Telugu Global
NEWS

ఏపీ విభజనపై మోదీ వ్యాఖ్యలు.. తెలంగాణలో నిరసన సెగలు..

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుని ప్రధాని మోదీ రాజ్యసభలో తప్పుబట్టారు. రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత కూడా కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదని, దీనికి కారణం ఆనాటి అసంబద్ధ విభజనేనని అన్నారాయన. తెలంగాణ ఏర్పాటుకి బీజేపీ వ్యతిరేకం కాదని, తమ హయాంలో కూడా మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని గుర్తు చేసిన మోదీ.. ఏపీ విభజన సమయంలో పూర్తి స్థాయి చర్చ జరగలేదన్నారు. సభలో మైకులు ఆపేశారని, కాంగ్రెస్ సభ్యులు […]

ఏపీ విభజనపై మోదీ వ్యాఖ్యలు.. తెలంగాణలో నిరసన సెగలు..
X

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుని ప్రధాని మోదీ రాజ్యసభలో తప్పుబట్టారు. రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత కూడా కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదని, దీనికి కారణం ఆనాటి అసంబద్ధ విభజనేనని అన్నారాయన. తెలంగాణ ఏర్పాటుకి బీజేపీ వ్యతిరేకం కాదని, తమ హయాంలో కూడా మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని గుర్తు చేసిన మోదీ.. ఏపీ విభజన సమయంలో పూర్తి స్థాయి చర్చ జరగలేదన్నారు. సభలో మైకులు ఆపేశారని, కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ప్రే కొట్టారని, కాంగ్రెస్ అహంకారం, అధికార కాంక్షకు అదే నిదర్శనం అని చెప్పారు. విభజన తీరు సరిగా లేదన్నారు.

తెలంగాణలో నిరసన సెగలు..
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై తెలంగాణలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ ఏకతాటిపైకి వచ్చాయి. మోదీ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ప్రదర్శనలు చేపట్టాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు మోదీ దిష్టిబొమ్మల్ని దహనం చేయాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు అని బీజేపీ తీర్మానం చేయలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తామని చెప్పి వాజ్‌ పేయి మోసం చేశారని గుర్తు చేశారు. ఏపీ విభజనపై చేసిన వ్యాఖ్యలకు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వందలమంది ఆత్మ బలిదానాలకు బీజేపీయే కారణం అన్నారు రేవంత్ రెడ్డి. ఏపీ నేతలు ఎంత ఒత్తిడి చేసినా.. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, ఒక ప్రాంతంలో పూర్తిగా నష్టపోతామని తెలిసినా కొత్త రాష్ట్రం ఏర్పాటు చేశాని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా ఉద్యమాల ద్వారా ఎదగలేదని, బీజేపీ సీనియర్‌ నేతలను మోసం చేసి మోదీ పదవులు పొందారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

దశాబ్దాల స్ఫూర్తిదాయక పోరాటాన్ని, ప్రజల త్యాగాన్ని నరేంద్రమోదీ పదే పదే అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు మంత్రి కేటీఆర్. ప్రధాని అసంబద్ధ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు ట్విట్టర్‌ లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

మోదీకి అంత అక్కసు ఎందుకు..?
తెలంగాణపై మోదీ మరోసారి తన అక్కసు వెళ్లగక్కారంటూ మరో మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. అభివృద్ధిలో తెలంగాణ, గుజరాత్ ని దాటిపోతోందని మోదీ భయపడుతున్నారని, తెలంగాణ ఏర్పాటు వల్ల మోదీకి అంత బాధ ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ హయాంలో తెలంగాణ ఇచ్చి ఉంటే వందలమంది ఆత్మబలిదానాలు జరిగేవి కాదని అన్నారు. కనీసం కాంగ్రెస్ అయినా 2004లో తెలంగాణ ఏర్పాటు చేసి ఉంటే యువకుల ఆత్మార్పణలు జరిగేవి కాదన్నారు హరీష్ రావు. అవకాశం వచ్చినపుడల్లా ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలను అవమాన పరిచినట్లు మాట్లాడుతున్నారని, తెలంగాణ బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని మోదీ వ్యాఖ్యలను సమర్థిస్తారని మండిపడ్డారు. మొత్తమ్మీద మోదీ వ్యాఖ్యలతో తెలంగాణలో నిరసనలు పెల్లుబుకుతున్నాయి.

First Published:  9 Feb 2022 3:54 AM IST
Next Story