Telugu Global
NEWS

చర్చలు సానుకూలం.. అయినా కార్యాచరణ ఆగదన్న ఉద్యోగులు..

పీఆర్సీ సాధన సమితి నాయకులతో ఏపీ మంత్రుల కమిటీ అర్థరాత్రి వరకూ జరిపిన చర్చలు సానుకూలంగా ముగిసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతినిధులు ఉద్యోగుల్లో అపోహలు తొలగిపోయాయని, దాదాపుగా అన్ని అంశాల్లో సానుకూలత ఏర్పడినట్టు ప్రకటించారు. అయితే ఉద్యోగులు మాత్రం తమకు పూర్తి న్యాయం జరిగే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టతనిచ్చారు. చర్చలు విఫలమైతే సమ్మెకు సిద్ధమేనని ప్రకటించారు. ఐఆర్ రికవరీ చేయట్లేదు.. రెండురోజుల క్రితం ఐఆర్ ను వడ్డీలేని రుణంగా భావించాలంటూ సీఎస్ సమీర్ శర్మ […]

చర్చలు సానుకూలం.. అయినా కార్యాచరణ ఆగదన్న ఉద్యోగులు..
X

పీఆర్సీ సాధన సమితి నాయకులతో ఏపీ మంత్రుల కమిటీ అర్థరాత్రి వరకూ జరిపిన చర్చలు సానుకూలంగా ముగిసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతినిధులు ఉద్యోగుల్లో అపోహలు తొలగిపోయాయని, దాదాపుగా అన్ని అంశాల్లో సానుకూలత ఏర్పడినట్టు ప్రకటించారు. అయితే ఉద్యోగులు మాత్రం తమకు పూర్తి న్యాయం జరిగే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టతనిచ్చారు. చర్చలు విఫలమైతే సమ్మెకు సిద్ధమేనని ప్రకటించారు.

ఐఆర్ రికవరీ చేయట్లేదు..
రెండురోజుల క్రితం ఐఆర్ ను వడ్డీలేని రుణంగా భావించాలంటూ సీఎస్ సమీర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని కలుగజేశాయి. అదే సమయంలో ఉద్యోగులనుంచి ఎలాంటి రికవరీలు ఉండకూడదని హైకోర్టు కూడా స్పష్టం చేయడంతో మంత్రుల కమిటీ కూడా దీనిపై ప్రధానంగా దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఐఆర్ రికవరీ చేయబోమని ఉద్యోగ సంఘాల నాయకులకు హామీ ఇచ్చింది. పీఆర్సీ పదేళ్ల వ్యవధిని గతంలోలాగా ఐదేళ్లకే పరిమితం చేస్తామని చెప్పింది.

హెచ్ఆర్ఏ, సీపీఎస్ పై పీటముడి..
ఐఆర్, పీఆర్సీ వ్యవధిపై స్పష్టత వచ్చినా.. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు, ఫిట్‌ మెంట్‌ పెంచడం, సీపీఎస్‌ రద్దు వంటి అంశాలపై మంత్రుల కమిటీ స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయింది. అసలు చిక్కంతా హెచ్ఆర్ఏ, ఫిట్ మెంట్ లోనే ఉంది. హెచ్ఆర్ఏ శ్లాబుల్లో కోత, ఫిట్ మెంట్ ఆశించిన స్థాయికంటే తక్కువగా ఉండటం వల్లే ఉద్యోగులు తమ జీతాలు తగ్గిపోతాయంటున్నారు. వీటిపై ఈరోజు చర్చలు కొనసాగే అవకాశముంది.

చలో విజయవాడ తర్వాత మారిన పరిణామాలు..
చలో విజయవాడ కార్యక్రమం తర్వాత ఏపీలో పరిణామాలు వేగంగా మారాయి. అప్పటి వరకు పీఆర్సీపై కాస్త పట్టుదలతో ఉన్న ప్రభుత్వం, ఉద్యోగులతో చర్చలు తిరిగి ప్రారంభించే విషయంలో చొరవ చూపించింది. సుదీర్ఘ చర్చల అనంతరం కొన్ని సానుకూల నిర్ణయాలను మంత్రుల కమిటీ వెల్లడించింది. అయితే ఉద్యోగులు మాత్రం తమ డిమాండ్లన్నిటినీ పూర్తిగా ఒప్పుకుంటేనే వెనక్కు తగ్గుతామని స్పష్టం చేశారు. అంతే కాదు, నోటి మాట కాకుండా లిఖిత పూర్వక హామీ కాావాలంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం చర్చల్లో కొన్ని సానుకూల పరిణామాలు జరిగినా, ఈరోజు వాటిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది. ఇక చర్చల్లో ఏమాత్రం తేడా జరిగినా సమ్మెకు వెళ్లడం ఖాయమని తేల్చి చెబుతున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఉద్యమ కార్యాచరణ వాయిదా వేసుకునే ప్రసక్తే లేదంటున్నారు.

First Published:  5 Feb 2022 3:17 AM IST
Next Story