మధ్యంతర ఉత్తర్వులతో మౌనంగా ఉంటారా..?
హిజాబ్ వివాదంలో కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మతపరమైన దుస్తులు ధరించి విద్యాసంస్థలకు వస్తామంటూ ఒత్తిడి తేవద్దని విద్యార్థులకు సూచించింది. అదే క్రమంలో ఈరోజునుంచి విద్యాసంస్థలను తిరిగి తెరవాలంటూ కర్నాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను 14వతేదీకి వాయిదా వేసింది. ఇంతకీ కోర్టు ఏం చెప్పింది..? హిజాబ్ ధరించే విషయంలో తమ హక్కులను కాలరాయొద్దంటూ కొంతమంది కర్నాటక కోర్టు మెట్లెక్కారు. ఈ క్రమంలో విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం.. స్కూళ్లు, కాలేజీలు మూసివేయడంపై ఆందోళన వెలిబుచ్చింది. ముందు […]
హిజాబ్ వివాదంలో కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మతపరమైన దుస్తులు ధరించి విద్యాసంస్థలకు వస్తామంటూ ఒత్తిడి తేవద్దని విద్యార్థులకు సూచించింది. అదే క్రమంలో ఈరోజునుంచి విద్యాసంస్థలను తిరిగి తెరవాలంటూ కర్నాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను 14వతేదీకి వాయిదా వేసింది.
ఇంతకీ కోర్టు ఏం చెప్పింది..?
హిజాబ్ ధరించే విషయంలో తమ హక్కులను కాలరాయొద్దంటూ కొంతమంది కర్నాటక కోర్టు మెట్లెక్కారు. ఈ క్రమంలో విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం.. స్కూళ్లు, కాలేజీలు మూసివేయడంపై ఆందోళన వెలిబుచ్చింది. ముందు కర్నాటకలో విద్యాసంస్థలు తెరవాలని ఆదేశాలిచ్చింది. అదే క్రమంలో తుది తీర్పు వెలువడే వరకు ఎవరూ ధార్మిక దుస్తులు ధరించొద్దని సూచించింది. అలాంటి దుస్తులు ధరించి వస్తామంటూ ఒత్తిడి తేవద్దని సూచించింది. ఈ తీర్పు ఆర్టికల్ 25కి విరుద్ధంగా ఉందంటూ పిటిషనర్ల తరపు న్యాయవాది ప్రశ్నించగా.. అవి మధ్యంతర ఉత్తర్వులేనని, రోజువారీ విచారణ జరుపుతామని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది.
కోర్టు ఉత్తర్వుల ప్రకారం నేటినుంచి కర్నాటకలో స్కూల్స్, కాలేజీలు తిరిగి తెరవాల్సి ఉంది. అయితే దీనిపై అత్యవసర సమావేశం నిర్వహించిన సీఎం బసవరాజ్ బొమ్మై.. శుక్రవారం కూడా సెలవు అని గతంలోనే ప్రకటించినందున.. రెండో శనివారం, ఆదివారం కూడా సెలవలు కావడం వల్ల.. సోమవారం నుంచి పదో తరగతి వరకు స్కూల్స్ తెరిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి కాలేజీలు తెరుస్తామని ప్రకటించారు.
ఈ కేసుని సుప్రీంకోర్టుకి బదిలీ చేసుకోవాలంటూ వచ్చిన అభ్యర్థనను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ముందు కర్నాటక కోర్టు తీర్పునిచ్చేవరకు వేచి చూడాలని పిటిషనర్లకు సూచించారు. ఆ తర్వాత అవసరమైతే కేసుని సుప్రీంకు బదిలీ చేసే వినతి పరిశీలిస్తామన్నారు.
మరోవైపు ఇదే విషయంలో మద్రాస్ హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు దేవాలయాల్లో డ్రెస్ కోడ్ విధించాలంటూ దాఖలైన పిటిషన్ పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భండారీ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని మతం పేరుతో చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అసలు ఇక్కడ దేశం గొప్పదా.. మతం గొప్పదా అని ప్రశ్నించారు.