Telugu Global
National

ఎన్నికల బరిలో 'విజయ్ మక్కల్ ఇయ్యక్కమ్'..!

తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంత స్టార్ డమ్ ఉన్న నటుడిగా విజయ్ పేరు తెచ్చుకున్నాడు. తమిళనాడులో ఎంతో మంది నటులు ముందు సినిమాల్లో రాణించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. విజయ్ కూడా కొన్నేళ్లుగా రాజకీయాల్లోకి వస్తాడని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికలకు ముందు విజయ్ తండ్రి ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ ‘విజయ్ మక్కల్ ఇయ్యక్కమ్’ పేరుతో పార్టీ పేరును కూడా రిజిస్టర్ చేయించారు. అయితే ఆ పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదని […]

ఎన్నికల బరిలో విజయ్ మక్కల్ ఇయ్యక్కమ్..!
X

తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంత స్టార్ డమ్ ఉన్న నటుడిగా విజయ్ పేరు తెచ్చుకున్నాడు. తమిళనాడులో ఎంతో మంది నటులు ముందు సినిమాల్లో రాణించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. విజయ్ కూడా కొన్నేళ్లుగా రాజకీయాల్లోకి వస్తాడని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికలకు ముందు విజయ్ తండ్రి ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ ‘విజయ్ మక్కల్ ఇయ్యక్కమ్’ పేరుతో పార్టీ పేరును కూడా రిజిస్టర్ చేయించారు. అయితే ఆ పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదని విజయ్ ప్రకటించాడు.

ఎన్నికల్లో తన ఫోటో గాని, పేరు గాని వినియోగించవద్దని హెచ్చరించాడు. ఈ విషయమై తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు తలెత్తాయని కూడా ప్రచారం జరిగింది. కాగా తమిళనాడులో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయ్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేసి 129 వార్డుల్లో విజయం సాధించారు. అయితే ఆ తరువాత మారిన పరిస్థితుల్లో వార్డుల్లో విజయం సాధించిన అభ్యర్థులు విజయ్ ను కలిసి ఫోటోలు దిగారు.

దీంతో విజయ్ మక్కల్ ఇయ్యక్కమ్ ద్వారా తన రాజకీయ రంగ ప్రవేశానికి విజయ్ పునాదులు వేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. కాగా వచ్చే నెల 19వ తేదీన తమిళనాడులో నగరపాలక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా విజయ్ మక్కల్ ఇయ్యక్కమ్ తరపున అభ్యర్థులు పోటీ చేయనున్నారు. అభిమానులు ఎన్నికల బరిలో దిగడానికి అనుమతి కూడా వచ్చినట్లు విజయ్ మక్కల్ ఇయ్యక్కమ్ అధ్యక్షుడు బుస్సీ ఆనంద్ ప్రకటించారు.

ఈ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు విజయ్ ఫోటోలను, ఇయ్యక్కమ్ పతాకాన్ని ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఇందుకు విజయ్ కూడా ఒప్పుకున్నట్లు వెల్లడించారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను విజయ్ మక్కల్ ఇయ్యక్కమ్ జిల్లా ఇన్చార్జిలు ఖరారు చేస్తారని బుస్సీ ఆనంద్ తెలిపారు. నగర పాలక ఎన్నికల్లో విజయ్ మక్కల్ ఇయ్యక్కమ్ పోటీ చేసేందుకు విజయ్ అంగీకారం తెలపడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

First Published:  28 Jan 2022 1:13 AM GMT
Next Story