పీఆర్సీ బిల్లులు చేయని అధికారులకు ఏపీ ప్రభుత్వం మెమోలు..
కొత్త పీఆర్సీ బిల్లులు ప్రాసెస్ చేయని అధికారులకు ఏపీ ప్రభుత్వం మెమోలు జారీ చేసింది. ఇదివరకే ఈ విషయంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ హెచ్చరించినా, ఉద్యోగులు కొత్త పీఆర్సీ ప్రకారం బిల్లులు ప్రాసెస్ చేయలేదు. దీంతో రెండురోజులు గడువు ఇచ్చిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 27 మందికి మెమోలు జారీ చేసింది. అందులో ముగ్గురు డీడీలు, 21 మంది సబ్ ట్రెజరీ ఆఫీసర్లు, ఇద్దరు ఏటీఓలు ఉన్నారు. జీతాల బిల్లులు సిద్ధం చేయడంలో నిర్లక్ష్యంగా […]
కొత్త పీఆర్సీ బిల్లులు ప్రాసెస్ చేయని అధికారులకు ఏపీ ప్రభుత్వం మెమోలు జారీ చేసింది. ఇదివరకే ఈ విషయంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ హెచ్చరించినా, ఉద్యోగులు కొత్త పీఆర్సీ ప్రకారం బిల్లులు ప్రాసెస్ చేయలేదు. దీంతో రెండురోజులు గడువు ఇచ్చిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 27 మందికి మెమోలు జారీ చేసింది. అందులో ముగ్గురు డీడీలు, 21 మంది సబ్ ట్రెజరీ ఆఫీసర్లు, ఇద్దరు ఏటీఓలు ఉన్నారు. జీతాల బిల్లులు సిద్ధం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగాను అధికారులు.. ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేసినట్టు తెలిపారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ తాజాగా ఆర్డినెన్స్ జారీ అయింది. 2022 జనవరి 1నుంచి ఈ ఉత్వర్వులు అమల్లోకి వస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతకం చేశారు.
కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు..
కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగుల వేతనాలను చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఫిబ్రవరి ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. పీఆర్సీ జీవోలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రుల కమిటీ సీఎంతో సమావేశమైంది. బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ అధికారులు సీఎం జగన్ తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స, కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాల చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఒకసారి జీవో ఇచ్చిన తర్వాత దాని ప్రకారమే వేతనాలు వస్తాయన్నారు. ఫిట్ మెంట్, హెచ్ఆర్ఏ, డీఏలు అన్నీ కొత్త జీవోల ప్రకారమే చెల్లిస్తామన్నారు.
ఉద్యోగులే చర్చలకు రాలేదు..
ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించామని, వారి కోసం ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ 3 రోజుల పాటు ఎదురు చూసిందని చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఉద్యోగ సంఘాలు అంటున్నాయని, అందుకే వేతనాలు వేస్తున్నామని వివరించారు. ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇక్కడి నాయకత్వంపై విశ్వాసం లేకపోతే ఎలా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కించపరిచేలా మాట్లాడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బాధ్యత గల వ్యక్తులుగా, రాష్ట్ర ప్రజల కస్టోడియన్లుగా.. మంత్రులు ఎక్కడా బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేయటం లేదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలు, ప్రభుత్వ ఇబ్బందుల దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు తమ డిమాండ్లను వినిపించాలని కోరారు.