Telugu Global
NEWS

నిరసన బాటపట్టిన ఉపాధ్యాయులు.. నల్లబ్యాడ్జీలతో తరగతులకు..

ఏపీ పీఆర్సీ సాధన సమితి, మంత్రుల కమిటీతో జరిగిన చర్చలు సఫలమయ్యాయంటూ సమ్మెను వాయిదా వేసినా.. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. శనివారం రాత్రి సమ్మె విరమించుకున్నట్టు పీఆర్సీ సాధన సమితి ప్రకటించింది, ఆదివారం అన్ని కార్యాలయాలకు సెలవు కావడంతో.. సోమవారం నుంచి ఉపాధ్యాయులు ఆందోళన బాటపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి తరగతులకు హాజరయ్యారు. కొత్త పీఆర్సీ వల్ల ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌ఆర్‌ఏ కనీస శ్లాబు 12శాతానికి పైగా ఉండాలని డిమాండ్‌ […]

నిరసన బాటపట్టిన ఉపాధ్యాయులు.. నల్లబ్యాడ్జీలతో తరగతులకు..
X

ఏపీ పీఆర్సీ సాధన సమితి, మంత్రుల కమిటీతో జరిగిన చర్చలు సఫలమయ్యాయంటూ సమ్మెను వాయిదా వేసినా.. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. శనివారం రాత్రి సమ్మె విరమించుకున్నట్టు పీఆర్సీ సాధన సమితి ప్రకటించింది, ఆదివారం అన్ని కార్యాలయాలకు సెలవు కావడంతో.. సోమవారం నుంచి ఉపాధ్యాయులు ఆందోళన బాటపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి తరగతులకు హాజరయ్యారు. కొత్త పీఆర్సీ వల్ల ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌ఆర్‌ఏ కనీస శ్లాబు 12శాతానికి పైగా ఉండాలని డిమాండ్‌ చేశారు. దశలవారీ పోరాటాలకు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉపాధ్యాయులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు.

పీఆర్సీ సాధన సమితి చర్చల్లో ముఖ్యంగా ఐఆర్ రికవరీ, ఐదేళ్ల పీఆర్సీ, హెచ్ఆర్ఏ శ్లాబుల్లో మార్పులు అనేవి కీలక అంశాలు అయితే మొదటినుంచీ ఫిట్ మెంట్ పెంపు కోసం డిమాండ్ చేస్తున్న ఉద్యోగులు స్పష్టమైన హామీ లేకుండానే సమ్మె విరమించాల్సి వచ్చింది. దీంతో ఉపాధ్యాయులు ఫిట్ మెంట్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ఫిట్‌ మెంట్‌ 27శాతం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. సీపీఎస్‌ రద్దుకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. ఐదురోజులపాటు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని చెబుతున్నారు. శుక్రవారం అన్ని జిల్లాల్లో.. కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు.

పెద్ద నగరాల్లో అద్దెలు ఎక్కువగా ఉన్నాయని, పీఆర్సీ జీవోల వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత స్టీరింగ్ కమిటీ నాయకులను తాము నమ్మే పరిస్థితి లేదని, ఉపాధ్యాయ సంఘాలే విడిగా పోరుబాట పడుతున్నాయని స్పష్టం చేశారు. వీరితోపాటు.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఈరోజు కలెక్టరేట్ల వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కొన్నిచోట్ల పోలీసులు వీరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.

First Published:  7 Feb 2022 3:01 AM GMT
Next Story