Telugu Global
National

ప్రైవేట్ సంస్థల్లో లోకల్ రిజర్వేషన్లపై పంజాబ్ హైకోర్ట్ స్టే..

ప్రభుత్వ నియామకాల్లో రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదంటారు. అలాంటిది ప్రైవేట్ సంస్థల్లో ఏకంగా 75శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలంటూ.. హర్యానా ప్రభుత్వం ఆమధ్య సంచలన చట్టం తీసుకొచ్చింది. ఈ ఏడాది జనవరి 15నుంచి దాన్ని అమలులో పెట్టింది కూడా. అయితే అప్పటికే దానిపై న్యాయవిచారణ మొదలైంది. వివాదాస్పదంగా ఉన్న ఈ చట్టంపై పంజాబ్-హర్యానా హైకోర్ట్ స్టే విధించింది. అసలేంటీ చట్టం.. పంజాబ్ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పట్టుబట్టి మరీ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. హర్యానాలోని కంపెనీల్లో స్థానికులకే […]

ప్రైవేట్ సంస్థల్లో లోకల్ రిజర్వేషన్లపై పంజాబ్ హైకోర్ట్ స్టే..
X

ప్రభుత్వ నియామకాల్లో రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదంటారు. అలాంటిది ప్రైవేట్ సంస్థల్లో ఏకంగా 75శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలంటూ.. హర్యానా ప్రభుత్వం ఆమధ్య సంచలన చట్టం తీసుకొచ్చింది. ఈ ఏడాది జనవరి 15నుంచి దాన్ని అమలులో పెట్టింది కూడా. అయితే అప్పటికే దానిపై న్యాయవిచారణ మొదలైంది. వివాదాస్పదంగా ఉన్న ఈ చట్టంపై పంజాబ్-హర్యానా హైకోర్ట్ స్టే విధించింది.

అసలేంటీ చట్టం..
పంజాబ్ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పట్టుబట్టి మరీ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. హర్యానాలోని కంపెనీల్లో స్థానికులకే 75శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా దీన్ని రూపొందించారు. కొన్ని ప్రైవేటు సంస్థలు దీన్ని స్వాగతించినా.. మరికొన్ని సంస్థల యాజమాన్యాలు తీవ్రంగా అభ్యంతరం తెలిపాయి. రాజ్యాంగంలోని 16వ ఆర్టికల్ కి విరుద్ధంగా ఈ చట్టం ఉందంటూ కోర్టు మెట్లెక్కాయి. మనేష్ ఇండస్ట్రీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున అడ్వొకేట్ తుషార్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. లోకల్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొత్తం 8 పిటిషన్లు దాఖలు కాగా.. కోర్టు విచారణ జరిపి స్టే విధించింది.

టాలెంట్ కి అవకాశం లేదా..?
సహజంగా ప్రైవేటు కంపెనీలు ప్రతిభకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. అలాంటిది 75శాతం ఉద్యోగాలను స్థానికత పేరుతో పక్కనపెడితే ఎలా.. అనేది ఆయా కంపెనీల ప్రశ్న. అందులోనూ ఆర్టికల్ 16 ద్వారా లభించే సమాన అవకాశాలకు అది విఘాతం కలిగిస్తోందని కంపెనీలు ఆరోపిస్తున్నాయి. హై కోర్టు స్టే విధించడంతో ఆయా కంపెనీల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేశాయి.

తగ్గేదే లేదు..
అయితే స్థానిక రిజర్వేషన్ల విషయంలో తగ్గేదే లేదని అంటున్నారు హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా. న్యాయనిపుణులతో సంప్రదించి కౌంటర్ దాఖలు చేస్తామంటున్నారు. కోర్టు కేవలం స్టే విధించిందని, తమకు మరో అవకాశం ఉందని చెప్పారు. హర్యానాలో నిరుద్యోగిత తగ్గాలంటే స్థానిక రిజర్వేషన్లు తప్పనిసరి అని అంటున్నారాయన.

First Published:  4 Feb 2022 3:06 AM IST
Next Story