Telugu Global
National

కేసులు తగ్గుతున్నాయి.. ఆంక్షలు సవరిస్తున్నారు..

భారత్ లో రోజువారీ కొవిడ్ కేసుల పెరుగుదల స్వల్పంగా తగ్గింది. ఓ దశలో రోజువారీ కేసులు 3 లక్షలకు చేరుకుని ఆందోళన కలిగించినా.. ఆ తర్వాత మెల్లగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం 3 లక్షల దిగువకే కొవిడ్ రోజువారీ కొత్త కేసుల సంఖ్య పరిమితం అవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే సడలింపులు ఇచ్చాయి. కర్నాటక వారాంతపు లాక్ డౌన్ తీసేసింది, మహారాష్ట్రలో కూడా ఆంక్షలు సడలించారు. తాజాగా తమిళనాడు, ఢిల్లీలో కూడా ఆంక్షలను సవరిస్తూ […]

కేసులు తగ్గుతున్నాయి.. ఆంక్షలు సవరిస్తున్నారు..
X

భారత్ లో రోజువారీ కొవిడ్ కేసుల పెరుగుదల స్వల్పంగా తగ్గింది. ఓ దశలో రోజువారీ కేసులు 3 లక్షలకు చేరుకుని ఆందోళన కలిగించినా.. ఆ తర్వాత మెల్లగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం 3 లక్షల దిగువకే కొవిడ్ రోజువారీ కొత్త కేసుల సంఖ్య పరిమితం అవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే సడలింపులు ఇచ్చాయి. కర్నాటక వారాంతపు లాక్ డౌన్ తీసేసింది, మహారాష్ట్రలో కూడా ఆంక్షలు సడలించారు. తాజాగా తమిళనాడు, ఢిల్లీలో కూడా ఆంక్షలను సవరిస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి.

థర్డ్ వేవ్ అనే భయం మొదలైనా.. కేసుల సంఖ్య సాధారణ స్థాయిని మించి పెరిగినా.. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య మాత్రం పెరగలేదు. మరణాల సంఖ్య కూడా గతంతో పోల్చి చూస్తే బాగా తక్కువ. అందుకే ఈసారి కర్ఫ్యూల విషయంలో కూడా కేంద్రం మౌనంగా ఉంది, రాష్ట్రాలు కూడా పండగల వేళ కఠిన నిర్ణయాలు తీసుకున్నా.. ఆ తర్వాత మినహాయింపులిచ్చాయి. తమిళనాడులో ఫిబ్రవరి 1నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభించబోతున్నారు. ఒకటి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని, ప్లే స్కూల్స్‌, ఎల్ కేజీ, యూకేజీ విద్యార్థులకు మాత్రం ప్రత్యక్ష తరగతులు నిలిపివేస్తున్నట్లు స్టాలిన్ సర్కారు పేర్కొంది. 10 -12 తరగతులకు సంబంధించిన బోర్డు పరీక్షలు కూడా షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని స్పష్టం చేశారు అధికారులు. ఈరోజు నుంచి రాత్రి కర్ఫ్యూ కూడా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. రెస్టారెంట్లు, సెలూన్లు, సినిమా హాళ్లు, వ్యాయామశాలలు, యోగా సెంటర్లు మాత్రం 50శాతం ఆక్యుపెన్సీతో కొనసాగుతాయని స్పష్టం చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా నైట్ కర్ఫ్యూ పేరుతో ఉన్న ఆంక్షలను ప్రభుత్వం తొలగించింది. షాపులు సరి, బేసి సంఖ్యల ప్రకారం తెరవాలనే నిబంధన కూడా తీసేసింది. సినిమా థియేటర్లు, రెస్టారెంట్లను మాత్రం 50 శాతం సామర్థ్యంతో నడుపుకొనేలా అనుమతి ఇచ్చింది. ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి స్కూళ్లు, కాలేజీలు మాత్రం మూసే ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రస్తుతానికి కొవిడ్ ఆంక్షల్లో ఎలాంటి మార్పులు లేవు. ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది, స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా తెరిచే ఉన్నాయి. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అమలులో లేకపోయినా విద్యా సంస్థలకు మాత్రం తాళం పడింది. కొత్త కేసుల నమోదు మరింత తగ్గితే త్వరలో తెలుగు రాష్ట్రాలు కూడా నిబంధనలు సడలించే అవకాశముంది.

First Published:  28 Jan 2022 2:54 AM IST
Next Story