తాం. మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లాజిక్ లేకుండా ఓ సినిమా […]
నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, నేహా శర్మ, ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రాశ్రీనివాస్ తదితరులు..
రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ
మాటలు: సిద్దు జొన్నలగడ్డ
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడిసింగు
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
దర్శకత్వం: విమల్ కృష్ణ
రేటింగ్ : 2.75/5
ఓ సినిమా వచ్చిందంటే చాలు అందులో లాజిక్కులు తెగ వెదికేస్తాం. దర్శకుడు లాజిక్ మిస్సయ్యాడంటూ లాజిక్కులు తీస్తాం. మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లాజిక్ లేకుండా ఓ సినిమా వస్తే ఏమంటాం? దాన్ని బ్లాక్ బస్టర్ అంటాం. అవును.. హిలేరియస్ గా నవ్వులు పంచడానికి లాజిక్కులు అవసరం లేదు. మేజిక్ వర్కవుట్ అయితే చాలు. జాతిరత్నాలు విషయంలో అదే జరిగింది. డీటే టిల్లు విషయంలో అది మరోసారి రిపీటైంది.
హైదరాబాద్ మల్కాజ్ గిరి కి చెందిన బాలగంగాధర్ తిలక్ (సిద్దు జొన్నలగడ్డ) లోకల్ ఈవెంట్స్ లో DJ ప్లే చేస్తూ DJ టిల్లుగా చలామణి అవుతుంటాడు. ఈ క్రమంలో ఓ పబ్ సింగర్ రాధిక(నేహా శెట్టి)ని చూసి ప్రేమలో పడతాడు. రాధిక కూడా డీజే టిల్లుని ఇష్టపడుతుంది. అయితే అనుకోని విధంగా వీరిద్దరికి ఓ మర్డర్ కేసు చుట్టుకుంటుంది. దీంతో షాన్(ప్రిన్స్), పోలీస్ ఆఫీసర్ రావు(బ్రహ్మాజీ), చంద్రకాంత్ (నర్రా శ్రీనివాస్) ఇలా ముగ్గురు టిల్లు, రాధిక వెంటపడుతూ వాళ్లను పట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. వారి నుండి ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటారు టిల్లు, రాధిక. ఇంతకీ మర్డర్ అయిన వ్యక్తి ఎవరు? ఆ మర్డర్ కి వీరిద్దరికీ సంబంధం ఏమిటి? రాధిక, టిల్లుని ఎలా బుక్ చేసింది? ఆ ముగ్గురు వీళ్ళ వెంట ఎందుకు పడతారు? అనేది బ్యాలెన్స్ స్టోరీ.
కథగా చెప్పుకుంటే ఇదొక మర్డర్ మిస్టరీ. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. కావాల్సినంత సస్పెన్స్, ఎన్నో ట్విస్టులు పెట్టుకోవడానికి కావాల్సిన సరంజామా ఉన్న కథ. కానీ డిజే టిల్లూలో ఇవేం కనిపించవు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వులు మాత్రమే వినిపిస్తాయి. కథ ఎలా ఉన్నప్పటికీ దానికి కామెడీ కోటింగ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు హీరో కమ్ రచయిత సిద్ధు జొన్నలగడ్డ. ఆ కామెడీని పెర్ ఫెక్ట్ గా స్క్రీన్ పై ప్రజెంట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు దర్శకుడు విమల్ కృష్ణ. అంతే, లాజిక్కులు గాలికెగిరిపోయాయి, మేజిక్ మాత్రం పుష్కలంగా పండింది. ఫలితంగా డీజే టిల్లు థియేటర్లలో నవ్వులు పూయిస్తున్నాడు.
కరోనా ఒక వేవ్ ముగిసిన తర్వాతొచ్చిన జాతిరత్నాలు ఏ రేంజ్ లో నవ్వులు పూయించిందో అందరం చూశాం. థర్డ్ వేవ్ ముగిసిన దశలో వచ్చిన డీజే టిల్లు, దానికి రెట్టింపు నవ్వులు అందిస్తాడనంలో ఎలాంటి సందేహం లేదు. జాతిరత్నాల్లో కోర్టు సీన్, మర్డర్ సీన్ దగ్గర లాజిక్కులు పక్కనపెట్టి, కామెడీని నమ్ముకున్నారో.. సరిగ్గా అదే ఫార్మాట్ టిల్లు విషయంలో కూడా అమలైంది. సక్సెస్ కొట్టింది.
సిద్ధుకు ఓ మార్క్ ఉంది. కృష్ణ అండ్ హీజ్ లీల, మా వింత గాథ వినుమా లాంటి సినిమాల్లో సిద్ధు యాక్టింగ్ టాలెంట్ చూశాం. ఇప్పుడు తన నటనలో పీక్స్ చూపించాడు సిద్ధు. తను ఎలా నటించగలడో అలానే రాసుకున్నాడు. ఎలా రాసుకున్నాడో, సరిగ్గా అలానే నటించాడు. రచయితే నటుడైతే సీన్ ఎంత బాగా పండుతుందో టిల్లూను చూస్తే అర్థమౌతుంది.
ట్రయిలర్ లో చూపించిన సన్నివేశాలన్నీ ఫస్ట్ హాఫ్ లోనే వచ్చేస్తాయి. కాకపోతే మర్డర్ అనే కోణాన్ని మాత్రం ట్రయిలర్ చూపించలేదు. అలా చూపిస్తే, సినిమాపై ఆడియన్స్ లో ఉన్న అభిప్రాయం మారిపోతుందని తీసుకున్న ఆ నిర్ణయం సరిగ్గా పనిచేసింది. దీనికితోడు ఫన్ ఉంటుందంటూ చేసిన ప్రచారం, అందుకు తగ్గట్టే సినిమా ఉండడం టిల్లూకు కలిసొచ్చింది. లాజిక్స్ జోలికి పోకుండా, కథలో వచ్చే ఫన్ తో ప్రేక్షకుడికి ఫుల్ వినోదం అందించాడు సిద్ధు. సిద్దు డైలాగ్ కామెడీ, ఈ సినిమాని సూపర్ హిట్ రేంజ్ కి తీసుకెళ్ళింది. డీజే టిల్లు క్యారెక్టర్ డిజైనింగ్, కామెడీ, బోర్ కొట్టకుండా నడిచే స్క్రీన్ ప్లే ఈ సినిమాను నిలబెట్టేశాయి.
నటీనటుల విషయానికొస్తే.. సిద్ధూ వన్ మేన్ షో తర్వాత నేహా శెట్టి గురించి చెప్పుకోవాలి. గ్లామర్ షోతో పాటు యాక్టింగ్ తో ఆకట్టుకుంది నేహా. బ్రహ్మాజీ, నర్రా, ప్రిన్స్, ప్రగతి తమ పాత్రలకు న్యాయం చేశారు. హీరో తండ్రి పాత్రలో నటించిన మురళి కూడా తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. టెక్నికల్ గా కూడా సినిమా రిచ్ గా ఉంది. ఈ కథపై నమ్మకంతో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాను నిర్మించింది సితార ఎఁటర్ టైన్ మెంట్స్ సంస్థ. దీనికితోడు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రామ్ మిరియాల పాడుతూ కంపోజ్ చేసిన టైటిల్ సాంగ్ సూపర్ హిట్టయ్యాయి. సాయిప్రకాష్ కెమెరా వర్క్, నవీన్ నూలి ఎడిటింగ్ బాగున్నాయి. విమల్-సిద్ధు కలిసి రొటీన్ కథ రాసుకున్నారు. ఆ విషయం వాళ్లకు కూడా తెలుసు. కానీ ఆ కథకు వాళ్లిచ్చిన కామెడీ టచప్ మాత్రం అద్భుతం. దీనికితోడు సిద్ధు రాసుకున్న డైలాగ్స్ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి.
ఓవరాల్ గా డీజే టిల్లూ సినిమా ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో నవ్వుల విందు అందిస్తుంది. లాజిక్కులు పట్టించుకోకుండా చూస్తే ఈ సినిమా కడుపుబ్బా నవ్వించడం గ్యారెంటీ.