తెలుగు సినిమా ఇండస్ట్రీ కష్టాలకు శుభం కార్డు పడినట్టేనా..?
ఏపీలో సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు, బెనిఫిట్ షోల రద్దు.. ఇతరత్రా వ్యవహారాలతో సినీ ఇండస్ట్రీ కొన్నాళ్లుగా ఇబ్బంది పడుతోంది. దీనిపై ఇప్పటికే కొన్ని దఫాలు చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం జగన్ తో సినిమా ఇండస్ట్రీ పెద్దలు చిరంజీవి నేతృత్వంలో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం సినిమా ఇండస్ట్రీ కష్టాలకు శుభం కార్డు పడినట్టేనని చిరంజీవి ప్రకటించారు. తమ సూచనలను జగన్ సానుకూల దృక్పథంతో విన్నారని, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని, […]
ఏపీలో సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు, బెనిఫిట్ షోల రద్దు.. ఇతరత్రా వ్యవహారాలతో సినీ ఇండస్ట్రీ కొన్నాళ్లుగా ఇబ్బంది పడుతోంది. దీనిపై ఇప్పటికే కొన్ని దఫాలు చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం జగన్ తో సినిమా ఇండస్ట్రీ పెద్దలు చిరంజీవి నేతృత్వంలో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం సినిమా ఇండస్ట్రీ కష్టాలకు శుభం కార్డు పడినట్టేనని చిరంజీవి ప్రకటించారు. తమ సూచనలను జగన్ సానుకూల దృక్పథంతో విన్నారని, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని, త్వరలోనే దీనిపై తుది నిర్ణయం ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పారు చిరంజీవి.
చిన్న సినిమాలను బతికించే దిశగా..
చిన్న సినిమాలను బతికించే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు, దీనిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. కేవలం హీరోలు, హీరోయిన్ల రెమ్యునరేషన్లే ప్రామాణికంగా కాకుండా టెక్నాలజీ కారణంగా పెద్ద బడ్జెట్ తో వచ్చే సినిమాలకు కూడా సరైన ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం జగన్ ఇండస్ట్రీ తరపున వచ్చిన బృందానికి సూచించారు. అదే సమయంలో పండగలు, ఇతర ముఖ్యమైన సీజన్లలో చిన్న సినిమాలకు కూడా సముచిత స్థానం కల్పించాలని, థియేటర్లు కేటాయించాలని సూచించారు. రోజుకి ఐదు షో లు వేసుకునేందుకు అనుమతిచ్చే దిశగా ఆలోచిస్తున్నట్టు తెలిపారు.
విశాఖ కేంద్రంగా..
ఏపీలో సినీ ఇండస్ట్రీకి విశాఖ కేంద్రంగా రూపొందించాలని సినీ పెద్దలకు సూచించారు సీఎం జగన్. స్టూడియోల నిర్మాణాలకు స్థలం కేటాయిస్తామని, ఇతరత్రా రాయితీలు ఇస్తామని చెప్పారు. ఏపీలో సినిమాల చిత్రీకరణను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. మంత్రి పేర్నినానితో జరిగిన చర్చల్లో సినిమా మొత్తంలో కనీసం 20శాతం చిత్రీకరణ ఏపీలో జరిగేలా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తెలంగాణకంటే ఏపీ నుంచే తెలుగు సినిమాలకు ఎక్కువ కలెక్షన్లు వస్తుంటాయని ఈ భేటీలో జగన్ ప్రస్తావించారు. మొత్తమ్మీద సినీ ఇండస్ట్రీ బృందంతో సీఎం జగన్ భేటీ తర్వాత రెండు వర్గాలు సానుకూలంగా స్పందించాయి. సీఎం జగన్ సూచనలు బాగున్నాయని చిరంజీవి బృందం తెలిపింది. పెద్ద సినిమాలతోపాటు, చిన్న సినిమాలకు కూడా మంచి రోజులు వచ్చేలా చూస్తామని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది.